Pages

31, జులై 2016, ఆదివారం

టూరిజం శాఖ లో రావలసిన మార్పులు...


వరంగల్ కి బెస్ట్ హెరిటేజ్ సిటి గా,ఇంకా ఓ కాఫీ టేబుల్ బుక్ కి కూడా సెంట్రల్ అవార్డ్ రావడం మంచిదే.మధ్య ప్రదేశ్ ,గుజరాత్ ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా కొన్ని గెలుచుకున్నాయి.ఒడిశా ,చత్తిస్ గడ్ లాంటి రాష్ట్రాల్లో కూడా రైలు స్టేషన్ ల లో మాత్రమే కాకుండా ప్రముఖ బస్ స్టేషన్ ల లో కూడా సిటీ సైట్ సీయింగ్ కి,ఇతర టూరిస్ట్ ప్యాకేజీల్ని బుక్ చేసుకోవచ్చును.అదేమిటో గాని మన హైదరా బాద్ లో సెంట్రల్ బస్ స్టేషన్ లో టూరిజం కౌంటర్ ఒక్కటీ లేకపోవడం వింతేనని చెప్పాలి.ఆ ఆఫీస్ కి ఫోన్ చేసినా సరైనా రెస్పాన్స్ ఉండదు.విజిటర్ దగ్గరకి మనం వెళ్ళాలి తప్ప వాళ్ళే చచ్చినట్లు వస్తారు అనుకునే ఆలోచనని వదులుకోవాలి.టూరిజం లో కొత్త పుంతలు తొక్కుతూ జనాల దగ్గరకి వెళ్ళడానికి దేశాలు ప్రయత్నిస్తుంటే ఇంకా సగటు ఉద్యోగి  మనస్తత్వాన్ని ప్రదర్శించే ధోరణి ని వదులుకోవాలి.ఆర్భాటంగా పబ్లిసిటి చేస్తే సరిపోదు...విజిటర్స్ ని ఇబ్బంది పెట్టకుండా సౌకర్యాల్ని కింది స్థాయికి తీసుకుపోవాలి.

23, జులై 2016, శనివారం

విదేశీ పెట్టుబడులు మీద శ్వేతపత్రం ప్రతి ఏటా ఎందుకు ప్రకటించరు..?

విదేశీ పెట్టుబడులు మీద శ్వేతపత్రం ప్రతి ఏటా ఎందుకు ప్రకటించరు..? మాట్లాడితే రాష్ట్రం బాగుపడాలంటే వేరే దేశాల కంపెనీలు పెట్టుబళ్ళు పెడితే తప్ప జరగదనే భావనకి ప్రజల్ని పాలకులు తీసుకొచ్చారు.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతలు గురించి చెప్పాల్సిన పని లేదు.రకరకాల విదేశీ వ్యక్తులతో ఫోటోలు మాత్రం పేపర్ల లో దండి గా వస్తున్నాయి.ఎన్ని కంపెనీలు ఇప్పటి దాకా వచ్చాయి,ఎంతమందికి దానివల్ల ఉద్యోగాలు దొరికాయి,రాష్ట్ర ప్రగతి లో వాటి వాటా ఎంత,వాటి కార్యకలాపాలు ఏమిటి..ఇవన్నీ ఎందుకు ప్రతి ఏటా ఎందుకు బహిరంగపరచరు..?ఇవి తెలుసుకునే హక్కు ప్రజలకి లేదా..?

ఇక రాజధాని ని ఫారిన్ కంపెనీలు తప్ప భారతీయులు కట్టలేరు అని చెప్పుకోవడం సిగ్గు చేటు కాదా..? ఇన్నాళ్ళ స్వాతంత్ర్యానికి ,మన ప్రభుత్వాలు ఇచ్చిన విద్య ఇదంతా కేవలం డొల్ల అని ఒప్పుకుంటున్నట్లేగా..?పాలన మాత్రం ఎందుకు...అది కూడా విదేశీయులకే కట్టబెడితే ఇంకా బాగా ఉంటుందిగా..అబ్బే అది మాత్రం మనకే కావాలి,అడ్డంగా దోచుకోవడానికి..!

10, జులై 2016, ఆదివారం

ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాల ల్లోకి రాకుండా అడ్డు పడేది వీరేనా..?


ప్రభుత్వం వారు ఇంగ్లీష్ మీడియం ని ప్రాధమిక స్థాయినుంచి పెడతాము అని అంటుంటే ఎందుకని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు అని ఆలోచిస్తే దీని వెనుక కూడా కార్పోరేట్ స్కూల్ యాజమాన్యాల ప్రమేయం ఉన్నదేమో అనే అనుమానం వస్తోంది.ఎందుకంటే కొన్ని వందల కోట్ల వ్యాపారం ని ఇంగ్లీష్ చదువులు పేరు మీద పెద్ద విద్యా సంస్థలు ప్రతి ఏటా కొల్లగొడుతున్నాయి.అదే ఇంగ్లీష్ మీడియం ని గవర్నమెంట్ స్కూల్స్ లో పెడితే వాటిని చూసే వారు ఎవరుంటారు..? అందుకే తెలుగు ఎమోషన్ ని పైకి తెస్తూ ,సంస్క్రుతి నాశనం అవుతుందని అదని ఇదని కారణాలు చెబుతూ కొంత మంది అనుకూల వాదులు రెచ్చగొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇంజనీరింగ్ గాని మెడిసిన్ గాని ఇంకే పై కోర్స్ గాని ఆంగ్లం లో నే నూటికి నూరు పాళ్ళు ఉంటున్నాయి.మరి వాటిని అన్నిటిని తెలుగు లోకి అనువదించే పని ఎందుకు చేయరు..?అదే విధంగా తెలుగు మీడియం అనేది లేకుండా కేవలం ఇంగ్లీష్ మీడియం లనే నడిపే కార్పోరేట్ విద్యా సంస్థల ముందు వీళ్ళు ఎందుకు బైఠాయించరు..?వాటిని ఎందుకు తీయించరు..?డబ్బు చెల్లించలేని పేద పిల్లలు ఎప్పటికీ తెలుగు మీడియమే చదవాలనేది వీరి అంతరంగమనుకుంటా..!!!

8, జులై 2016, శుక్రవారం

ఇది మహా ద్రోహం...మీరేమైనా అనండి..



ఒకప్పుడు పట్టించుకునేవాడిని కాదు గాని,ఈ మధ్య ఆలోచిస్తుంటే అనిపిస్తోంది. ఇది మరీ ఘోరమని.ఒక వ్యక్తి మీద నో,ఇంకో దాని మీద నో ఒక పేరు ఒక ఊరికి పెడతాము అయితే కాలం గడుస్తున్న కొద్ది ఆ పేరు మారి పోయి ఇంకోలా తయారవుతుంది.దానికి కారణం ఎవరు అంటే అర్ధ జ్ఞానం చేతనో, అలవి మాలిన సగం బ్రెయిన్ వల్ల నో కొంత మంది అలా ఉచ్చరిస్తారు.అదే ఒక తంతు లా సాగుతుంటుంది,లేకపోతే ఏమిటి హైదర్ జంగ్ అనే ఆయన మీద హైదరా బాద్ అనే పేరు పెట్టడం జరిగింది.ఇష్టం ఉన్నా లేకున్నా ఆ పేరు ని అలా ఉచ్చరించాలా లేదా..?దానికి బదులు గా కొంత మంది ఫేషన్ గా హైడ్రా బాడ్ అనో హైడెర్య బాద్ అనో పిలుస్తుంటే నాకైతే కాలుతుంది. ఈ మహానుభావులు అప్పుడే ఏ ఇతర గ్రహం నుంచో వచ్చినట్లుగా ఇక్కడి ఉచ్చారణలు తెలియనట్లు పోజు కొడుతుంటే వాళ్ళ మిడి మిడి జ్ఞానానికి   జాలి కలుగుతుంది.

1, జులై 2016, శుక్రవారం

"బిచ్చగాడు" సినిమా పై నేను అనుకున్న వి అన్నీ దీంట్లో బాగా రాశాడు.



కొన్ని సార్లు మనం అనుకున్న వి అన్నీ ఎవరో రాస్తుంటారు.బిచ్చ్గాడు సినిమా చూసిన తర్వాత నాలో కలిగిన భావాలన్నీ ఈ సైట్ లో ఎవరో గాని బాగా రాశారు అనిపించింది.మీరు ఒక లుక్కేయండి. www.mailing234.blogspot.com

19, జూన్ 2016, ఆదివారం

"బిచ్చగాడు" సినిమాపై రివ్యూ



అసలు సినిమా ని తీయడానికి ఎంచుకున్న ఇతివృత్తమే అభినందనీయమైనది.పైగా సాటి మనుషుల్లా కూడా గుర్తింపు కి నోచుకోని బిచ్చగాళ్ళ మీద ..ఒక నిమిషం వాళ్ళ గురించి ఆలోచించేలా చిత్రాన్ని తీసిన దర్శక నిర్మాతల్ని హీరోని మిగతా టీం ని అభినందించాలి.మళ్ళీ బోరు కొట్టకుండా అతి కృత్రిమ సన్నివేశాలు లేకుండా తీయడం వల్ల నావెల్టి వచ్చింది.ఇది తమిళ్ లో పిచ్చైకారన్ అనే పేరుతో రిలీజ్ అయింది,అయితే అక్కడ కంటే తెలుగు లో సూపర్ హిట్ అయి సంచలనం సృష్టించింది.కారణం మన రొడ్డ కొట్టుడు హీరోల స్టార్ డం ఇంకా వెరైటీ గా ఆలోచించడానికి సత్తా లేని తెలుగు సినీ బ్రెయిన్ లు.

ఇప్పటికే ఈ సినిమా టాక్ బయటకి వచ్చి చూద్దామని వెళ్ళాను.ఒక వెరైటీ సినిమా చూసిన అనుభూతి కలిగింది.ఆ హీరో ఎవరి కొడుకైతే ఏమిటి,ఏ కులమైతే ఏమిటి,ఏ భాష వాడు అయితే ఏమిటి...వచ్చిన ఆడియన్స్ ని నిరాశపరచలేదు.అదీ కావాల్సింది.హీరో వోవర్ యాక్షన్ చేయకుండా సహజంగా పరిధి మేరకు చేశాడు.హీరోయిన్ కూడా ఓ కె.ఈ సినిమా కి సంగీతం,నిర్మాత కూడా దీని హీరో విజయ్ ఆంటోని యే.ఎక్కడా బోరు కొట్టలేదు.చివరిలో హృదయం బరువెక్కుతుంది.

28, మే 2016, శనివారం

ఎన్ టి ఆర్ తో తెలుగు సమాజం లో వచ్చిన మార్పులు



ఈ రోజు మహానటుడు ఎన్ టి ఆర్ జయంతి సందర్భంగా కొంత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన వల్ల కొన్ని మార్పులు తెలుగు వారి జీవితం లో వచ్చాయి అనే చెప్పాలి.మండల వ్యవస్థ వలన సామాన్యునికి ప్రభుత్వం దగ్గరైంది.బి సి లకి కి కొంత వరకు ప్రాతినిధ్యం చట్ట సభల్లో పెరిగింది.ఇంకా కొన్ని మంచి పనులు జరిగాయి.స్వతహా గా ఆయన అన్ని వర్గాల వారికి మేలు చేయాలనే అనేక కార్యక్రమాలు మొదలుపెట్టాడు.చిత్ర సీమ లో అనితర సాధ్యంగా వెలిగిన ఆయన తన ప్రేక్షక జనాల అభిమానాన్ని కడదాకా మర్చిపోలేదు.అయితే ఆయన లోని బలహీనత ఏమిటంటే రాజకీయ టక్కు టమార విద్యలు వంటపట్టించుకున్నవాడు కాదు.కారణం నూటికి నూరు పాళ్ళు అతను కళాకారుడు మాత్రమే.కనుకనే పక్కన ఉన్నవాళ్ళు పార్టిని కేవలం ఒక కుల ఆధిపత్య పార్టీ గా ,కుటుంబ పార్టీ గా మార్చివేశారు. నిజం చెప్పాలంటే కుల స్పృహ అనేది ఎన్ టి ఆర్ ఆగమనం తో తెలుగు సమాజం లో ఉధృతం గా పెల్లుబికింది.మిగతా కులాల వాళ్ళు తమ కింద ఉండాలనే భావన పెరిగి దాన్ని కింది స్థాయి కార్యకర్త నుంచి అమలు చేశారు.దానివల్ల మిగతా కులాల్లో కూడా అసహనం పెరిగింది.దాని వల్లనే పది ఏళ్ళు అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది.రాష్ట్రం విడగొట్టబడటం వల్ల కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిని ఇప్పుడు టి డి పి అధికారం లోకి వచ్చింది. అది మర్చి పోరాదు.

విచిత్రం గా ఎన్ టి ఆర్ ని అత్యంత ఘోరంగా అవమానించిన కుటుంబ సభ్యులు  ..ఆ వంశం..ఈ వంశం ..అని చెప్పుకుంటూ ఇప్పుడు పొగడ్తలు కురిపిస్తుంటే జనానికి నవ్వు రాక చస్తుందా..?అదేమిటో గాని ఒక డ్రమటైజేషన్ లేదా నాటకీయత అనేది పాలన లో చొప్పించడం కూడా ఎన్ టి ఆర్ తో ప్రారంభమై ఇంకా అది కంటిన్యూ అవుతోంది.కొత్త రాజధాని కోసం కబుర్లు,సెంటిమెంట్ డైలాగు లు వింటూంటే ఏవగింపు కలుగుతోంది.అసలు రాజధానికి అంత డ్రామా అవసరమా...అనేక రాష్ట్రాలు విడిపోయాయి..క్రమేపి అలా పురోగమించుకుంటూ  ముందుకు పోతున్నాయి.వాళ్ళెవరూ ఇలాంటి సినిమాటిక్ డైలాగులు చెప్పగా వినలేదు.రాజధాని అనేది ఉన్న పాళంగా ఒకేసారి ప్రపంచ స్థాయి లో కట్టేయాలనుకోవడం పిచ్చివాడి కల లాంటిది.ఏ ప్రపంచ స్థాయి నగరం అలా కట్టబడలేదు..కాలం గడుస్తున్న కొద్దే అలా అవి ఎదిగాయి.సమయం పడుతుంది దేనికైనా..కాని ఆ పేరు మీద ఎన్ని వేల ఎకరాలు సేకరించబడ్డాయి..కాని ఏమి జరుగుతోందక్కడ..? ఎంత సేపు ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ...ఆ కులం ఈ కులం అని కాదు..నిజమైన క్రాంత దర్శనం ముందుకి అడుగు వెయ్యాలి.