Pages

11, డిసెంబర్ 2018, మంగళవారం

టి ఆర్ ఎస్ ని గెలిపించిన టి డి పి,కాంగ్రెస్ లు..!


వినడానికి అదోలా అనిపించవచ్చు గాని ఈ సారి జరిగింది అదే..!నేను ఓ సగటు పౌరుడిని.ఏ పార్టీ మీద వీర భక్తి గాని ఆరాధన గాని నాకు లేదు.నిజానికి ఈసారి తెరాస పార్టీ అధికారం లోకి వచ్చినా హంగ్ లాగా ప్రభుత్వం వస్తుందని అనుకున్నాను.కాని మహాకూటమి రూపం లో జతలు కట్టిన ఆయా పార్టీల్ని చూసి తెరాస మీద సగటు పౌరునికి ఒక జాలి లాంటిదే కలిగింది.ఇన్ని కలిసి ఓ పార్టీని టార్గెట్ చేస్తున్నాయంటే తప్పనిసరి గా కెసియార్ నాయకత్వం బలమైనదే అనే ఊహ జనం లో కలిగింది.ఇంకా తెలంగాణా సగటు పౌరుని విచాక్షణా శక్తి ని చంద్ర బాబు అండ్ కో తక్కువ అంచనా వేశారు.లేకపోతే సుహాసిని ని నిలబెట్టి హరి కృష్ణ మరణం సెంటిమెంట్ ని క్యాష్ చేసుకోవాలని చూడటం ఏమిటి..?పచ్చి చవకపారుతనం కాకపోతే..!వంశాల పేరు చెప్పి తొడలు గొట్టి బాలకృష్ణ లాంటి వాళ్ళు ఓట్లు అడిగితే అసలు వెయ్యాలి అనుకొనేవాడు కూడా వెయ్యడు.ఆంధ్రా లో ఉన్నంత కుల బానిసత్వం తెలంగాణా లో ఉండదు.అది గ్రహించలేక పోయారు.

ప్రస్తుతం తెదేపా తెలంగాణా లో ముగిసిన చరిత్ర.అది ఒప్పుకోనందుకే తెలంగాణా ప్రజలు ఘోరమైన ఓటమి ని చవి చూపించారు. కాంగ్రెస్ కి ఫైనాన్స్ చేసి మరీ తెలంగాణా లో తిష్ట వెయ్యాలని చూసే బాబు రేపు అధికారం లోకి కాంగ్రెస్ వచ్చినా ప్రాజెక్ట్ ల విషయం లో తెలంగాణా కి అన్యాయం చేస్తాడని ఒక మెసేజ్ పంపడం లో తెరాస సక్సెస్ అయింది.అది బాంబు లా పేలింది.పైగా తెలంగాణా లోని ప్రతి అభివృద్ది పని తానే చేశానని కాబట్టి నాకు రైట్ ఉంది చచ్చినట్టు ఓటు వేయండి అని ధోరణి లో మాట్లాడడం ఓటర్లకి చిర్రెత్తించింది.సోషల్ మీడియా అనేది రావడం తో సొంత గప్పాలు కొట్టే పత్రికల్ని ఇప్పుడు జనాలు నమ్మడం మానేశారు అనేది కూడా ఈ ఎన్నికల ద్వారా తెలిసింది. 

19, ఆగస్టు 2018, ఆదివారం

తెలంగాణా ప్రభుత్వం 25 కోట్లు విరాళం గా ప్రకటించడం కొంత అతి గానే ఉంది.

కేరళ లో వచ్చిన వరదలు భీబత్సమైనవే.కాదనడం లేదు.కాని తెలంగాణా ప్రభుత్వం 25 కోట్లు విరాళం గా ప్రకటించడం కొంత అతి గానే ఉంది.దేశం లోనే వాణిజ్య రాజధాని గా పేరుబడి ఉన్న ముంబాయి ని కలిగి ఉన్న మహారాష్ట్ర యే 20 కోట్లు విరాళం ప్రకటించింది.అలాగే ఢిల్లీ మరో సూపర్ వాణిజ్య కేంద్రం ..వాళ్ళూ 10 కోట్లు ప్రకటించారు.మిగతావాళ్ళు 10,5,2 కోట్ల చొప్పున ప్రకటిస్తూ పోయారు.ఇలాంటి అప్పుడు సాధ్యమైనంత దాకా కేంద్రమే దెబ్బ తిన్న రాష్ట్రాన్ని ఆదుకుంటుంది.అది సహజంగా జరగాలి. 

గతం లో అంటే 1999 లో ఒరిస్సా లో తుఫాను ఇంకా వరదల భీబత్సానికి దాదాపు 30 వేల మంది దాకా చనిపోయారు.దివిసీమ లో వరదలప్పుడూ దాదాపు గా ఆ సంఖ్య కి మించే చనిపోయారు.అయితే అధికారికంగా వేలల్లోనే చావులు జరిగాయి.అలాంటప్పుడు గాని ,ఆ తర్వాత వచ్చిన వరదలప్పుడు గాని (ఏ రాష్ట్రం లో గాని) కేరళ రాష్ట్రం ఎప్పుడూ లక్షల్లో నే తప్ప కోట్ల లో ఎప్పుడూ విరాళం ఎవరికీ ఇచ్చినట్లు గుర్తు లేదు.

మన తాహతు చూసుకునే దానాలు ఇవ్వాలి తప్పా ఏదో గొప్పలు కోసం ఇవ్వకూడదు.ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల్లో ఉన్నాయి.ఇంకా అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నాయి.అవన్నీ ఎవరి నెత్తిన చివరకి పడేది..అది ఆలోచించాలి. 

27, జూన్ 2018, బుధవారం

రమణానంద మహర్షి కధ ఏమిటి..?



ఇటీవల కొన్ని రోజుల క్రితం ఫేస్ బుక్ లో రమణానంద మహర్షి ఫోటోలు చూసి ఆశ్చర్య పోవడం జరిగింది.ఏదో దేశం లో బీచ్ లో పడక మంచం లాటి దాని పైన ఓ ఫోజు తో,షార్ట్స్ లో ఓ ఫోజు తో ఇలా యమా ఆధునిక రీతి లో దిగిన ఫోటోలు నివ్వెర పోయేట్లు చేశాయి.సరే..అవి వేసుకోవద్దని ఎవరూ అనట్లేదు గాని..విభూతి బోట్లు పెట్టుకొని కాషాయం కట్టుకొని ..శక్తి పాతం ఇస్తా అదీ ఇదీ అంటూ మీటింగ్ లు గట్రా పెట్టి బ్రాంచ్ ల వారీ గా వసూళ్ళు చేస్తూ తరించే ఈ మనిషి ఉన్నట్లుండి ఇలా దర్శనం ఇవ్వడం కొద్ది గా షాక్ పుట్టించింది.ఈ మహానుభావుడి ప్రసంగాన్ని ఓ సారి అనుకోకుండా విని ఇక మీదట ఎప్పుడూ ఈ యన గారి మీటింగ్ కి ఎంతమాత్రం రాకూడదని అనుకున్నాను.

అసలు మహర్షి అనే పదాన్ని పేరు లో పెట్టుకోడానికి ఎంత ధైర్యం..?రమణ మహర్షి లాంటి వారే తనని తాను మహర్షి అని ఎప్పుడూ చెప్పుకోలేదు.ఆ తర్వాత ఆయన శిష్యులు అలా పిలిచారు.అది స్థిరపడిపోయింది.ఈ నయా మహర్షి ప్రసంగం వింటే అనిపించింది ఏమిటంటే యోగం గురించి గాని,ఆధ్యాత్మిక విషయాల గురించి గాని ఈయనకి తెలిసింది శూన్యం.అయితే వాచాలత ఎక్కువ.వెనకది ముందుకి ముందుది వెనక్కి చెప్పి మాటల గారడి చేస్తుంటాడు.పైగా శక్తి పాతం ఇవ్వడం అంత తేలికా..?మరీ వెర్రివాళ్ళను చేయడం కాకపోతే..!జనానికి ఇలాంటి అంశాల మీద పెద్దగా అవగాహన లేకపోవడం తో ఇలాంటి ఆషాఢభూతులు ఆడింది ఆటగా సాగిపోతోంది.

నిజంగా యోగసాధన లో పురోగమించిన వారి ధరణి యే వేరు గా ఉంటుంది.సంస్కృతమే మాటాడనవసరం లేదు.సామాన్యమైన మాటల్లో చెప్పినా దాని పరిమళాలు గుండెల్లో తాకుతాయి.ఈ రమణానంద కి విపరీతమైన వాగాడంబరమే తప్పా తెలుగు కూడా వంకర టింకర గా మాటాడుతుంటాడు.చదువు వల్ల వచ్చే సంస్కారం గాని సాధన వల్ల వచ్చే సంస్కారం గాని ఈ వ్యక్తి లో మచ్చుకి కనిపించవు.కాని ఇంత బిజినెస్ ఎలా అభివృద్ధి చేశాడో భక్తి పేరు తో...మార్కెటింగ్ టెక్నిక్స్ బాగానే ఉన్నాయి ఈ లెక్కన..!

13, మే 2018, ఆదివారం

కులం తెలుసుకుని మరీ తిట్టడం ఏమిటి..?

ఈ దేశ ప్రజలు బ్రతుకుతున్నది ప్రజాస్వామ్య దేశం లోనా...? లేదా భూస్వామ్య సమాజం లోనా..?ఇన్ని చదువులు..ఇంటా ..బయటా స్వదేశీ విదేశీ చదువులు చట్టుబండలు...గొప్ప ప్రసంగాలు బోధలు...ఇవన్నీ బయటకి కనబడేవి.కాని ఏమాత్రం అవకాశం దొరికినా మద్య యుగాల నాటి దాష్టీకం చూపించి చంకలు చరుచుకోవడం..!ఈ సమాజం కాల చక్రం లో వెనక కి గాని ప్రయాణీస్తోందా అనిపిస్తుంది లేకపోతే వర్ల రామయ్య బస్ లో ప్రయాణించే ఓ కుర్రాడు తనని గమనించలేదని అతని కులం తెలుసుకుని మరీ తిట్టడం ఏమిటి..?

భారతీయ సమాజం లోని అజ్ఞానం ఏంటంటే తనకన్నా తక్కువ కులం వాడిని తిట్టే అర్హత తనకి ఉందని భావించడం..!ఈ వరస ని ఇకనైనా అన్ని పార్టీల లోని వారు గుర్తించి దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది.ఎన్ని చట్టాలు చేసినా వాటిని అమలు చేయించే చైతన్యం ప్రజల్లో లేనప్పుడు అవి గుండు సున్నా తో సమానం.ఈ వివక్షత ప్రజాప్రతినిధుల లోను,మంత్రుల లో ఇంకా పై న కూడా కొనసాగుతోంది.మరి ఆత్మ గౌరవం అంటే ఏమిటి..ఇలాంటి వాటిని వ్యతిరేకించడమే..!  

31, డిసెంబర్ 2017, ఆదివారం

ఏ కులమూ నికార్సైనది కాదు.

ఇటీవల టివి9 వారు చేసిన స్టింగ్ ఆపరేషన్ ..అదే విజయవాడలో ..కులాల గురుంచి...!మరీ ఇంత దారుణామా అనిపించేలా ఉంది.మా కులం వారికే ఇళ్ళు అద్దె కి ఇస్తాం అనేది చాలా దారుణం.అసలు విజయవాడ అంటేనే కులాల కురుక్షేత్రం.అది చాలా పాపులర్ గాని ఇంత రేంజ్ లో ఉండడం విచిత్రం.ఇలా అయితే కొత్త రాస్ట్రం ఎలా అభివృద్ది చెందుతుంది.రాజధాని అన్నప్పుడు సకల జనాలు ఉంటారు...రకరకాల కారణాల తో.కాబట్టి ఇదే పట్టుకొని కూర్చుంటే పురోగతి శూన్యం.కమ్మ ఇంకా కాపు కులాల్లో ఇంత కుల పట్టుదలలు ఉండటం విచిత్రం గా ఉంది.నాకు తెలిసి ఈ రెండు కులాల్లో విపరీతమైన సంకరం ఉన్నది.అంటే ఇతర కులాల వారిని పెళ్ళి చేసుకోవడం లో...ముఖ్యంగా దళితుల్ని..ఇతర బి.సి.కులాల వారిని చేసుకోవడం లో ఈ రెండు కులాలు ముందు ఉంటాయి.ప్రభుత్వ ఉద్యొగాల్లో పై స్థాయిల్లో ఉన్న చాలామంది ఈ రెండు కులాల అమ్మాయిల్ని భార్యలు గా కలిగి ఉన్నారు.కొద్ది గా పరిశీలిస్తే ఎవరైకైనా అర్ధం అవుతుంది. కాని వివక్షత అనేది ఇంకా పాటించుతూ ఏదో సాధించాలనుకోవడం హిపోక్రసీ కాక మరేమిటి.డబ్బు హోదా పదవి ఉంటే చాలు ..ఎవరికైనా కూతుళ్ళని ఇచ్చి చేసే కులాలు ఇంకా కుల తత్వాన్ని పాటించడం దారుణం,అంతే కాదు వివిధ పార్టీల్లో పదవులు పొందిన ఎస్.సి లేదా .ఎస్టి. ఇంకా బిసి ల్లో చూసినట్లయితే ఎక్కడో చుట్టరికం కనబడుతూనే ఉంటుంది.దీనికి ఉదాహరణ చెప్పాలంటే కోకొల్లలు.

17, నవంబర్ 2017, శుక్రవారం

"ప్రభాస్" కి నంది రాకపోవడం తో తెలుగు వారి పరువు జాతీయ స్థాయి లో పోయింది.



ఇటీవల ప్రకటించిన నంది అవార్డ్ లు తెలుగు చిత్ర సీమ నే కాదు..సగటు తెలుగు వాడి కళాభిరుచిని అవమానించడమే అంటే అతిశయోక్తి కాదు.అసలు బాహుబలి జాతీయ స్థాయి లో అంత ఆదరణకి నోచుకోవడానికి ప్రధాన కారణం ప్రభాస్ యొక్క మంచి రూపం ఇంకా నటన కూడా..! కాని అతనికి తప్ప మిగతా పది పైగా శాఖలకి నందులు ఇవ్వడం ఘోరమైన జడ్జ్ మెంట్.దీనివల్ల అర్ధం అయింది ఏమిటంటే ఇండియా మొత్తం ని అలరించినా తెలుగు నేల లో ప్రశంస పొందడం కష్టం.కారణం ఇక్కడ గూడు కట్టుకున్న దుర్మార్గమైన కుల పైత్యం ఈ రేంజి లో మరే రాష్ట్రం లోనూ ఉండదు.

ఇక లెజండ్ సినిమా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.చవక బారు మాస్ సినిమా ..దానికి ఏ మాత్రం తక్కువా కాదు ,ఎక్కువా కాదు.కాని ఆ హీరో అత్యుత్తమ నటన ఏ కోణం లో నుంచి చూశారో ఆ గొప్ప న్యాయ నిర్ణేతలు. ప్రతి భావాన్ని అదరగొట్టే తరహా లోనే తప్ప మరో విధంగా చెప్పలేని నటులు గొప్ప నటులు గా చలామణీ కావడం అదీ కులం మీద వంశం మీద రాజకీయం మీద కళ ల్ని హైజాక్ చేయడం ఇక్కడ చెల్ల వచ్చ్నేమో గాని దేశం లోని మిగతా ప్రాంతాల వారు నవ్వుకుంటుంటారు తెలుగుల వెర్రి కళా పోషణలకి.

1, నవంబర్ 2017, బుధవారం

రేవంత్ రెడ్డి కి అంత సీను ఉందా..?

రేవంత్ కాంగ్రెస్ లో చేరుతుండటం పెద్ద విషయం గా ప్రచారం చేయడం వింత గా ఉంది.ఇన్నాళ్ళు తెలెంగాణా లో దేశం కి పెద్ద దిక్కు గా ఉండడం వల్ల మీడియా ప్రచారం వచ్చింది.నోరు బెట్టుకొని అడ్డం గా అవాకులు చవాకులు వాగడం మినహా చేసిన గొప్ప పనులు ఏమున్నాయి.ఇకపోతే కాంగ్రెస్ లో బహుబలులు ఎక్కువ,ఎవరి కుంపటి వారిదే,ఎవరి పెద్దరికం వారిదే.ఇప్పటికీ టి ఆర్ ఎస్ కి  జనాల్లో బాగానే పట్టు ఉంది.కొన్ని పొరబాట్లు చేసినా దాని ఎత్తి చూపించగల ప్రభావ వంతమైన నాయకులు కాంగ్రెస్ లో లేరు.రేవంత్ కి ఏ మాత్రం పరపతి పెరిగినా అతని పోటీదారులు సహించరు.అతని వల్ల గొప్ప ప్రయోజనం కూడా ఉంటుందని అనుకోవడం కూడా అతి ఆశే కావచ్చును.