కేంద్ర సాహిత్య అకాడెమీ ఇటీవల రస్కిన్ బాండ్ అనే రచయిత కి అత్యున్నతమైన ఫెలోషిప్ ని ఇచ్చి గౌరవించింది. రస్కిన్ బాండ్ అనగానే ఇంగ్లీష్ పాఠకులకి వేరే చెప్పనవసరం లేదు. కానీ మన తెలుగు పాఠకులకి తెలియవలసినంత తెలియదేమో !
కావలసినన్ని అనువాదాలు కాకపోవడమే కారణం కావచ్చు. ఈ నెల లో 90 వ యేటి లోకి ప్రవేశిస్తున్న ఆయన మౌలికంగా పిల్లల కోసం రాసినప్పటికీ పెద్దవాళ్ళని కూడా బాగా ఆకట్టుకుంటాయి.
దాదాపుగా 500 కథలు రాశారు.ఇవి కాక నవలలు,ట్రావెలోగ్ లు,వ్యాసాలు ఇలా ఇతర ప్రక్రియల్లోనూ సిద్ధహస్తులు.
1938 లో బ్రిటీష్ దంపతులకి హిమాచల్ ప్రదేశ్ లోని కాసూలి లో జన్మించారు. అయితే మన దేశాన్నే ఆవాసంగా చేసుకున్నారు.
ప్రస్తుతం ముస్సోరి లో హిమాలయ సానువుల్లో నివసిస్తున్నారు.ఆయన రచనలన్నీ ఆ అడవులు,జంతువులు,కీటకాలు,పక్షులు అన్నీ ఆ ప్రాంతాలనుంచే ఆధారంగా చేసుకొని రాయబడ్డాయి.
బ్రిటీష్ వారు ఉన్నప్పటి కాలం లోకి వెళ్ళి మనకి అప్పటి జీవితాన్ని చూపిస్తారు. తన జీవితాన్నే చాలామటుకు తన రచనల్లో వెల్లడించారు. ద రూం ఇన్ ద రూఫ్ అనే నవలిక ద్వారా ఆయనకి మంచి ప్రొత్సాహం లభించింది.
ఇక ఆ తర్వాత నుంచి ఆపకుండా రాస్తూనే ఉన్నారు. ముంబాయి నుంచి వచ్చే ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక కి సంపాదకులు గా పనిచేశారు. ఆ తర్వాత దాన్ని విరమించుకొని పూర్తి స్థాయి రచయిత గా ఉండిపోయారు.
అనేక ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల్లో ఆయన కథలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి ఓ నాస్టాల్జిక్ అనుభూతి ఉంటుంది.కొన్ని నవలల్ని ,కథల్ని సినిమాలుగా తీశారు.జునూన్ సినిమా ఆ కోవలోనిదే. బాండ్ ఇంగ్లీష్ భాష కూడా సింపుల్ గా ఉంటుంది.
అదే విషయాన్ని ప్రస్తావిస్తే క్లారిటీ గా ఉండటం తనకి ముఖ్యమని దానిలో భాగం గానే నా రచనలు అలా ఉంటాయని అంటారు.
బాండ్ అభిమానులు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు.అంతా కలిసి ఆయన రచనల మీద ఓ డిజిటల్ పత్రిక నడుపుతున్నారు. ముస్సోరి లో ఉన్నకేంబ్రిడ్జ్ బుక్ డిపో లో ఆయన తన అభిమానుల్ని కలిసి ముచ్చటించడం, పుస్తకాలకి సైన్ చేయడం చేస్తుంటారు.
ఈ మధ్య ఆరోగ్య కారణాల వల్ల ఇంటికే పరిమితమయ్యారని తెలుస్తోంది. అకాడెమీ అధికారులు కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఫెలోషిప్ ని అందజేశారు. రస్కిన్ బాండ్ ఇంగ్లీష్ లో రాసినప్పటికీ భారతీయ సాహిత్యం లో మరువరాని ఓ ప్రత్యేక సంతకమని చెప్పకతప్పదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి