ఏనుగు గురించి తెలుసుకుందాం!
-------------------------------------------------------
భూమి మీద నడిచే అతి పెద్ద జంతువు ఏది అంటే ఏనుగు అని చెప్పవలసిందే! ఎన్నో వందల ఏళ్ళ క్రితం నుంచే మనిషికి, ఏనుగు కి విడదీయరాని అనుబంధం ఉంది.ఇతిహాసాల్లో, పురాణాల్లో సైతం ప్రముఖ స్థానమున్నది.పూర్వం రాజులు గజబలం పేరిట ఏనుగుల్ని యుద్ధాల్లో వినియోగించేవారు. ఒక్క మన దేశం లోనే కాదు థాయ్ లాండ్ వంటి దేశాల్లో ఏనుగు కి ఎంతో గౌరవం ఇస్తారు. బౌద్ధ మతం లో కూడా గజరాజు కి పవిత్ర స్థానం ఉన్నది. బుద్ధుడు జన్మించడానికి కొన్ని రోజులు ముందు ఆయన తల్లిగారికి ఓ తెల్ల ఏనుగు స్వప్నం లో దర్శనమిచ్చినందున బౌద్ధ సాహిత్యం లో,శిల్పాల్లో ఏనుగు కి ఎనలేని ప్రాముఖ్యమున్నది. ఇహ మన వినాయక స్వామి గురించి తెలియనిదెవరికి?
అటువంటి ఏనుగు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఏనుగు కి ఉండే దంతాలు నిజానికి దానికి ఉండే పండ్లు, కాకపోతే అవి పెద్దగా బయటకి వచ్చి కనబడతాయి.దానివల్ల ఆ జంతువు కి ఎన్ని ఉపయోగాలో !ఏనుగు కి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది.మీరు అద్దం లో దాని రూపాన్ని చూపిస్తే అది తనదే అని గుర్తుపడుతుంది.కేవలం అయిదు జంతువులు మాత్రమే అలా గుర్తుపడతాయి.స్పర్శించడం ద్వారా,శబ్దం చేయడం ద్వారా మిగతా వాటితో మాట్లాడతాయి.ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఆడ ఏనుగు గుంపు కి పెద్ద గా ఉంటుంది. 14 లేదా 15 ఏళ్ళు వచ్చినతర్వాత మగ ఏనుగులు ఆ మంద కి దూరం గా వెళ్ళిపోతాయి.
ఏనుగు మెదడు అయిదు కిలోల పైనే ఉంటుంది. సాధ్యమైనంత వరకు నీటి కి దగ్గర లో నివసిస్తాయి.వాటి దంతాల కోసం చాలా కాలం నుంచి మానవుడు వేటాడుతూనే ఉన్నాడు. అడవి లో 70 ఏళ్ళ పాటు జీవిస్తుంది. తోటి ఏనుగు కి దెబ్బ తగిలినా,జబ్బు చేసినా అవి బాధపడతాయి.తమ మంద లో ఉన్న ఏనుగు ఏదైనా చనిపోతే ,ఆ ప్రదేశానికి తరచు వెళ్ళి అంజలి ఘటించినట్లు ప్రవర్తిస్తాయి. ఏనుగులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాయి. ఏనుగు పిల్ల పుట్టిన తర్వాత మంద లో మిగతా ఏనుగులు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. ఏనుగులు అడవి లో అయితే 200 కిలోల ఆహారం ,40 లీటర్ల నీటిని రోజూ తీసుకుంటాయి.
మూడు లేదా నాలుగు గంటల నిద్ర చాలు.అవి నిలబడి కూడా జోగుతుంటాయి. పుట్టిన అరగంట లోనే ఏనుగు పిల్ల నడుస్తుంది.కాని సరిగ్గా పాదం మోపడం,తొండం తో తినడం,నీళ్ళు తాగడం అనేవి చేయడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది. అంటే తొమ్మిది నెలల దాకా ఆగవలసిందే. బుల్లి ఆడ ఏనుగులు ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ ఆటాడుకుంటాయి. బుల్లి మగ ఏనుగులు మాత్రం ఫైటింగులు చేసుకుంటూంటాయి. అయితే మంద లోని పెద్ద ఏనుగులన్నీ వీటి మీద ఓ కన్ను వేసి ఉంచుతాయి. ఆసియా జాతి ఏనుగులు,ఆఫ్రికా జాతి ఏనుగులు అని ప్రపంచం లోని ఏనుగుల్ని రెండు రకాలుగా విడదీశారు.
మనం తరచూ ఏనుగు మనుషుల మీద దాడిచేసినట్లు వార్తల్లో చూస్తుంటాం. ఏనుగు ఆకారం లో భారీ గా ఉన్నప్పటికీ సున్నిత స్వభావం గల జంతువు. స్ట్రెస్,ఆందోళన,రక్షణ లేకపోవడం,వాటి పిల్లల కి హాని కలుగుతుందనే భావన ఇలాంటి కారణాల వల్ల ఏనుగులు మనుషుల మీద దాడి చేస్తాయి.మన ఆసియా ఖండం లోని ఏనుగుల్ని శ్రీలంక,బోర్నియా,ఇండియా,సుమత్రా రకాలుగా విభజించారు. ఆఫ్రికా ఖండం లోని ఏనుగుల్ని పొదల్లో,అడవుల్లో నివసించే రకాలుగా విభజించారు.ఆఫ్రికా ఏనుగులు నాలుగు లక్షల పదిహేనువేల దాకా ఉండగా ఆసియా రకం ఏనుగులు నలభైవేల నుంచి యాభై వేలు మాత్రమే ఉన్నాయి.
----- మూర్తి కెవివిఎస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి