Pages

29, నవంబర్ 2023, బుధవారం

మెడిసిన్ చదవడానికి కిర్గిస్తాన్ వెళుతున్నారు, సరే... అక్కడ క్వాలిటి ఎలా ఉందో ?


 ఈ మధ్య వైద్యశాస్త్రం చదవాలంటే చాలామంది విదేశాలు వెళ్ళిపోతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. మన దేశం లోని చాలా మెడికల్ కాలేజీలు ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు వసూలు చేసే ఫీజులు భయంకరం గా ఉండి మధ్య తరగతి కుటుంబాలు భరించలేని స్థితిలో విదేశాలకి వెళ్ళిపోతున్నారు.  ప్రతి ఏటా ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు నీట్ పాసవుతున్నారు. కానీ ఉన్న సీట్లు దేశం మొత్తం మీద తొంభై వేలు మాత్రమే..!

హంగరీ,కజాన్, బెలారస్, కిర్గిస్థాన్, చైనా ,ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకి మన వాళ్ళు వైద్యవిద్య కోసం వెళుతున్నారు. కిర్గిస్తాన్ లాంటి దేశాల్లో ఒక సంవత్సరం కి గాను మూడన్నర నుంచి అయిదు లక్షలు చెల్లించవలసి ఉంటుంది.ఎక్కువ లో ఎక్కువ ఇరవై లేదా పాతిక లక్షల్లో వైద్య విద్య మొత్తం అయిపోతుంది. కానీ అదే మన దగ్గర ఒక్క సంవత్సరానికి గాను పాతిక లక్షల నుంచి కోటి రూపాయలకి పైగా ప్రైవేట్ కాలేజీల్లో చెల్లించాలి.కిర్గిస్తాన్ లో వైద్యవిద్య అభ్యసించిన గ్రాడ్యుయేట్ కి ఎం సి ఐ, డబ్ల్యు హెచ్ ఓ  లాంటి సంస్థలు సైతం గుర్తింపు నిస్తున్నాయి.

మన నీట్ స్కోర్ ని  కూడా ఆ దేశాలు గుర్తిస్తున్నాయి. నాణ్యత పరంగా కూడా మంచి విద్యనే అవి తక్కువ ధర లో అందిస్తున్నాయి.కనుకనే మనవాళ్ళు క్యూ కడుతున్నారు.ఆసియా దేశాల్లో పాకిస్తాన్,బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళుతున్నారు. ప్రతి ఏటా సుమారు పాతికవేలమంది వైద్యవిద్య నిమిత్తం మన దేశం నుంచి బయటకి వెళుతున్నారు. అదే విధం గా మన మెడికల్ గ్రాడ్యుయట్ లు ప్రతి ఏటా అయిదువేల మంది ఇతర దేశాలకి ఉద్యోగనిమిత్తం వెళుతున్నారు.ఆస్ట్రేలియా,కెనడా,ఇంగ్లాండ్,అమెరికా,నెదర్ లాండ్స్ లాంటి దేశాల్లో మెరుగైన వేతనాల కోసం వెళుతున్నారు.   




    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి