Pages

10, సెప్టెంబర్ 2019, మంగళవారం

"సాహూ" సినిమా గురించి నాలుగు ముక్కలు...!కొన్ని రోజుల క్రితం చూశాను.రకరకాల అభిప్రాయాలు సోషల్ మీడియా లోనూ,ఇతరత్రాను వ్యక్తమవుతుంటే ఎలా ఉందో చూద్దామని..!చాలామంది అన్నంత చెత్త గా అయితే లేదు.అలాని మరీ అంత సూపర్ అనీ చెప్పలేను.అసలు నేను ఈ మధ్య సినిమాలు చూడటం చాలా తగ్గించా.అలాంటి నా చేతనే టికెట్ కొనిపించాడంటే ఒక్కోసారి నెగిటివ్ పబ్లిసిటీ కూడా వర్కవుట్ అవుతుందనేగా అర్ధం. బాహుబలి తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా గా దీనిమీద ఎక్కువ హైప్ క్రియేట్ అయింది. భారత్ మొత్తం మార్కెట్ చేసే దశ కి తెలుగు సినిమా చేరుకోవడం నిజం గా గొప్ప విషయం.సరే వివిధ భాషల్లోకి అనువదింపబడే అనుకొండి.

హీరో గా ప్రభాస్ నూటికి నూరు పాళ్ళు సరిపోయాడు.హిందీ అమ్మాయి అయినా శ్రద్ధా కపూర్ కూడా క్యూట్ గా పాత్ర లో ఒదిగిపోయింది.ఇతర నటీ నటుల ఎంపిక అంతా ఇంకా బాగుంది. విలన్లు ఎక్కువ కనబడటం వాళ్ళు ఆ డెన్ లలో సమావేశాలు పెట్టుకోవడం,ఎత్తులు పై ఎత్తులు,ఫైటింగ్ లు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అన్నది కలగా పులగమై కొంత సందిగ్ధం నెలకొనే మాట నిజమే.కాదనలేము.అయితే దర్శకుడు మరియు కధకుడు అయిన సుజిత్ తెలుగు వారి మేధస్సు ని కొద్ది గా ఎక్కువ అంచనా వేసుకున్నాడు. మన వాళ్ళకి ఏమిటంటే చందమామ కధ లా పూస గుచ్చినట్లు చెప్పాలి. సామాన్య ఆడియన్స్ అలా ఉండనివ్వండి..వెబ్ సైట్ లలో రాసే ప్రొఫెషనల్ క్రిటిక్స్ కూడా ఆంతే ఉన్నారు.అది అసలు విషాదం.

ఇంటిలిజెన్స్ ని,చమక్కు ని,ఒక కన్నింగ్ తో కధ ని నడిపే విధానం ని మనం హాలివుడ్ సినిమా ల్లో చూస్తూ ఉంటాము.అక్కడ అయితే అప్రిషియేట్ చేస్తాము గాని అదే మన దగ్గర కి వచ్చేసరికి ఆమోదించలేము ఒక వెరైటీ కోసమైనా సరే..! సరిగ్గ ఇక్కడే మిగతా తెలుగేతర ప్రాంతాల్లో ఈ సినిమా కి ప్లస్ అవుతుంది. ఏ వెబ్ సైట్ లో చూసినా చాలామంది ప్రభాస్ ని అండర్ కవర్ పోలీస్ గా వర్ణించారు.నిజానికి తను అంతకంటే పైది.అంటే అండర్ కవర్ గా నియమించబడ్డ అధికారి స్థానం లో వచ్చి ఆ అధికారి ని విలన్ గా క్రియేట్ చేయడానికి ప్రయత్నించి సఫలమైన పాత్ర.చాలా సినిమా నడిచేదాకా అది అర్ధం కాదు.ఇటువంటి టూ మచ్ ఇంటెలిజెంట్ డ్రామా అనేది ఇంగ్లీష్ సినిమాల్లో సర్వ సహజం.మన ప్రేక్షకులు కొద్దిగా అలవాటు పడవలసి ఉంది.

ఇంగ్లీష్ సినిమాల నుంచి మాఫియా డాన్ ల కధల్ని మనవాళ్ళు బాగానే ఎత్తివేస్తుంటారు గాని కొన్ని మౌలిక అంశాల్ని విస్మరిస్తుంటారు. గాడ్ ఫాదర్ నవల ఆధారం గా వచ్చిన సినిమాల నుంచే ఈ తరహా సినిమా నిర్మాణాలు పెరిగాయి.దానినుంచి ఎన్ని సినిమాలు అయినా వండవచ్చు.దానిలోని ముడిసరుకు అలాంటిది. వ్యక్తిగత రాగద్వేషాల తో సమిష్టి ప్రయోజనాలకి చేటు తేవడం అనేదాన్ని మాఫియా ఎథిక్స్ అంగీకరించదు. మీటింగ్ లో తనని చూసి  చిన్నబుచేట్లు నవ్వాడని ఒక డాన్ తండ్రిని హింసించడం కుర్రచేస్టలు. భౌతిక ప్రపంచానికి సంబందించిన చాలా విషయాల్లో మాఫియా పరిణితి తో వ్యవహరిస్తుంది.అపరిమితమైన అధికారం కలిగిఉన్నప్పుడు దాన్ని ఆచి తూచి వినియోగించాలి అనేది అండర్ గ్రౌండ్ నీతి.ఇలాంటివి అన్నీ తమ ఉనికిని బయట పడనీయకుండా చేయడానికే.

గాడ్ ఫాదర్ యొక్క విషయమే చూడండి...ఎక్కడా తను పబ్లిసిటీ కోసం ప్రయత్నించడు,కాని పనులు అన్నిటినీ ఏ ఏ తీగలని ఎక్కడ మీటి ఎలా నడిపించాలి అనేదాన్ని చాలా పరిణితి తో చేస్తుంటాడు.దానిలో పరస్పరం సహకరించుకునే విధానానికి పెద్ద పీట ఉంటుంది.అరుపులు పెడబొబ్బలు లేకుండా ప్రణాళికలు సాగిపోతుంటాయి.తేడా లు వచ్చినపుడు  చావులు కూడా నిశ్శబ్దం గా నే జరిగిపోతుంటాయి. అసలు మాఫియా అంటే ఏమిటి..? ఒక వ్యవస్తీకృతమైన నేర వ్యవస్థ. సిసిలీ సమాజం నుంచి వచ్చిన పదం. ప్రస్తుతం ప్రపంచం అంతా ఒక మాఫియా వ్యవస్థ లో భాగంగా నే జరిగిపోతోంది.కాని అది బ్రహ్మపదార్థం లా  ఎక్కడా అది మన కళ్ళ కి కనపడదు. ఎవరి పాత్రలు వారు పోషిస్తుంటారు,కొన్ని తెలిసి కొన్ని తెలియక.తెలిసినా దాని జోలికి పోనంత కాలం మన జోలికి అదీ రాదు.కొన్ని అలా వదిలేసి చూస్తూండటమే మంచిది.

సరే...సినిమా కి వద్దాము. సంగీతం మంచి మూడ్ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా లెవెల్ ని మరో స్థాయికి తీసుకు వెళ్ళింది సుజిత్ ఆలోచన.అయితే పోలీస్ గా ఉన్న సమయం లో ప్రభాస్ పాత్ర మరో పోలీస్ అధికారిణి తో మరీ అంత లూజ్ గా మాట్లాడటం అసంబద్ధం గా ఉంది.వినోద భరితం గా ఉండటానికి వేరే విధంగా కూడా ప్లాన్ చేసి ఉండవచ్చు ఆయా సన్నివేశాల్ని..! కెమెరా పనితనం మరింత అందం తెచ్చింది.ఆ..ఇంకొకటి చుంకీ పాండే కి కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చింది దేవ రాజ్ పాత్ర ద్వారా..!
            

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి