పొన్నియన్ సెల్వన్-2 లోని "వీర రాజ వీర" అనే పాట నిన్న యూట్యూబ్ లో విన్నాను.అది తమిళ వెర్షన్. రోమాలు నిక్కబొడిచినాయి. ఏ.ఆర్.రెహమాన్ కంపోజిషన్ అద్భుతం.శాస్త్రీయ సంగీతం బేస్ చేసుకొని నూతన తరానికి కూడా నచ్చేలా చేశాడు. దాంట్లోని సాహిత్యం సైతం అతి మనోహరం.చోళుల వైభవాన్ని,వీరత్వాన్ని,రాజ్య విస్తరణని తమిళ కవి గొప్పగా రాశాడు.ఇటు వచ్చి తెలుగు లో విన్నాను.కొన్నిసార్లు మంచి పాటలు డబ్బింగ్ లో ఖూని అవుతుంటాయి. చంద్రబోస్ కూడా నిజం గా తమిళ వెర్షన్ కి ఏ మాత్రం తగ్గకుండా రాశాడు.అలాగే రీ రికార్డింగ్ కూడా చాలా క్వాలిటి తో ఉంది.ఈ మధ్య కాలం లో వచ్చిన ఓ అరుదైన సాంగ్ అని చెప్పవచ్చు.
పొన్నియన్ సెల్వన్ పోస్టర్ ల మీద చూస్తే మీకు ఆ టైటిల్ కింద Based on Kalki's novel అని కనిపిస్తుంది.ఒక గొప్ప నవల ని ,తమ చరిత్ర ని వివరించే నవలని తమిళులు గర్వంగా సినిమా తీసి ప్రపంచం మీదికి వదిలారు.ఎంత ధనం వచ్చింది వేరే మాట కాని చోళుల వైభవాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు,మరి ఆ విధంగా ఏ తెలుగు నవల ని అయినా మన వాళ్ళు ఇంతవరకూ చూపించగలిగారా..?ఇంగ్లీష్,హిందీ,ఇంకా ఇతర అనేక భాషల సినిమాల నుంచి రకరకాల మంచి సీన్లని లేపేసి కిచిడీ చిత్రాలు తీయడం తప్పా.మన తెలుగు లోనూ ఎన్నో గొప్ప చారిత్రక నవలలు ఉన్నాయి,కాకపోతే వాటి మీద దృష్టి పెట్టే తీరిక మనకి లేదు.
అలాంటి అభిరుచి ని కూడా మన సినిమా పెద్దలు ఎక్కడ ప్రొత్సహించారని..?తమిళం లోనూ పక్కా మాస్ సినిమాలు వస్తాయి.అలాగే మంచి ఆలోచనాత్మకమైన సినిమాలూ వస్తాయి.అలా తీయగలిగే వాతావరణాన్ని అక్కడ సమాజం కలిగించగా,మన సినిమా ఫీల్డ్ మాత్రం అత్తెసరు కుల మాఫియా బారిన బడి మేం తీసిందే సినిమా అన్నట్లు చేస్తున్నారు.అయితే ఈ ఓటిటి యుగం లో ఆ ఆటలు ఇకచెల్లవు.కాబట్టే సగటు తెలుగువాడు ఓటిటి లో ప్రతి మంచి సినిమా ని , ఏ భాష అయినా సరే చూస్తున్నాడు.