Pages

20, ఫిబ్రవరి 2025, గురువారం

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

-------------------------------------------------


 కాకి ని చూడని వారు అంటూ బహుశా ఎవరూ ఉండరు. కాకి మీద ఎన్నో సామెతలు ఉన్నాయి. ఆ పక్షి మన పిట్టగోడ మీద నుంచి అరిస్తే చాలు ఈరోజు మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నట్లు భావిస్తాం. అంతే కాదు,పితృ దేవతలకి మనకి సంధానకర్త గా అనుకోవడం కద్దు. మనం పెట్టిన పిండం కాకి ముట్టకపోయినట్లయితే పై లోకం లో ఉన్న పెద్దలు మనపై కోపం గా ఉన్నారేమో అనుకుంటాం. ఇవన్నీ నిజమా,కావా అన్నది అటుంచితే కాకి తో మానవుడి జీవితం ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ ఉదంతాలు తెలుపుతాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత గల ఆ జీవులు గూర్చి కొంతైన తెలుసుకోవాలి. కాకులు మంద లోనూ, ఒంటరి గానూ జీవిస్తాయి. వీటి జీవిత కాలం రమారమి ఇరవై ఏళ్ళు.

ఇవి మనుషుల మొహాల్ని బాగా గుర్తుంచుకోగలవు. దాదాపు అయిదేళ్ళ పాటు గుర్తుంచుకుంటాయంటే ఆశ్చర్యం గా లేదూ!ఏడు ఏళ్ళ పిల్లలకి ఉండేంత తెలివి వీటికి ఉంటాయి.అంటే ముఖ్యం గా సమస్య ని పరిష్కరించుకోవడం లో,కమ్యూనికేట్ చేయడం లో కాకి కి ఉండే నైపుణ్యం ఆ స్థాయి లో ఉంటుంది. దాని మెదడు లో కూడా మనకి మల్లే  చిక్కగా అల్లుకుని ఉండే న్యూరాన్లు ఉంటాయి. మనుషులు చేసే మంచి పనులు,చెడ్డ పనులు కూడా అవి గుర్తు పెట్టుకోగలవు. అంటే కాకి కి మీరు అన్నం పెట్టినా,ప్రేమ గా చూసినా అవి మిమ్మల్ని చాలా కాలం గుర్తుంచుకుంటాయి. మీకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాయి.

మీరు గనక వాటి పిల్లల కి రాళ్ళు వేసినా లేదా వాటి గూడు కి దగ్గరగా వెళ్ళినా, పాడు చేసినా మిమ్మల్ని గుర్తు పెట్టుకుని తగిన గుణపాఠం కూడా చెబుతాయి. అప్పుడప్పుడు పేపర్ల లో చదువుతుంటాం. కాకి పగబట్టి వేధిస్తున్నదని,బయటకి వచ్చినప్పుడల్లా కాళ్ళతో నెత్తి మీద తన్ని పోతున్నాయని ఆవేదన తో ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.   

మరి అలాంటి సమయం లో ఏం చేయాలి అంటే మనం ఉండే ప్రదేశాన్ని గాని, ఊరిని గాని మార్చడమే చేయగల పని. అంతే తప్పా వేరే దారి లేదు. ఒక్కోసారి కాకులు బాగా అరుస్తుంటాయి. రొద పెడుతుంటాయి. వాటిలో వాటికి కోపం వచ్చినప్పుడు  లేదా ఇతర సంగతుల్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి అలా అరిచి గోల చేస్తుంటాయి. రాత్రి పూట ఆలశ్యంగా గూళ్ళకి వచ్చిన కాకులు చెట్టు కి కింద ఉన్న కొమ్మల మీద కి వెళ్ళవలసిందిగా మిగతా వాటిని అడుగుతుంటాయి.అవి మనకి గోల గా అనిపించడం సహజమే.

సాధారణం గా కాకులు మర్రి చెట్ల మీద,ఇతర పెద్ద చెట్ల మీద, తోటల్లో నివసిస్తాయి.పండ్లను,చిన్న పురుగుల్ని,ధాన్యాల్ని,చేపల్ని తింటాయి. కోడి పిల్లల్ని ఎత్తుకుపోతుంటాయి. ఇతర పక్షుల గూళ్ళని పాడు చేసి వాటి గుడ్లని కూడా తినేస్తాయి.మనం వాటికి ఏదైనా ఆహారం వేసినా గుర్తు పెట్టుకుని అవి మనల్ని విష్ చేస్తాయి.అయితే వాటి భాష మనం అర్థం చేసుకోలేము కనక పట్టించుకోము. ఏ కాకి అయినా మనల్ని చూసి తల ని బౌ చేసినట్లుగా ఊపితే థాంక్యూ అని అర్థం అన్న మాట. అంతే కాదు, వాటికి బాగా నచ్చినట్లయితే కొన్ని బహుమతుల్ని కూడా మనకి ఇస్తుంది. రంగు రంగుల చిన్న రాళ్ళు,మెరిసే ఆకులు ఇలాంటి వాటిని మనకి దగ్గర్లో పారేసి పోతుంది. చూశారా, మనం రోజూ చూసే కాకి వెనుక ఎంత కథ ఉన్నదో !     


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి