Pages

13, అక్టోబర్ 2015, మంగళవారం

రుద్రమదేవి సినిమా పై నా రివ్యూ....!!!



ఒక్కమాట లో బాగలేదని కాని లేదా అద్భుతం గా ఉందని గాని చెప్పలేము.ఇది ఒక చారిత్రక  ఘట్టాన్ని వెండి తెర పై ఆవిష్కరించిన వైనం.ఏ సినిమా అయినా నూటికి నూరు పాళ్ళు చరిత్ర ని ప్రతిబింబించడం అసంభవం.కారణం కొన్ని ఏళ్ళ జీవితాల్ని గంటల్లో ఎలా చెప్పగలం.కాకతీయ సామ్రాజ్యం తెలుగుల జీవితాల్లో ముడిపడిన అంశం.అందునా రుద్రమ దేవి గూర్చి చెప్పే పని ఏముంది.అయితే ఒక అరుదైన అంశం తో సినిమా తీసిన నిర్మాత దర్శకుల్ని  అభినందించవలసిందే.ఈ రకంగానైనా ఆనాటి గొప్ప విషయాల్ని కొన్ని స్మరించుకునే అవకాశం కలిగింది.క్రీ.శ. 1245 -1289 మధ్య కాలం లో రుద్రమ పాలనా కాలం.వారి నిర్మాణాలు ముఖ్యంగా కళా తోరణాలు ,ప్రత్యేకమైన శిల్ప రీతి,ఆలయ నిర్మాణ కౌశలం   ఇంకా చెరువులు ,వ్యవసాయ పద్ధతులు ఇలాంటి వాటన్నిటిలో ఒక ప్రత్యేక పుంతని తొక్కి కాకతీయులు నేటికి జనాల్లో నానుతూనే ఉన్నారు.

సినిమా ముఖ్యంగా ఆనాటి రాజకీయ పరిస్థితుల్ని ప్రతిబింబించింది. ఏ సంధర్భం లో  స్త్రీ అయిన రుద్రమ పురుషుని గా   రాచవిధులు    నిర్వహించవలసి వచ్చింది.సామంతుల్ని  ఏ విధంగా కట్టడి చేయగలిగింది..ఈ నేపధ్యం గా కధ సాగుతుంది.అనుష్క అటు పురుష వేష ధారణ లోను ఇటు స్త్రీ గాను మెప్పించిందనే చెప్పాలి. గోన గన్నా రెడ్డి గా అల్లు అర్జున్ ఎక్కువ మార్కులు కొట్టేశాడు.ఆ నల్లని దుస్తులు గుర్రానికి తనకి  బాగానే కుదుర్చుకున్నాడు.అయితే అతను మాట్లాడిన ఒక రకం తెలంగాణ  మాండలికం ఆ కాలం లో ఎక్కడుందని..?ఆ తర్వాత కొన్ని వందల ఏళ్ళకి నిజాంలు వాళ్ళు వచ్చిన తర్వాత గదా అ ఉర్దూ ప్రభావం అదీ పడి తెలుగు ఒక యాస రూపం దాల్చింది.అన్ని వంకర్లు పోయింది.అది పాలకుల తప్పు తప్ప ప్రజలది కాదు.చాళుక్య వీరభద్రునిగా రాణా ఫరవాలేదు.ప్రకాష్ రాజ్ కి తగిన పాత్ర కనక ఒదిగిపోయాడు.గణపతి దేవుని సభలో సామంతులు మరీ అంత ఈసడించినట్లు డైలాగులు కొట్టడం అతికినట్లు లేదు.

అర్జున్ కి ప్రాధాన్యతని ఇచ్చినా మరో వైపు స్త్రీ శక్తిని పైకెత్తడం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.కనుక మహిళలు  రుద్రమ దేవి పాత్రకి బాగా కనెక్ట్ అవుతారు.అసలు ఏ గ్రాఫిక్స్ లేకపోయినా చరిత్ర  కి సంబందించిన సినిమాలు మంచిగా కధనం తో తీయాలే గాని అట్లా నిలిచిపోతాయి.బొబ్బిలి యుద్ధం లో ఏ గ్రాఫిక్స్ ఉన్నాయని నిలిచిపోయింది.ఈ రోజుకి.అవన్నీ మూడు రోజు ముచ్చట్ల లాంటివి.

నిరాశపరిచిన అంశం ఏమిటంటే ఇళయ రాజా యేనా ఈ సినిమా కి సంగీతం అందించింది లేదా ఆయన పేరు మీద ఇంకెవరైనా చేశారా అని ప్రతి ఒక్కరకి సందేహం వస్తుంది. మొత్తం మీద సినిమా ని ఒకసారి చూడటం లో నష్టం ఏమీ లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి