బౌన్సర్ కావాలంటే ఎలా ? వారి విధులు ఎలా ఉంటాయి ?
---------------------------------------------------------------------------------
ఇవాళా రేపు బౌన్సర్ అనే పేరు బాగా వినిపిస్తోంది. అంతెందుకు,ప్రముఖుల చుట్టూ వలయం లా ఉంటూ వాళ్ళ ని కాపాడే వారిని చూస్తూనే ఉంటాం. సినిమా ప్రముఖులు అయితే ఇహ చెప్పక్కర్లేదు.అదో సందడి. జనాలు తోసుకు వస్తూంటే వాళ్ళని కంట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.అసలు ఈ బౌన్సర్ అనే ఉద్యోగం ఎప్పుడు మొదలయింది,ఎందుకు మొదలయింది వాళ్ళ జాబ్ చార్ట్ ఎలా ఉంటుంది ఇలాంటివి తెలుసుకుందాం. మొట్ట మెదటిగా హొరాషియో ఆల్గర్ అనే రచయిత బౌన్సర్ అనే నవల 1875 లో రాశాడు. ఆ తర్వాత నుంచి ఆ పేరు బాగా ప్రసిద్ధి పొందింది. ప్రముఖుల రక్షణ కే కాకుండా పబ్ ల వద్ద, జనాలు బాగా వచ్చే ఈవెంట్ల వద్ద,రెస్టారెంట్ల వద్ద, రకరకాల కంపెనీ ఆఫీసుల వద్ద ఇలా చాలా చోట్ల వీరి అవసరం ఉంటుంది.
అమెరికా వంటి దేశాల్లో బౌన్సర్ జాబ్ కి విపరీతమైన రాబడి ఉంటుంది. చాలా మంది ప్రముఖులు బౌన్సర్లు లేకుండా బయటకి రారు.ప్రస్తుతం మన దేశం లో కూడా ఈ జాబ్ కి బాగా గిరాకీ ఉంది.అయితే అందరకీ ఒకే రకమైన ఆదాయం ఉంటుందని చెప్పలేము.మంచి నైపుణ్యం, అనుభవం ఉన్నవారికి నెలకి 4 లక్షల రూపాయల పైనే ఉంటుంది. కొత్తగా వచ్చేవారికి 20 వేల రూపాయల నుంచి మొదలవుతుంది.బౌన్సర్ వృత్తి అంత సులభమనదేమీ కాదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి.ప్రతి రోజు తమ బాడీ నీ ఫిట్ గా ఉంచుకోవాలి. దానితో పాటుగా స్వయం నియంత్రణ ఉండాలి. తమ తోటి బౌన్సర్ లతో నెట్ వర్క్ కలిగి ఉండాలి.అప్పుడు మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే నోటిమాట తో పెద్ద పెద్ద కంపెనీలు ఆయా నైపుణ్యాలు ఎక్కువ ఉన్నవారిని నియమించుకుంటాయి.
కనీసం ప్లస్ టూ చదువు ఉండాలి.ఏదైనా డిగ్రీ ఉంటే మరీ మంచిది. ఇంగ్లీష్ భాష పై మంచి పట్టు ఉండాలి. ప్రముఖులతో మెలిగేటప్పుడు అది చాలా అవసరం.ఎంట్రీ లెవెల్ లో చిన్న చిన్న రెస్టారెంట్ల వద్ద పనిచేయడానికి వెనుదీయకూడదు.దానివల్ల అనుభవం వస్తుంది. మాబ్ సైకాలజీ తెలుసుకోవడం, వాళ్ళని నియంత్రించడం లో ఆ అనుభవం ముందు ముందు పనికొస్తుంది. గేట్ల వద్ద నిలబడి వచ్చీపోయే వారిని పరిశీలించడం,ఎవరు గొడవ చేసే మూడ్ లో ఉన్నారు అనేది కనిపెట్టడం, వాళ్ళని అదుపు చేయడం ఇలాంటివన్నీ వారు చేయాలి.తాము చేసే పని కి ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి అనేది గుర్తించి వాటిని క్రమం తప్పక సాధన చేయాలి. ప్రఖ్యాత అమెరికన్ నటుడు విన్ డీసెల్ కూడా కొంత కాలం బౌన్సర్ గా పనిచేశాడు.
త్రాగుబోతులు గా మారినా, విధుల పట్ల నిర్లక్ష్యం గా ఉన్నా సెక్యూరిటీ సంస్థలు వీరిని సహించవు. వెంటనే తొలగిస్తాయి,కాబట్టి జాగ్రత్త గా ఉండాలి. మన దేశం లో మిరాజ్ సెక్యురిటాస్ అనే సంస్థ ఎక్కువ గా బౌన్సర్ లని అవసరం ఉన్న సెలెబ్రెటీలకి ఇతర కంపెనీలకి సరఫరా చేస్తుంది. ఢిల్లీ కి దగ్గర లో ఉన్న అసోలా ఫతేపూర్ అనే గ్రామం నుంచి మన దేశం లో ఎక్కువ గా బౌన్సర్ వృత్తి లోకి వస్తున్నారని గణాంకాల్లో తేలింది. వీళ్ళు అంతా చాలావరకు గుజ్జర్ కమ్యూనిటీ కి చెందినవారు. ప్రస్తుతం స్త్రీలు కూడా ఈ జాబ్ వైపు మక్కువ చూపుతున్నారు. మెహరున్నీసా షౌకత్ అలీ అనే షహరన్ పూర్ కి చెందిన ఆమె మన దేశం లో మొదటి లేడీ బౌన్సర్. ప్రస్తుతం ఈమె పాపులర్ కేఫ్ అనే ఢిల్లీ కి చెందిన సంస్థ కి రక్షణ కల్పిస్తోంది. ఇంకా సెలెబ్రెటీస్ కి కూడా బౌన్సర్ గా తన సేవల్ని అందిస్తున్నది.
--- మూర్తి కెవివిఎస్ (చరవాణి : 7893541003)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి