పానీ పూరి కి సైతం ఓ చరిత్ర ఉంది
-------------------------------------------------
పానీ పూరి అంటే తెలియనిది ఎవరికి ? రోడ్డు పక్కన అమ్మే ఈ తినుబండారాన్ని యువతీ యువకులు ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. అసలు ఈ పానీ పూరి ఎక్కడ పుట్టిందో తెలుసా, ఖచ్చితం గా దక్షిణాది లో మాత్రం కాదని చాలా మందికి తెలుసు.అవును, ఇది ఉత్తర్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఆవిర్భవించింది. అక్కడి జానపదులు మహా భారతం లోని కుంతీ దేవికి,ద్రౌపది కి దీని తయారీ లో చోటిచ్చారు అంటే ఈ పానీ పూరి అనేది కొన్ని వందల ఏళ్ళ నుంచే తయారింపబడుతున్నదని అర్థం.
ఒకరోజున కుంతీ దేవి కొంత గోధుమ పిండి,చిక్కుళ్ళు,కొత్తిమీర,ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు కోడలైన ద్రౌపది కి ఇచ్చి పాండవులందరికి నచ్చేలా ఏదైన వంటకం చేయమన్నదట. దాంతో ఆ కోడలు ఈ పానీ పూరి ని చేయడం తో అందరికీ విపరీతం గా నచ్చడం తో , నీ ఈ వంటకం ఎప్పటికీ భూలోకం లో నిలిచిపోతుందని కుంతీ దేవి ఆశీర్వాదం ఇచ్చిందని ఉత్తరాది లో ఓ కథ ఉన్నది.
అలా ప్రయాణం మొదలు పెట్టిన పానీ పూరి ముంబాయి,ఢిల్లీ,కోల్కత,బెంగళూరు,హైదరా బాద్,అహ్మదా బాద్,పూనే ఇలా మన దేశం లో అన్ని నగరాలకి పరుగులు తీసి , అంతటితో ఆగకుండా చిన్న పట్టణాలకి ,గ్రామాలకి సైతం వ్యాపించి ఎంతోమంది కి ప్రీతిపాత్రమైన స్ట్రీట్ ఫుడ్ గా నిలిచింది. చక్కని శుభ్రమైన నీరు,తాజా ఆలు,గోధుమ పిండి,చింతపండు, ఇంకా అవసరమైన కొత్తిమీర,ఉల్లి లాంటివి వాడితే పానీ పూరి తినడానికి చాలా బాగుంటుంది. అలా కాకుండా చవక రకం వి వాడితే మటుకు రుచి లో తేడా వస్తుంది. అంతే కాదు కడుపు లో నొప్పి కూడా వస్తుంది. దీంట్లో 51 కిలోకేలరీల శక్తి ఉంటుంది.58.3 శాతం కార్బో హైడ్రేట్స్,9.3 శాతం ప్రోటీన్స్ ఉంటాయి.
చాలా రాష్ట్రాల్లో రోడ్డు పక్కనే కాకుండా హోటల్స్ లా పెట్టి కూడా అమ్ముతుంటారు. కొన్ని ప్రాంతాల్లో గోల్ గప్పా అని అంటారు. మధ్య ప్రదేశ్ లో దీన్ని ఫుల్కీ అని,అస్సాం లో పుస్కా అని, బెంగాల్ లో పుచుక అని వ్యవహరిస్తారు. బీహార్ లో మాత్రం జల్ పూరీ అంటారు.గోధుమ పిండి తో చేసిన గుండ్రటి బంతి ,దాంట్లో ఉపయోగించే ఉడికించి నలిపేసిన ఆలు ,చిన్న చిక్కుళ్ళు,తరిగిన కొత్తిమీర,ఉల్లి ఇంకా ఇతర పదార్థాలు పానీ పూరి లో ఉపయోగిస్తారు.
దీంట్లోనూ ఎన్నో ప్రయోగాలు చేసినవారున్నారు. చిన్నా పెద్ద,పేద ధనిక అనే తేడా లేకుండా ఎంతోమంది ఈ పానీ పూరి ని లాగిస్తుంటారు. దీనివల్ల సాఫీ విరోచనం అవుతుందని ప్రతీతి. ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళ లలో ఈ తినుబండారాన్ని అతిథులకి సప్లయ్ చేస్తారు.అలాంటి కాంట్రాక్టులు పొంది ఇబ్బడి ముబ్బడిగా సంపాదించిన వ్యాపారస్తులు ఎందరో!
మహారాష్ట్ర లోని జల్నా అనే పట్టణం లో అలాంటి ఓ వ్యాపారి కాశీనాథ్ వామన్ రావు గాలీ! ఈయన గత 18 ఏళ్ళుగా ఈ పానీ పూరి వ్యాపారం చేస్తూ కోటీశ్వరుడయ్యాడు. వ్యాపారం పెట్టిన మొదట్లో 250 రూపాయల దాకా వచ్చేవి. క్రమేణా నాణ్యమైన వస్తువుల్ని ఉపయోగిస్తూ, ప్రయోగాలు చేస్తూ కష్టమర్లని ఆకట్టుకున్నాడు.అంతే గాక ఆ చుట్టుపక్కల ఎక్కడ పెళ్ళి ఉన్నా ఈయనే పానీపూరి కాంట్రాక్ట్ తీసుకుంటాడు.
ఈయన గూర్చి ఎన్నో జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాబట్టి పానీ పూరి ని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే! రుచికరం గా చేయాలే గాని కష్టమర్ల రద్దీ మామూలుగా ఉండదు. ఆ విషయం మనకి రోడ్ల పక్కన కొన్ని పానీ పూరి బండ్లని చూస్తుంటేనే తెలిసిపోతుంది.
----- మూర్తి కెవివిఎస్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి