Pages

2, ఆగస్టు 2026, ఆదివారం

రష్యా-యుక్రెయిన్ యుద్ధం లో బడుగు దేశాల ప్రజలు బలి

గత శుక్రవారం సుప్రీం కోర్ట్ ఒక తీర్పు ఇచ్చింది. అదేమిటంటే రష్యా వెళ్ళి  అక్కడి యుద్ధం లో ఫాల్గొని మరణించిన మరియు గాయపడిన వ్యక్తులకి సహాయ కార్యక్రమాలు చేపట్టడానికి ఒక నోడల్ ఆఫీసర్ ని నియమించమని విదేశాంగ శాఖ ని కోరింది. ఈ వార్త చూడగానే అసలు వీళ్ళు ఎందుకు వెళ్ళి ఆ యుక్రెయిన్ రష్యా యుద్ధం లో ఫాల్గొన్నారు అనే సందేహం రావడం ఎవరికైనా సహజం. కొన్ని రిక్రూట్మెంట్ ఏజెన్సీ లు వీరిని కార్పెంటరీ,కన్స్ట్రక్షన్ ఇంకా చిన్నా చితకా ఉద్యోగాలకి మంచి జీతం వస్తుందని రష్యా తీసుకెళ్ళి వదిలేశారని,అక్కడ వీరిని బలవంతంగా ఆర్మీ లోకి వినియోగించుకున్నారని ఆ తర్వాత వార్తలు వచ్చాయి.ముఖ్యంగా రాజస్థాన్,హర్యానా,పంజాబ్ నుంచి వెళ్ళారు. 

అయితే ఇది పూర్తిగా నమ్మదగినదా అంటే కూడా సందేహమే. రష్యా కి ప్రస్తుతం ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాడే సోల్జర్స్ కావాలి.స్థానికులు ఆర్మీ లో చేరడానికి నిరాసక్తత చూపించడం వల్ల రష్యా మాత్రమే కాదు యుక్రెయిన్ కూడా విదేశాల నుంచి ముఖ్యంగా ఆసియా,ఆఫ్రికా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి సైనికుల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు.రకరకాల డిసెప్టివ్ నెట్ వర్క్ ల ద్వారా పెద్ద ఎత్తున వేతనాల్ని ఇంకా సిటిజెన్ షిప్ ని ఆశ చూపి చేర్చుకుంటున్నారు. అయితే వీళ్ళు చనిపోతే కనీసం శవాల్ని కూడా తిరిగి ఇవ్వడం లేదు. మన దేశం నుంచి వెళ్ళిన వాళ్ళలో  41 మంది చనిపోతే, శవాలు యుద్ధభూమి లో వెదకి ఇవ్వడం కష్టమైన పని రష్యన్ అధికారులు చెప్పారు.

ఉక్రెయిన్ దేశం దాదాపు 100 దేశాల నుంచి విదేశీ సైనికుల్ని రిక్రూట్ చేసుకుంది.కెన్యా,జింబాబ్వే,ఈజిప్ట్,ఘనా లాంటి పేద దేశాల నుంచి ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుంది. వీరిలో ఎక్కువమంది వారం కూడా బ్రతకడం కష్టం.ఎందుకంటే ఫ్రంట్ లైన్ లో ఉండే వారిపై ముందుగా దాడులు జరుగుతాయి.ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టే తమ పౌరుల్ని సాధ్యమైనంత ఎక్కువమందిని కాపాడుకోవడానికి ఈ వ్యూహం అవలంబిస్తున్నారు. ఇప్పటి దాకా ఉక్రేయిన్ 4000 మందిని విదేశాల నుంచి రిక్రూట్ చేసుకోగా,రష్యా 18000 మందిని రిక్రూట్ చేసుకుంది. ఇవి ఇంకా సాగుతూనే ఉంటాయని అంతర్జాతీయ మీడియా చెబుతోంది.

నార్త్ కొరియా కి చెందిన ఇలాంటి కిరాయి సైనికులు మూడు వారాల్లో పదివేలమంది చనిపోయారు. ఆఫ్రికన్ దేశాల నుంచి వెళ్ళిన వారిలో కూడా కొన్ని వందల మంది మరణించినట్లు భోగట్టా. వెనిజులా నుంచి వెళ్ళిన వారిలో కొంతమంది మరణించగా,వారి బంధువులు యుక్రెయిన్ దేశం ఇస్తామన్న పరిహారం కోసం వెళ్ళగా రిక్తహస్తం చూపారు. మొదటి,రెండవ ప్రపంచ యుద్ధాల్లో ధనిక దేశాల ప్రయోజనాల కోసం మన దేశం లాంటి బడుగు దేశాలు ఎలా సైన్యం లో చేర్పించబడి ప్రాణాలు పోగొట్టుకున్నారో మనకి తెలుసు. అలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయనడానికి ప్రస్తుతం జరుగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధమే సాక్షి అని చెప్పవచ్చు.   

--- మూర్తి కెవివిఎస్

21, జులై 2026, మంగళవారం

ఒడిస్సీ చిత్రం : ఒక పరిశీలన


క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం లో ఇటీవల వచ్చిన ఒడిస్సీ సినిమా అన్నీ ప్రధానమైన భారతీయ భాషల్లోకి అనువదింపబడి మంచి కలెక్షన్లు రాబడుతోంది. క్రీ.పూ.8 వ శతాబ్దం లో గ్రీకు కవి హోమర్ 700 పద్యాల్లో రాసిన ఒడిస్సీ అనే మహాకావ్యం యొక్క సారాంశం ఈరోజున మన దేశం లోని ప్రతి మూలకి ఈ సినిమా ద్వారా విస్తరించింది.

నూటికి నూరు పాళ్ళు ఆ కావ్యం లో ఉన్నట్లు సినిమా తీయడం అసాధ్యం. కాబట్టి కొంత స్వేచ్ఛని దర్శకుడు తీసుకున్నా తప్పుబట్టనవసరం లేదు. గతం లో అనేక సినిమాలు,వెబ్ సిరీస్ లు ఇదే కథ ని ఆధారంగా చేసుకుని వచ్చాయి.

 అయినప్పటికీ ప్రస్తుత సినిమా ప్రత్యేకత వేరు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన మహా కావ్యాలు అన్నిటి లోనూ ఒక దగ్గరితనం,పోలిక ఉంటుంది.అందుకనే అవి ఏ భాష లో వచ్చినా మనిషి మనసు ని ఆకట్టుకుంటాయి.కథానాయకుని ధీరోదాత్త గుణం, ఎన్నో కష్టాల్ని ఎదుర్కుని చివరకి విజయం సాధించడం,నమ్మిన విలువల కోసం చివరికంటా నిలబడటం ఇవన్నీ ఆయా కావ్యాల్లో అంతర్లీనం గా ఉంటాయి.

ఒడిస్సీ చూసిన చాలామంది రామాయణం కి దగ్గరగా ఉంది అనడం వినబడుతోంది. దానికి కారణం అదే. ఆ విశ్వజనీనమైన ఆకాంక్షల్ని ప్రేక్షకులు అనుభూతించడమే దాన్నికి కారణం.

కథ విషయానికి వస్తే,ఇథాకా దేశపు రాజు ఒడిస్యూస్ ట్రోజన్ యుద్ధం లో ఎన్నో మాయోపాయాలతో గెలుస్తాడు.చెక్క గుర్రం లో తన అనుచరులతో పాటు దాక్కుని తగిన సమయం లో బయటకి వచ్చి శత్రు రాజ్యాన్ని గెలుస్తాడు.

ఇదంతా ఒక ఎత్తయితే అక్కడి నుంచి మళ్ళీ తన రాజ్యానికి రావడం లో ఎన్నో పరీక్షల్ని ఎదుర్కుంటాడు.తిరిగివచ్చే క్రమం లో 20 ఏళ్ళు పడతాయి.ఈలోపు రాజ్యం లో ప్రధాన నాయకుడు కుట్ర చేసి అంతహపురం ని తన చేతిలోకి తెచ్చుకుండానికి ప్రయత్నిస్తుంటాడు. రాణి,తన కుమారుడు,పాత అనుచరులు తనని ఏ మేరకు ఆమోదిస్తారో తెలియదు.

ఇలాంటి క్లిస్ట పరిస్థితుల్లో ఒడిస్యూస్ ఏ విధం గా తన రాజ్యం లోకి ప్రవేశించాడు,ఎలా తిరిగి రాజ్యాన్ని వశపరుచుకున్నాడు అన్నదే కథ. సినిమా లో గ్రాఫిక్స్ కంటే సహజత్వానికే ప్రాధాన్యతనిచ్చారు.హీరో మాట్ డామన్ ఒడిస్యూస్ పాత్ర కి చక్కగా సరిపోయాడు.పెనెలోప్ గా అన్నా హాథవే నటించింది.

గ్రీకుల నగర రాజ్య స్వరూపాన్ని దర్శకుడు మన కళ్ళముందుంచాడు.యూరోపియన్లు గాని,అమెరికన్లు గాని,ఇతర పశ్చిమ దేశాల వారు గాని ఈ గ్రీకు కావ్యాలే జాతీయ కావ్యాల వంటివి.అయితే మన దేశం లో సైతం ఈ సినిమా ఎందుకు హిట్ అయింది అంటే సార్వజనీన కథాంశం.చక్కని సంగీతం.హృదయాన్ని ఆకట్టుకునే సన్నివేశాలు.అన్ని వయసుల వారు హాయిగా చూడవచ్చు.  

--- మూర్తి కెవివిఎస్ 


#Odyssey #review #opinion

14, జులై 2026, మంగళవారం

ఎంతసేపు పుచ్చు పాలిటిక్స్ తప్పా కళ ని గౌరవించడం అనేది జాంతా నై

 


సుప్రసిద్ధ గాయని ఎస్.జానకి గారు జూలై 11 వ తేదీనాడు మైసూరు లోని ఓ ప్రైవేట్ వైద్యశాల లో మరణించారు. ఆమె చివరి శ్వాస మైసూరు లోనే వదలాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.అక్కడ కూడా లో ప్రొఫైల్ లోనే జీవించినట్లు తెలుస్తోంది. బాలు మరణాంతరం ఆయనకి తెలుగు రాష్ట్రాలు ఇచ్చిన గొప్ప గౌరవం తెలుసు గనక ఆ కన్నడనాడు లోనే చివరి దినాలు ఆమె గడిపారు. నిస్సందేహంగా కళాకారుల్ని గౌరవించడం లో మన తెలుగు వాళ్ళ కంటే మిగతా దక్షిణాది రాష్ట్రాలు మిన్న అనే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు.పోయిన తర్వాత లేనిపోని రాద్ధాంతాలు చేసి, అప్పుడు కూడా పుచ్చు పొలిటిక్స్ చేసి సంతోషించే జీవులు తెలుగులు తప్పా మరెవరూ ఉండరు.  

నోటి తో కబుర్లు చెప్పడం తప్పా చేతల్లో గౌరవం ఇవ్వడం ఉండదు.మన దగ్గర గల్లీల దగ్గర్నుంచి,ఎయిర్పోర్ట్ ల వరకు అన్నీ రాజకీయ పక్షుల పేర్లే తప్పా మిగతా ఎవరి గొప్పదనాన్ని అంగీకరించం.అదే తెలుగు ప్రజల ప్రత్యేకత.బాలు పోయినప్పుడు తమిళులు గాని,జానకి గారు పోయినప్పుడు కన్నడిగుల ఆవేదన గాని కళ కి వారు ఇచ్చే గౌరవానికి మచ్చుతునక.దక్షిణాది లోని ఆ మూడు రాష్ట్రాల్లో బాలు కి ఇంకా విగ్రహాలు పెడుతూనే ఉన్నారు.అనేక నిర్మాణాలకి కూడా ఆయన పేర్లు పెడుతున్నారు.  

2, జూన్ 2026, మంగళవారం

ఇతర దేశాల్లోని ప్రజలు అంగీకరించినా,యూదులు జీసస్ ని ఎందుకు అంగీకరించలేదు?


 యూదులు జీసస్ ని ఎందుకు అంతిమ ప్రవక్త గా అంగీకరించలేదు? ప్రపంచం లోని అనేక దేశాల ప్రజలు ఆయన్ని అనుసరించారు. అంగీకరించారు. కాని ఈరోజుకీ యూదులు ఆయన్ని మెస్సియ గా అంగీకరించలేదు.దానికి కారణాలు చాలా బలమైనవి. అసలు యూదుల యొక్క పవిత్ర గ్రంథం ఏమిటి,అనే సందేహం ఎవరికైనా వస్తుంది. 

నిజానికి మూడు ప్రధాన గ్రంథాలు ఉన్నాయి. తోరా,తనక్,తాల్ముద్ ఈ మూడింటిలో చాలా ప్రాచీన చరిత్ర నిక్షిప్తం కాబడి ఉంది.యూదులు మత విశ్వాసాలు,న్యాయ సూత్రాలు,ఇంకా అనేక మంది ప్రవక్తలు చెప్పిన అంశాలు ఉంటాయి. 

మనం ఈ రోజున చూసే బైబిల్ లోని జెనిసిస్,ఎక్సొడస్,లెవిటస్,నంబెర్స్,డ్యుటొరోనమి ఇవన్నీ తోరా లోని ముందు భాగం లో ఉన్నాయి.సృష్టి క్రమం,మోజెస్ చెప్పిన న్యాయస్మృతులు ,యూదుల యొక్క చరిత్ర వీటిలో ఉన్నాయి.

యూదులు జీసస్ ని యెషుహ నజ్రి అని తమ గ్రంథాల్లో ప్రస్తావించారు. వారి లేఖనాల్లో తమకి విముక్తి కలిగించే మెస్సియ మూడు వాగ్ధానాల్ని నెరవేర్చుతాడని రాశారు. జెరుసలేం లో మూడవ ఆలయాన్ని నిర్మించడం,చెల్లా చెదురైన యూదు జాతీయుల్ని అందర్నీ ఇజ్రాయెల్ కి చేర్చడం,అంతటా శాంతి నెలకొల్పడం ఈ మూడింటిని జీసస్ తన జీవిత కాలం లో చేయలేకపోవడం వల్ల యూదు మత పెద్దలు ఆయన్ని మెస్సియ గా పరిగణించలేదు. 

యూదుల గ్రంథాలు చాలా ప్రాచీనమైనవి. కొన్నిటిని మూడు వేల ఏళ్ళ క్రితం రాశారు. వీటిలో ఆధ్యాత్మిక అంశాలు మాత్రమే గాక చారిత్రక అంశాల్ని కూడా గమనించవచ్చు. తండ్రి,కుమార,పరిశుద్ధాత్మ అనే ట్రినిటీ కాన్సెప్ట్ ని యూదులు అంగీకరించలేదు. యూదుల్లో జన్మించిన అనేక మంది ప్రవక్తల్లో జీసస్ ని ఒకరిగా అయితే గౌరవించారు. 

యూదులకి ఎన్నో తరాల నుంచి వచ్చే సబ్బాత్ నియమాల్ని జీసస్ ఉల్లంఘించడం కూడా ఆ పెద్దలకి కోపం వచ్చింది.

యూదుల ప్రార్ధనా మందిరాల్ని సినగోగ్ లు అంటారు.రోజుకి మూడు సార్లు  అంటే ఉదయం,మధ్యానం,రాత్రి తప్పకుండా ప్రార్ధన చేయాలి.వైన్ ని గాని, ఆహారాన్ని గాని యూదులు కాకుండా వేరే వాళ్ళు చేస్తే దాన్ని వారు స్వీకరించరు.

 దాదాపు 100 కి పైగా దేశాల్లో యూదులు నివసిస్తున్నారు. అత్యంత ఎక్కువ గా ఇజ్రాయెల్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిదే. ఆ తర్వాత అమెరికా,కెనడా,బ్రిటన్,ఆస్ట్రేలియా ఇత్యాది దేశాల్లో ఉన్నారు. అనేకమంది యూదులు ప్రపంచ కుబేరుల జాబితా లో మనకి కనబడతారు. 

గూగుల్ అధిపతి లారీ పేజ్, ఫేస్ బుక్,ఇన్స్టాగ్రాం ల సి.ఇ.వో. మార్క్ జూకర్బెర్గ్,ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమందినో చెప్పాలి. టాప్ టెన్ ప్రపంచ కుబేరుల్లో అయిదుగురు యూదులే! హాలీవుడ్ లో స్పీల్ బర్గ్ నుంచి పెద్ద స్టూడియో అధినేతల దాకా యూదులు కనిపిస్తారు.

యూదులు స్వతహగా చాలా పొదుపరులు. వ్యాపార దృక్పథం గలవారు. సంఖ్యా పరంగా తక్కువ ఉన్నప్పటికీ తాము ఉన్న దేశాల్ని శాసించే స్థితి లో ఉంటారు.హిట్లర్ లాంటి వాళ్ళకి ఇది నచ్చకనే ఎక్కడ కనబడితే అక్కడ ఊచకోత కోయించాడు. 

ఆధునిక యుదుల జీవిత చిత్రణ ని అనేకమంది ఇంగ్లీష్ ఫిక్షన్ రచయితల పుస్తకాల్లో చదవవచ్చు. హెరాల్డ్ రాబిన్స్ తాను రాసిన 25 నవలల్లోనూ యూదుల పాత్రల్ని ఎక్కడో ఓ చోట తప్పకుండా ప్రవేశపెడతాడు.

 అమెరికాలోని యూదుల రకరకాల గాధల్ని మనం అర్థం చేసుకోవచ్చు.ద డ్రీం మర్చంట్స్ (1949) అనే నవల లో  చిన్న పట్టణాల్లో మొబైల్ సినిమా వ్యాన్ ని నడుపుకునే ఇద్దరు సోదరులు ఆ తర్వాత  హాలీవుడ్ లో ప్రవేశించి ఏ విధంగా స్టూడియో అధినేతలుగా ఎదిగారు అనేది చెబుతాడు.

 కార్పెట్ బేగర్స్ (1961) ,79  పార్క్ అవెన్యూ,ద అడ్వెంచరర్స్,గుడ్ బై జానెట్, ఇన్ హెరిటర్స్, రైడర్స్,ఇలా చాలా నవలల్లో యూదు వ్యాపారస్తుల కుటుంబాల్ని మనం పరిశీలించవచ్చు.

శాస్త్రవేత్తలు,రచయితలు,వివిధ కళాకారులు,ఇతర రంగాల్లోని సంపన్నులు వీళ్ళలో యూదులు లెక్కకు మిక్కిలిగా కనపడతారు. 

ఫ్రాంజ్ కాఫ్కా,బాషెవిస్ సింగర్ ,బెర్నార్డ్ మాల్ముద్,ఇలా రచయితల్లో ఎంతో మందిని చెప్పవచ్చు. అలాగే నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల్లో 20 శాతం మంది యూదులు ఉంటారు.అల్బర్ట్ ఐన్ స్టీన్,షోపెన్ హోవర్ లాంటివాళ్ళు ప్రసిద్ధులు.

 యూదు మతం లోకి ఎవరైనా కన్వర్ట్ కావడం కుదురుతుందా అని సందేహం రావచ్చు. ఆ వీలు ఉన్నప్పటికీ అది చాలా కష్టమైన ప్రక్రియ.

 దాదాపు సంవత్సరం లేదా అంతకి పైబడిన సమయం తీసుకుంటుంది. యూదు మతానికి చెందిన అన్నీ పవిత్ర గ్రంథాల్ని,చరిత్ర ని అధ్యయనం చేయాలి. ఆ తర్వాత ఓ ఏడాదికి యూదు మత పెద్దలు పరీక్షలు పెడతారు.

 అది కూడా పాస్ అయితే ఆ తర్వాత తంతు కూడా చాలా కాలం తీసుకుంటుంది. కాబట్టి అన్ని కష్టాలు పడి ఈరోజుల్లో ఎవరు ఆ మతం లోకి మారతారు? ఇకపోతే మన దేశం లోని హిమాచల్ ప్రదేశ్ కి ఇజ్రాయెల్ వారు ఎక్కువ గా వస్తున్నట్లు తెలుస్తోంది.

కుల్లూ లోయ లోని కాసోల్,ధర్మశాల లో మినీ ఇజ్రాయెల్ వాతావరణం ఉన్నది. హిబ్రూ భాషలోనే అక్కడి అన్ని రకాల బోర్డులు కానవస్తాయి.  


--- మూర్తి కెవివిఎస్                 

25, మే 2026, సోమవారం

పార్లమెంట్ కి ఎనికైన దగ్గరనుంచి పోకుండా బాలెన్ మొండికేస్తున్నాడు

  నేపాల్ మనకి మిత్ర దేశమనే సంగతి తెలిసినదే. కానీ పాలకుల మూర్ఖత్వం వల్ల అప్పుడప్పుడు మన శత్రు దేశాల ప్రయోజనాలకి మొగ్గు చూపుతుంది.ఉదాహరణకి ప్రస్తుతం చూస్తే,బాలేంద్ర షా గద్దె నెక్కిన తర్వాత ప్రదర్శిస్తున్న తల బిరుసుతనం ఏ వైపు కి దారి తీస్తుందో తెలియవలసి ఉంది.మానస సరోవరం దర్శించాలనుకునే భారతీయులకి మోకాలు అడ్డేలా నేపాల్ ప్రధాని ప్రవర్తిస్తున్నాడు. లిపుకేష్,లింపియాధుర,కాలా పాని నేపాల్ లో భాగాలని దారి ఇవ్వడం కుదరదని బాలెన్ మాట్లాడాడు.ఈ విషయం మీద మాట్లాడాలని విదేశాంగ శాఖ సెక్రెటరి ప్రయత్నించగా ఆయనకి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదు.తనతో మాట్లాడాలంటే భారత ప్రధాని మాత్రమే మాట్లాడాలని కండీషన్ పెట్టాడు.దీన్ని అక్కడి ప్రతిపక్షాలు సైతం తప్పు పట్టాయి.

అసలు పార్లమెంట్ కి ఎనికైన దగ్గరనుంచి పోకుండా బాలెన్ మొండికేస్తున్నాడు. అవసరమయితే మంత్రులు సమాధానం చెబుతారు.నేను రానని అంటూండగా,ప్రతిపక్షాలు బాలెన్ పదవి నుండి తక్షణం దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నాయి.ఇంతవరకు ఎన్నికయిన ఏ ప్రధాని ఇలా బిహేవ్ చేయలేదంటున్నారు. రాపర్ గా ఉన్నాడిని ఎకాఎకి ఆ స్థానం లో కూర్చోబెట్టడం తమ తప్పని రూలింగ్ పార్టీ నాయకులు అంటున్నారు. ఎంత బెట్టు చేసినా నేపాల్ దిగిరాకా తప్పదు.4 మిలియన్ల నేపాలీలు మన దేశం లో పనిచేస్తున్నారు.మన 100 రూపాయలు అక్కడ 160 రూపాయలు. నేపాల్ వారు మన దేశం లో UPSC పరీక్ష రాసి ఇక్కడ IAS,IPS లాంటి ఉన్నతోద్యోగాలు కూడా చేయవచ్చు. 

1950 లో జరిగిన ఇండియా నేపాల్ ఒప్పందం వల్ల మన దేశం వారికి ఎన్నో రాయితీలు ఇచ్చింది.వీసా,పాస్ పోర్ట్ లేకుండా రాకపోకలు జరపవచ్చు.సాంస్కృతికంగా ఇరు దేశాల మధ్య ఉన్న సంభంధాల్ని తెగగొట్టుకునేలా ప్రవర్తిస్తే నేపాల్ కే ఎక్కువ నష్టం. ఎవరెస్ట్ శిఖరం మీద చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పుల మీద చైనా,నేపాల్ నిపుణుల బృందం పరిశోధన చేయడానికి నిన్నటి రోజున శాంపిల్స్ సేకరించారని వార్తలు వచ్చాయి. మరి ఆ రెండు దేశాల సహకారం ఎక్కడినుంచి ఎక్కడికి వెళుతుందో కాలమే చెప్పాలి.

29, ఏప్రిల్ 2026, బుధవారం

అసలు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే ఎవరు?

 ఈ మధ్య కాలం లో ఎక్కువగా మనం ఇండిపెండెంట్ జర్నలిజం అనే మాట వింటున్నాము. అసలు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే ఎవరు? ఎలాంటి కార్పోరేట్ మీడియా తో గాని,లేదా ఇతర పెద్ద సంస్థ ల తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసే విలేకరి అని చెప్పవచ్చు.అలాంటి వారికి చెందినది ఇండిపెండెంట్ జర్నలిజం.ఒకప్పుడు పెద్ద పత్రికలు,మీడియం సైజ్ పత్రికలు,చిన్న పత్రికలు అన్నీ ప్రింట్ వెర్షన్ లోనే వచ్చేవి. ఈ ఇంటర్నెట్ యుగం లో న్యూస్ వెబ్ సైట్ లు, న్యూస్ యూట్యూబ్ చానళ్ళు,స్థానిక పి.డి.ఎఫ్. రూపం లోని పత్రికలు తామరతంపరగా వస్తున్నాయి. అయితే నిలదొక్కుకునే అవకాశం చాల తక్కువ వాటికే ఉంటున్నది.

గత సంవత్సరం మే నెల వరకు 100 మిలియన్ యూట్యూబ్ చానల్స్ మన దేశం లో అప్ లోడ్ అయ్యాయి. ఆ విధంగా ఎక్కువ న్యూస్ చానెల్స్ ఉన్న దేశంగా మన దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది.అయితే కొన్ని మూత పడటం,కొత్తవి ఎప్పటికప్పుడు వస్తుండటం తో వీటిని ఖచ్చితంగా ఇప్పుడెన్ని ఉన్నాయంటే చెప్పడం కష్టమే.దీంట్లో రమారమి 15000 యూట్యూబ్ చానళ్ళకి పది లక్షల పైన సబ్ స్క్రైబర్స్ ఉండటం గొప్ప విశేషమేనని చెప్పాలి. స్థానిక వార్తలతో పాటు సంస్కృతిని,ప్రత్యేక విశేషాలను వేగంగా బయటి ప్రపంచానికి చేరవేయడం లో తమదైన విశిష్టతను చూపిస్తున్నాయి.అదే సమయం లో బాధ్యతారాహిత్యం తో వ్యవహరించే వ్యవహారాలూ లేకపోలేదు.

హిందూ,ఇండియా టుడే, టైంస్ ఆఫ్ ఇండియా ఇంకా ఇలాంటి పెద్ద కార్పోరేట్ మీడియా సంస్థల్లో పనిచేసి స్వతంత్రంగా న్యూస్ వెబ్ సైట్ లు నడుపుతున్నవారూ ఉన్నారు. క్రౌడ్ ఫండింగ్ లేదా ఇతర స్వచ్చంద సంస్థల ద్వారా నిధులు సేకరిస్తుంటారు.తమ చదువరులను కూడా విరాళాలు అర్ధిస్తూ డొనేట్ బటన్ లను వారి సైట్ లలో పెడుతుంటారు. ప్రస్తుతం స్వతంత్ర విలేకరులు నిధుల కొరత తో బాటు, భౌతిక దాడులను కూడా ఎదుర్కుంటున్నారు. వీటినుంచి కొంత లో కొంత రక్షణ పొందడానికి ఏదో రాజకీయ పార్టీని ఆశ్రయించవలసిన పరిస్థితి కూడా ఉన్నది. ప్రస్తుతం పెద్ద పత్రికల లో పనిచేస్తున్న వారే ఎన్నో సవాళ్ళు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉన్నది.

ఒకప్పుడు ఎన్.డి.టి.వి. లో పనిచేసిన రవీష్ కుమార్, ప్రస్తుతం ఒక యూట్యూబ్ చానెల్ నడుపుతున్నాడు. బర్ఖా దత్ ఒక న్యూస్ పోర్టల్ ని నిర్వహిస్తోంది.పాపులర్ టివి లో పనిచేసిన అభిసార్ శర్మ యూట్యూబ్ చానెల్ ప్రారంభించాడు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పనిచేసిన శేఖర్ గుప్తా ద ప్రింట్ అనే న్యూస్ పోర్టల్ ని నిర్వహిస్తున్నాడు.స్క్రోల్, ద వైర్,న్యూస్ లాండ్రీ,న్యూస్ మినిట్,క్వింట్ లాంటి న్యూస్ పోర్టళ్ళను విజయవంతంగా నడుపుతున్న వారందరు ఒకప్పుడు పెద్ద మీడియా సంస్థల్లో పనిచేసిన వాళ్ళే. కనక యూట్యూబ్ చానెళ్ళను,ఆన్ లైన్ న్యూస్ పోర్టళ్ళను చిన్న చూపు చూడటం అనేది ఎంత మాత్రం కుదరని పని.   


       

19, మార్చి 2026, గురువారం

ఉస్తాద్ అనే మాటకి అర్థం తెలిసే పెట్టారా



 ఉస్తాద్ అనే మాటకి అర్థం తెలిసే పెట్టారా ఆ పేరు సినిమాకి అనే సందేహం ఈరోజు రిలీజ్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రివ్యూ చదవగానే అనిపించింది. విచిత్రంగా ఈ సందేహం ఏ రివ్యూ లో కూడా వ్యక్తపరచక పోవడం ఇంకావింత గా అనిపించింది. ఉస్తాద్ అనే మాట ప్రఖ్యాతి చెందిన ఉర్దూ గాయకుల్ని ఉద్దేశించి అంటారు.గాత్ర సంగీతం లోనూ,వాయిద్య సంగీతం లోనూ ప్రతిభావంతులైన వారిని అలా గౌరవం గా పిలుస్తారు.ఆ తర్వాత హిందూ గాయకుల్ని కూడా అదే విధంగా పిలవడం ప్రారంభమయింది. ముఖ్యంగా ఉత్తరాది లో ఈ సంస్కృతి కనబడుతుంది.

ఇదిలా ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లో హీరో పోలీస్ పాత్ర కాగా ఉస్తాద్ అనే మాటని ప్రిఫిక్స్ గా ఎందుకు వాడారో అర్థం కాలేదు. మొదట్లో హీరో పాత్రధారి సంగీత కళాకారుడు కావచ్చు అందుకే ఉస్తాద్ అనేది వాడారు అనుకున్నాను. అలాగే గొప్ప దేశభక్తుడైన భగత్ సింగ్ పేరుకి ముందు ఉస్తాద్ అనే మాట పెట్టి ఆయన పేరు కి ఉన్న గౌరవాన్ని,గాంభీర్యాన్ని చెడగొట్టారు. దాని బదులు షహీద్ అనే పెడితే కొంత న్యాయం గా ఉండేది.మన తెలుగు సినీ దర్శక,నిర్మాతల అజ్ఞానానికి పరాకాష్ట ఉస్తాద్ భగత్ సింగ్ అనే టైటిల్.