Pages

13, జనవరి 2025, సోమవారం

థాయ్ లాండ్ లోని మరో కోణం

 థాయ్ లాండ్ లోని మరో కోణం


ఇటీవల థాయ్ లాండ్ వెళ్ళే పర్యాటకులు బాగా పెరిగారు. గత ఏడాది మన దేశం నుంచి 12,55,358 మంది ఆ దేశాన్ని సందర్శించారు.ఆ దేశం లో లభించే విహార,వినోద కార్యక్రమాలు నచ్చడం తో వెళ్ళిన వాళ్ళే వెళుతుండడం గమనించవచ్చు. చక్కని బీచ్ లు, రాత్రి పూట విందులు,అబ్బురపరిచే గతకాలపు నిర్మాణాలు ఇలాంటివి అన్నీ ఆ దేశానికి వెళ్ళేలా చేస్తున్నాయి. అన్నిటికీ మించి అందర్నీ నవ్వుతూ పలకరించే థాయ్ ప్రజల స్వభావం మరింతగా ఆకట్టుకునే అంశం. మన గోవా లో జరిగే టూరిస్టుల దోపిడి అక్కడ లేదు.టాక్సీలు,హోటల్స్ ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.దానివల్ల కూడా మన వాళ్ళు థాయ్ లాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఆ దేశం 59.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని టూరిజం వల్ల పొందగలిగింది.


పట్టాయ, ఫుకెట్, బ్యాంకాక్ నగరాలు అనేక సౌకర్యాల్ని టూరిస్ట్ లకి అందిస్తున్నాయి. పట్టాయ లో 24 గంటలు సందడిగానే ఉంటుంది. నిద్రపోని ప్రదేశం అని దీన్ని పిలుస్తారు.ఫుకెట్ గూర్చి చెప్పాలంటే అందమైన బీచ్ లు,సాహసోపేత క్రీడలకి నిలయం. ఇంకా కొన్ని ఆసక్తికరమైన పట్టణాలున్నాయి. మన దేశం నుంచి రమారమి ఫ్లైట్ ద్వారా నాలుగున్నర గంటల ప్రయాణం ,కనుక ఏ మాత్రం ఖాళీ దొరికినా చాలామంది వెళ్ళివస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే థాయ్ లాండ్ కి మన దేశానికి ఉన్న మరో కోణం ఏమిటంటే ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఉన్న సాంస్కృతిక అనుబంధం. దీన్ని మరి ఎంత మంది పట్టించుకుంటున్నారో తెలియదు గానీ కొన్ని విశేషాలు ఇక్కడ చెప్పక తప్పదు.


థాయ్ లాండ్ రాజవంశం ఇప్పటికీ తాము రాముని వారసులు గా పరిగణించుకుంటుంది. రామా అనే బిరుదు తో వారి కి అభిషేకం జరుగుతుంది. ప్రస్తుతం రామా - 10 గా పరిగణింపబడే వాజీరా లాంగ్కోర్న్ 2019 లో రాజు గా అభిషిక్తుడయ్యాడు. బ్రిటన్ లో మాదిరి గానే ఇక్కడి రాజవంశానికీ సంప్రదాయపరమైన గౌరవం లభిస్తుంది. ప్రపంచం లోని ధనిక కుటుంబాల్లో ఒకటి. రాజు కి అభిషేక కార్యక్రమాల్ని నిర్వహించే వారిని బ్రాం లువాంగ్ లుగా పిలుస్తారు.వీరు ఒకానొక కాలం లో భారత దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణులుగా వాళ్ళు భావించుకుంటారు. రామాయణాన్ని థాయ్ రామాకియాన్ అనే పేరు తో వ్యవహరిస్తారు. హనుమంతుని శిల్పాలు అనేక చోట్ల కనిపిస్తాయి.శక్తికి,విజయానికీ గుర్తుగా ఆయన పేరు ని చెబుతారు.


ఇక్కడి సాహిత్యం లో థాయ్ రామాకియన్ కి విశిష్ట స్థానం ఉన్నది. ఆయుర్వేదం ని అభివృద్ది చేయడానికి కట్టిన పట్టణానికి అయోధ్య అనే పేరు పెట్టారు. బౌద్ధ మతాన్ని పాటించేవారు దాదాపు 94 శాతం మంది ఉన్నప్పటికీ బౌద్ధ,హిందూ సంప్రదాయాలు కలగలిసిపోయి కనిపిస్తాయి. శివుడు,విష్ణువు,బ్రహ్మ ఈ ముగ్గురు తమ పేర్లు మార్చుకుని ఇక్కడ కనిపిస్తారు.వాళ్ళ ముగ్గురుని ఫ్రా కువాన్,ఫ్రా నరాయ్, ఫ్రా ఫరోన్ గా వ్యవహరిస్తారు. గణేషుడు సైతం నాట్యం చేస్తూన్న భంగిమ లో కనిపిస్తాడు. థాయ్ వంటకాలు ప్రపంచ ప్రసిద్ది పొందాయి. ఆ దేశం ప్రత్యేకంగా తమ చెఫ్ ల్ని ఇతర దేశాలకి అంబాసిడర్ లుగా పంపిస్తుంది. అంటే వారి ద్వారా తమ దేశానికి టూరిజం ఇంకా పెరుగుతుందని వాళ్ళ ప్రణాళిక.


ఆసియా, యూరపు దేశాలతో పోలిస్తే బంగారం ఖరీదు ఇక్కడ తక్కువ. అయితే విదేశీయులు కొనడానికి పరిమితి ఉన్నది.సుగంధద్రవ్యాలు,థాయ్ సిల్క్, స్పా ప్రోడక్ట్స్, షర్టులు,ఇలా చాలా వాటిని మన వాళ్ళు ఎక్కువ గా కొనుగోలు చేస్తుంటారు. అరవై రోజుల దాకా ఎలాంటి వీసా లేకుండా థాయ్ లాండ్ లో భారతీయులు ఉండవచ్చు. గతం లో ఈ పరిమితి తొంభై రోజులుగా ఉండేది. బ్యాంకాక్ లో ఎనభై వేలకి పైగా భారతీయ మూలాలు ఉన్న ప్రజలు ఉన్నారు. థాయ్ కరెన్సీ ని భాట్ అంటారు. మన రూపాయికి రెండు భాట్ లు వస్తాయి.ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల పరంగా చెప్పాలంటే థాయ్ దేశానిది 26 వ స్థానం. 1970 లో టూరిజం ని ప్రధాన వనరు గా ఎన్నుకున్న ఆ దేశం అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనక్కి చూడకుండా పురోగమిస్తున్నదనే చెప్పాలి. 


----- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003)              

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి