Pages

10, సెప్టెంబర్ 2019, మంగళవారం

"సాహూ" సినిమా గురించి నాలుగు ముక్కలు...!



కొన్ని రోజుల క్రితం చూశాను.రకరకాల అభిప్రాయాలు సోషల్ మీడియా లోనూ,ఇతరత్రాను వ్యక్తమవుతుంటే ఎలా ఉందో చూద్దామని..!చాలామంది అన్నంత చెత్త గా అయితే లేదు.అలాని మరీ అంత సూపర్ అనీ చెప్పలేను.అసలు నేను ఈ మధ్య సినిమాలు చూడటం చాలా తగ్గించా.అలాంటి నా చేతనే టికెట్ కొనిపించాడంటే ఒక్కోసారి నెగిటివ్ పబ్లిసిటీ కూడా వర్కవుట్ అవుతుందనేగా అర్ధం. బాహుబలి తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా గా దీనిమీద ఎక్కువ హైప్ క్రియేట్ అయింది. భారత్ మొత్తం మార్కెట్ చేసే దశ కి తెలుగు సినిమా చేరుకోవడం నిజం గా గొప్ప విషయం.సరే వివిధ భాషల్లోకి అనువదింపబడే అనుకొండి.

హీరో గా ప్రభాస్ నూటికి నూరు పాళ్ళు సరిపోయాడు.హిందీ అమ్మాయి అయినా శ్రద్ధా కపూర్ కూడా క్యూట్ గా పాత్ర లో ఒదిగిపోయింది.ఇతర నటీ నటుల ఎంపిక అంతా ఇంకా బాగుంది. విలన్లు ఎక్కువ కనబడటం వాళ్ళు ఆ డెన్ లలో సమావేశాలు పెట్టుకోవడం,ఎత్తులు పై ఎత్తులు,ఫైటింగ్ లు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అన్నది కలగా పులగమై కొంత సందిగ్ధం నెలకొనే మాట నిజమే.కాదనలేము.అయితే దర్శకుడు మరియు కధకుడు అయిన సుజిత్ తెలుగు వారి మేధస్సు ని కొద్ది గా ఎక్కువ అంచనా వేసుకున్నాడు. మన వాళ్ళకి ఏమిటంటే చందమామ కధ లా పూస గుచ్చినట్లు చెప్పాలి. సామాన్య ఆడియన్స్ అలా ఉండనివ్వండి..వెబ్ సైట్ లలో రాసే ప్రొఫెషనల్ క్రిటిక్స్ కూడా ఆంతే ఉన్నారు.అది అసలు విషాదం.

ఇంటిలిజెన్స్ ని,చమక్కు ని,ఒక కన్నింగ్ తో కధ ని నడిపే విధానం ని మనం హాలివుడ్ సినిమా ల్లో చూస్తూ ఉంటాము.అక్కడ అయితే అప్రిషియేట్ చేస్తాము గాని అదే మన దగ్గర కి వచ్చేసరికి ఆమోదించలేము ఒక వెరైటీ కోసమైనా సరే..! సరిగ్గ ఇక్కడే మిగతా తెలుగేతర ప్రాంతాల్లో ఈ సినిమా కి ప్లస్ అవుతుంది. ఏ వెబ్ సైట్ లో చూసినా చాలామంది ప్రభాస్ ని అండర్ కవర్ పోలీస్ గా వర్ణించారు.నిజానికి తను అంతకంటే పైది.అంటే అండర్ కవర్ గా నియమించబడ్డ అధికారి స్థానం లో వచ్చి ఆ అధికారి ని విలన్ గా క్రియేట్ చేయడానికి ప్రయత్నించి సఫలమైన పాత్ర.చాలా సినిమా నడిచేదాకా అది అర్ధం కాదు.ఇటువంటి టూ మచ్ ఇంటెలిజెంట్ డ్రామా అనేది ఇంగ్లీష్ సినిమాల్లో సర్వ సహజం.మన ప్రేక్షకులు కొద్దిగా అలవాటు పడవలసి ఉంది.

ఇంగ్లీష్ సినిమాల నుంచి మాఫియా డాన్ ల కధల్ని మనవాళ్ళు బాగానే ఎత్తివేస్తుంటారు గాని కొన్ని మౌలిక అంశాల్ని విస్మరిస్తుంటారు. గాడ్ ఫాదర్ నవల ఆధారం గా వచ్చిన సినిమాల నుంచే ఈ తరహా సినిమా నిర్మాణాలు పెరిగాయి.దానినుంచి ఎన్ని సినిమాలు అయినా వండవచ్చు.దానిలోని ముడిసరుకు అలాంటిది. వ్యక్తిగత రాగద్వేషాల తో సమిష్టి ప్రయోజనాలకి చేటు తేవడం అనేదాన్ని మాఫియా ఎథిక్స్ అంగీకరించదు. మీటింగ్ లో తనని చూసి  చిన్నబుచేట్లు నవ్వాడని ఒక డాన్ తండ్రిని హింసించడం కుర్రచేస్టలు. భౌతిక ప్రపంచానికి సంబందించిన చాలా విషయాల్లో మాఫియా పరిణితి తో వ్యవహరిస్తుంది.అపరిమితమైన అధికారం కలిగిఉన్నప్పుడు దాన్ని ఆచి తూచి వినియోగించాలి అనేది అండర్ గ్రౌండ్ నీతి.ఇలాంటివి అన్నీ తమ ఉనికిని బయట పడనీయకుండా చేయడానికే.

గాడ్ ఫాదర్ యొక్క విషయమే చూడండి...ఎక్కడా తను పబ్లిసిటీ కోసం ప్రయత్నించడు,కాని పనులు అన్నిటినీ ఏ ఏ తీగలని ఎక్కడ మీటి ఎలా నడిపించాలి అనేదాన్ని చాలా పరిణితి తో చేస్తుంటాడు.దానిలో పరస్పరం సహకరించుకునే విధానానికి పెద్ద పీట ఉంటుంది.అరుపులు పెడబొబ్బలు లేకుండా ప్రణాళికలు సాగిపోతుంటాయి.తేడా లు వచ్చినపుడు  చావులు కూడా నిశ్శబ్దం గా నే జరిగిపోతుంటాయి. అసలు మాఫియా అంటే ఏమిటి..? ఒక వ్యవస్తీకృతమైన నేర వ్యవస్థ. సిసిలీ సమాజం నుంచి వచ్చిన పదం. ప్రస్తుతం ప్రపంచం అంతా ఒక మాఫియా వ్యవస్థ లో భాగంగా నే జరిగిపోతోంది.కాని అది బ్రహ్మపదార్థం లా  ఎక్కడా అది మన కళ్ళ కి కనపడదు. ఎవరి పాత్రలు వారు పోషిస్తుంటారు,కొన్ని తెలిసి కొన్ని తెలియక.తెలిసినా దాని జోలికి పోనంత కాలం మన జోలికి అదీ రాదు.కొన్ని అలా వదిలేసి చూస్తూండటమే మంచిది.

సరే...సినిమా కి వద్దాము. సంగీతం మంచి మూడ్ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా లెవెల్ ని మరో స్థాయికి తీసుకు వెళ్ళింది సుజిత్ ఆలోచన.అయితే పోలీస్ గా ఉన్న సమయం లో ప్రభాస్ పాత్ర మరో పోలీస్ అధికారిణి తో మరీ అంత లూజ్ గా మాట్లాడటం అసంబద్ధం గా ఉంది.వినోద భరితం గా ఉండటానికి వేరే విధంగా కూడా ప్లాన్ చేసి ఉండవచ్చు ఆయా సన్నివేశాల్ని..! కెమెరా పనితనం మరింత అందం తెచ్చింది.ఆ..ఇంకొకటి చుంకీ పాండే కి కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చింది దేవ రాజ్ పాత్ర ద్వారా..!
 



           

21, జులై 2019, ఆదివారం

"మిస్టర్ కెకె" సినిమా పై నా రివ్యూ



విక్రం సినిమా అనగానే వెరైటీ కధ,దాన్ని అన్నిరకాల మషాళా లతో వండుతారని సాధారణ ప్రేక్షకుడు వెళతాడు. ఏ మాటకి ఆ మాట తమిళ దర్శకులు కాస్త విన్నూత్న ఐడియాలతో ముందుకు పోతారని భావిస్తుంటాం.విదేశీ సినిమాల్ని కాపీ కొట్టినా ఆ వాసన పెద్ద గా తగలకుండా దేశీ తమిళ్ దనాన్ని చొప్పించడం లో వాళ్ళు సిద్ధహస్తులు. అయితే ఈసారి మటుకు విక్రం తో ఒక రకమైన సినిమా తీశారు.ఇంగ్లీష్ సినిమా లా ఉంది గాని దేశీ సినిమా.కధా విధానం లోనే తెలిసి పోతూ ఉంటుంది.పాయింట్ బ్లాంక్ అనే ఓ విదేశీ సినిమా కి దగ్గర గా ఉందని.

విక్రం గడ్డం,టాటూ లు,సిగార్ స్మోకింగ్ లూ గట్రా గమ్మత్తు గానే ఉన్నాయిలే గాని.అసలు సరుకు లో ఉండాలి గా క్వాలిటి.మలేషియా లో జరిగే కధ ఇది.డబుల్ ఏజెంట్ గా పనిచేసే ఓ వ్యక్తి కధ.దీనికి తోడు ఓ ఉప కధ అక్షర హాసన్,అభి హాసన్ లతో..! దానిలోనూ క్లారిటీ లేదు.చివరి లో వచ్చే వయలెన్స్ సీన్లు చికాకు తెప్పిస్తాయి.మలేషియా పోలీస్ స్టేషన్ లోకి పోయి అంత కధ ని నడపవచ్చా ,అదీ పోలీస్ లు వెదికే మనిషి.ఎందుకో చాలా సీన్లు వాస్తవానికి దూరం గా ఉన్నాయి.

జిబ్రాన్ మ్యూజిక్ ఫర్లేదు.ఫోటోగ్రఫీ ఓకె. ఒకసారి చూసి ఆనందించవచ్చు.లేదా చూడకపోయినా పెద్ద విచారించాల్సిన పని లేదు.

7, జూన్ 2019, శుక్రవారం

పవన్ కళ్యాణ్ ఓటమికి కారణాలు ఏమిటి..?


పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవటం..అదీ ఆ రెండు చోట్ల కూడా కాపు సామాజిక వర్గం గణనీయం గా ఉన్నా ఓటమి చవి చూడటం పవన్ కళ్యాణ్ ని సొంత సామాజిక వర్గం కూడా తిరస్కరించినట్లు గానే భావించాలి. కేవలం బాబు వ్యూహం లో ఓ పావు గా మాత్రమే తను ఉపయోగపడుతున్నాడని గమనించినందునే అలా జరిగింది. ఇవాళా రేపు ప్రతి ఓటరు ఆలోచిస్తున్నాడు.నేతలు ఏమి చేస్తున్నారు.ఎలా దండుకుంటున్నారు.అంతా ఆలోచిస్తున్నారు.డబ్బులు తీసుకున్నా ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే వేస్తున్నారు.సినిమా నటులని దైవాంశ సంభూతులు గా చూసే కాలం పోయింది.వారి డవిలాగులు,హావ భావ విన్యాసాలు చూసి పొంగిపోయి ఓట్లు వేసే రోజులు పోయినాయి.ఎన్నికల సమయం లో హడావుడి చేసి పబ్బం గడుపుకుందామంటే కుదరని రోజులు ఇవి.

కొన్ని ఏళ్ళ పాటు ప్రజా క్షేత్రం లో ఉంటూ పాటుపడుతుంటూనే పదవులు వస్తాయి. కొన్ని సార్లు దశాబ్దాలు ఎదురు చూడాల్సిన పరిస్థితి.ఇమ్రాన్ ఖాన్ లాంటి ప్రపంచ స్థాయి క్రికెట్ గ్లామర్ ఉన్న వాడే ఎన్ని ఏళ్ళు వెయిట్ చేస్తే ఆ పదవి లోకి వచ్చాడు..? ఇంకొకరి కింద తాబేదారు గా ఉంటూ రాజకీయ వ్యూహాలకి ఉపయోగపడినందు వల్ల పవన్ కి తాత్కాలిక లాభం ఉండవచ్చునేమో గాని తన సొంత సామాజిక వర్గం లో నే తను విశ్వసనీయత కోల్పోయాడు.బహుశా అది కూడా కొంత మంది వ్యూహాల్లో ఓ భాగమేనేమో..!




23, మే 2019, గురువారం

తెలంగాణా లో బి.జె.పి. నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడం దేనికి సూచన..?

తెలంగాణా లో బి.జె.పి. నాలుగు లోక్ సభ స్థానాలు గెలుచుకోవడం దేనికి సూచన..? నిస్సందేహం గా కాంగ్రెస్ మిగిల్చిన ఓ ఖాళీ ని కొత్త గా బి.జె.పి పూరించే దిశ గా కదులుతున్నట్లు చెప్పుకోవాలి.ఆంద్ర ప్రాంతం తో పోలిస్తే తెలంగాణా లో బి.జె.పి కి ఎదగడానికి ఎక్కువ అవకాశం ఉంది.ఎక్కడైతే ముస్లిం వాతావరణం ఉంటుందో అక్కడ రకరకాల జిమ్మిక్కులు తో బి.జె.పి.కూడా దానికి అంటూ ఒక స్థానం ని ఏర్పరుచుకుంటుంది.హిందువులా..బొందువులా ..అంటూ ముఖ్యమంత్రి వదిలిన డైలాగులు బయటకి దీనిదేముంది లే అనుకోవచ్చు గాని మెజారిటీ మతస్తుల్లో ..వారి సబ్ కాన్షస్ లో వ్యతిరేక ప్రభవం చూపింది.పైగా రజాకార్ల టైం నాటి దౌర్జన్యాలు తెలంగాణా ప్రజల్లో పూర్తిగా చెరిగిపోయాయి అనుకుంటే పొరబాటు. అలాంటి వాటిని ఎలా క్యాష్ చేసుకోవాలో బి.జె.పి కి.వెన్న తో పెట్టిన విద్య.

ప్రజాస్వామ్య శక్తులు అనే పేరిట కమ్యూనిష్టులు గాని మిగతా అభ్యుదయ వాదులు గాని హిందూ తీవ్ర వాదం గురించి మాటాడినట్లు ఇస్లాం తీవ్రవాదం గురించి మాట్లాడరు.పైగా డొంక తిరుగుడు సమాధానాలతో సమర్దించే విధంగా మాటాడుతారు.ఇలాంటివి తటస్థం గా ఉన్న వోటర్లను బి.జె.పి. వేపు గా మళ్ళిస్తాయి.చూడబోతే బి.జె.పి కాలూనడానికి టి.ఆర్.ఎస్. కూడా పరోక్షం గా సహకరిస్తున్నదా అనే అనుమానం కలగక మానదు.ప్రస్తుత సరళిని చూస్తే అలా అనిపించక మానదు.అయితే ప్రజాస్వామ్య వ్యవస్థ లో ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటారు.తమ ప్రయోజనాల కోసం.ఏ పార్టీ ని అనడానికి లేదు.ఎవరు ఎందుకు ఎప్పుడు ఎవరితో కలుస్తారో చెప్పలేని స్థితి. 


     

22, ఏప్రిల్ 2019, సోమవారం

ఇంటర్మీడియట్ ఫలితాలు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఘోర వైఫల్యమా..?


ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫలితాల్లో బయటబడిన తీవ్ర తప్పిదాలు ఇంతవరకు ఇంటర్ బోర్డ్ చరిత్ర లో ఎప్పుడూ జరగలేదు.హాజరయి పరీక్ష రాసిన పిల్లలు అబ్సెంట్ గా అయినట్లు రావడం,ముందు సున్న వచ్చిన విధ్యార్తి రీ వేల్యూషన్ పెట్టించుకుంటే 99 మార్కులు రావడం ఇంకా సబ్జెక్ట్ ల లో నూ,మార్కుల లోను అవక తవకలు గా మార్కుల మెమోల్లో రావడం ఇది అంతా గతం లో చాలా చాలా కొద్ది సంఘటనలు గా జరిగేవి.అయితే ఈసారి మాత్రం పెద్ద ఎత్తున పొరపాట్లు జరగడం మాత్రం చాలా ప్రస్ఫుటం గా కనిపిస్తోంది.  అనేకమంది పిల్లలు ఆత్మహత్య లు చేసుకోవడం హృదయవిదారం గా ఉంది.

ఎందుకని ఈ సారి ఇంత ఘోరమైన పరిస్థితి నెలకొంది..? విద్యా శాఖ యొక్క ఘోర వైఫల్యం అని ఎవరైనా చెప్పగలరు.ఇకనైనా వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి.ఎంతో జాగరూకతో కొత్త రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న తెరాస ప్రభుత్వం  మేల్కొని ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి.ప్రజల్లో నమ్మకం కల్పించాలి.మితిమీరిన ఆత్మవిశ్వాసం తోనే వైఎసార్ ,ఎన్ టీఆర్ లాంటి జనాకర్షణ కలిగిన నాయకులు సైతం దెబ్బతిన్నారు.వాటినుంచి ప్రస్తుత నేతలు గుణపాఠం నేర్చుకోవాలి. 

31, మార్చి 2019, ఆదివారం

కాపుల ది ఇక ఎప్పుడు బృహన్నల పాత్ర యేనా...?


ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తున్నది.పవన్ కళ్యాణ్ పోషిస్తున్న నిజ జీవిత పాత్ర చూస్తే ఎవరికైనా అలాగే అనిపించకమానదు.బాబు కి పడే వ్యతిరేకవోటు జగన్ వైపు పడకుండా చీలిపోయి పవన్ పార్టీ వైపు పడటానికి చేసిన ఏర్పాటే జన సేన అనేది జగమెరిగిన సత్యం.ప్రస్తుతం సాగుతున్న పరిణామాలు అన్నీ వాటికి సంబందించినవే.ఆ మధ్య ముద్రగడ పద్మనాభం ని హింసించి చికాకు చేశారని ఎంత రచ్చ చేశారు.ఎన్ని రకాలు గా తనని చిత్ర హింస చేశారో కధలు గా చెప్పాడు ఆయన.కాని విచిత్రం గా  ఆయన ఇప్పుడు నోరు మెదపడం లేదు,పైగా ఆ మధ్యన తేదేపా కి అనుకూలం గా కామెంట్ చేశాడు ముద్రగడ.దీన్నిబట్టి తెలిసేది ఏమిటంటే చాలా బలమైన ప్యాకేజీ ని సదరు ముఖ్య నాయకులకి బాబు వేశాడు అని..!

కాబట్టి కుల నాయకులు తమ ఇమేజ్ ని ఎంత తెలివి గా క్యాష్ చేసుకుంటారనేది దీన్ని బట్టి తెలుస్తున్నది.ఎటు తిరిగి బకరాలు అయ్యేది సామాన్య జనాలే.చిరంజీవి అండ్ కో కాపు కులానికి ప్రతినిధులు ఎంత మాత్రం కాదు.ఇది కాపు కులస్తులు ఎంత తొందరగా తెలుసుకుంటే అంతమంచిది.పవర్ బ్రోకర్లు మాత్రమే అది తెలుసుకుంటే మంచిది.తమ ఫేమిలీ ని తప్ప ఇతర కాపు సామాజిక వర్గానికి గాని ఇంకా ఇతర వర్గాలకి గాని చిరంజీవి అండ్ పవన్ ఫేమిలీ చేసింది శూన్యం.

బాలకృష్ణ ప్రవర్తన ఇక మారదా..?



నటుడు , ప్రస్తుతం హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణ ఇటీవల మళ్ళీ ఓ ఫోటో జర్నలిస్ట్ పై విరుచుకుపడి చంపుతా,నరుకుతా బాంబులు వేయడం తెలుసు ..ఇంకా అది ఇది తెలుసు అంటూ వీరంగం వేయడం ,మళ్ళీ ఆ తర్వాత అలాటి వార్తలు రావడం దేన్ని తెలుపుతోంది తెలుగు ప్రజల బానిస మన్స్తత్వాన్ని  తెలుపుతోంది.లేకపోతే ఇండియా అంతా ఒక దారి లో పోతుంటే ఇక్కడ ఒక దారి.పట్టపగలు అడ్డూ అదుపు లేకుండా మాటాడ్డం దాన్ని అభిమానులు భరించి వెనకేసుకు రావడం ఇంత నీచ స్థితులు ఏ రాష్ట్రం లోనూ లేవు.ఇటీవల తమిళనాడు లో రాధా రవి అనే నటుడు నయనతార ని వ్యంగం గా మాటాడితే అక్కడి తారలు,నిర్మాతలు నోరు విప్పి ఖండించారు.ఇతర రంగాల నుంచి రాజకీయ ప్రపంపనలు కూడా కలిగి అతడిని డిఎం.కె పార్టీ నుంచి సైతం డిస్మిస్ చేశారు.

కాని మన దగ్గరా..నేను కడుపు అయినా చేయాలి,లేదా ముద్దు అయినా పెట్టాలి అంటు  ఒక స్టేజ్ మీద అంటే ఖండించిన పాపాన పోలేదు ఏ రాజకీయ పార్టీ.ఇలాంటి వారిని మొస్తూ పోటీ కి కూడా నిలబెడుతున్న పార్టీలు సిగ్గుపడాలి.అసలు ఈ స్థితి రావడానికి ప్రధాన కారణం ప్రధాన దిన పత్రికలు.కుల పక్షపాతం తో కునారిల్లుతూ  తెలుగు ప్రజల విలువలను,సంస్కృతిని అంతర్జాతీయ స్థాయి లో వలువలు ఊడదీస్తున్నాయి.ప్రతి అడ్డమైన వాటి మీద డిబేట్ లు పెట్టే చానళ్ళ కి గాని ,స్త్రీ సంఘాలకి గాని ఇలాంటి విష్యాలు కనిపించకపోవడం దారుణం.చరిత్ర లో హీన సంస్కృతికి సాక్ష్యాలు గా ఇలాంటి విషయాలు నిలబడిపోతాయి.