Pages

13, సెప్టెంబర్ 2022, మంగళవారం

కోబ్రా సినిమా పై నా అభిప్రాయం

 


కొన్ని రోజుల క్రితం కోబ్రా సినిమా చూశాను. కేవలం విక్రం ఉన్నాడని తప్పా మరో ఆలోచన లేదు. ఆ దర్శకుడు గాని,సాంకేతిక నిపుణులు గాని ఎవరూ పెద్దగా తెలియదు. కేజిఎఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి కొద్దిగా ఈమధ్య పేరు వచ్చింది గదా.సర్లే చూద్దాం అనుకున్నా.అదీ విషయం.విక్రం సినిమాలు వెరైటీ గా ఉంటాయని వెళ్ళాను.సినిమా పరం గా ఆడకపోయినా ఆ కథనం,అతని నటన బాగుంటాయి.అయితే ఈ కోబ్రా సినిమా మాత్రం నా సహనాన్ని పరీక్షించింది.

విక్రం నటుడు గా ఎప్పుడూ ఫెయిల్ అవ్వడు.అది ఈ సినిమా లో కూడా కనిపించింది.పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని నటించాడు.నిజానికి సినిమా మొదటి భాగం చూసిన తర్వాత అద్భుతం గా అనిపించింది. అదేమిటో రెండో సగం నుంచి మాత్రం మన సహనాన్ని టెస్ట్ చేస్తుంది.అసలు దానివల్ల మొదటి భాగం కూడా తేలిపోయింది.అర్ధం పర్ధం లేని సన్నివేశాలు,ఒకదానికి ఇంకోదానికి పొసగని అతి తెలివి కథ ప్రేక్షకుడిని తికమక చేస్తాయి. 

 సెయింట్ పీటర్స్ బర్గ్ లో రష్యన్ మినిస్టర్ ని హత్య చేయుట,అక్కడి మారువేషం,ఆ నగర సన్నివేశాలు భలే అనిపించాయి.కాని అంతలోనే ఏదో గణిత మేధావి అట.ఆయనకి చంపే తెలివితేటలు చానా బాగా ఉన్నాయట...ఇలాంటి లాజిక్ లు చికాకు పుట్టిస్తాయి.హత్య చేసేవాడికి కావాలసింది క్రిమినల్ బ్రెయిన్.అంతే.చాలామంది హత్యా నిపుణుల హిస్టరీ పరిశీలిస్తే పెద్దగా లెక్కల బ్రెయిన్ ఏమీ కాదు.ఎందుకో నాకయితే కనివిన్సింగ్ గా అనిపించలేదు.

హీరోయిన్ శ్రీనిధి శెట్టి కి పెద్ద ప్రాధాన్యత లేదు.ఉన్నంతలో చేసిందామె.ఇంటర్ పోల్ అదికారిగా గా వేసింది క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ట. బహుశా పాన్ ఇండియా ప్రణాళిక లో భాగం కావచ్చు.అతను ఒకే అనిపించాడు. రెహమాన్ సంగీతం ఫర్వాలేదు. పాటలు ఏవీ బయటకి వచ్చిన తర్వాత గుర్తు ఉండవు. జనాన్ని కన్ ఫ్యూజ్ చేసే స్క్రిప్ట్ ని తెరకెక్కిస్తే ఎంత గొప్ప నటుడికీ ఠికాణా ఉండదని ఈ సినిమా నిరూపించింది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు కి ఈ సినిమా తో జ్ఞానోదయం అవుతుందని ఆశిద్దాం.        


7, ఆగస్టు 2022, ఆదివారం

ఇంగ్లీష్ డైలీ లు ఆన్ లైన్ చందాలు పెట్టడం ఎవరికి నష్టమట..?

 ఆన్ లైన్ లో ఇంగ్లీష్ పేపర్లు చదువుదామని అనుకుని తెరుద్దామనుకుంటే కొత్త సమస్య ఎదురవుతోంది. తెలంగాణా టుడే,హేన్స్ ఇండియా,డెక్కన్ క్రానికల్ అన్నీ ఇదివరలో చటుక్కున తెరిచి చదివేవాళ్ళం.కాని ఈమధ్యన వాళ్ళు కూడా ఉచితం గా లేదురా అబ్బాయ్...చందా కట్టి చదువు అని ఆ వెబ్ సైట్ లలో నోట్ పెడుతున్నారు. ఎన్ని డైలీ లని చందాలు కడతాం అదీ ఓ సమస్యే. అసలే మన తెలుగు వాళ్ళు... ఇంగ్లీష్ పేపర్లు చదివే వారు తక్కువ ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే.

అయితే ఇతర రాష్ట్రాలనుంచి కొన్ని ఇంగ్లీష్ డైలీలు ఎలాంటి ఆన్ లైన్ చందా లేకుండా పాఠకులకి అందుబాటు లో ఉన్నాయి.ఇండియన్ ఎక్స్ ప్రెస్,హిందూ,టైంస్ ఆఫ్ ఇండియా లాంటి జాతీయ ఆంగ్ల పత్రికలు ఆన్లైన్ చందా పెట్టాయని మన వాళ్ళూ పెట్టినట్లున్నారు.నాకు తెలిసి ఆన్ లైన్ చందాలు కట్టేవాళ్ళు బహు తక్కువ. ఎందుకంటే ప్రత్యామ్నాయ సాధానాలు ఇంకా ఉన్నాయి కనక వాటితో అడ్జస్ట్ అయిపోతుంటారు.

కొమ్ములు తిరిగిన దిగ్గజం లాంటి వాళ్ళే ఎస్స్మెస్ లు పంపిస్తున్నారు.మా డైలీ కి చందా (ఆన్ లైన్) కట్టమని.నాకు తెలిసి మా దోస్తుల్లో గానీ నేను గానీ వాటిని ఖాతరు చేస్తే ఒట్టు.కాలం గడిచిపోతోంది,వాటిని ఆన్ లైన్ లో చదవకపోయినా గొప్ప లోటుగా ఏమీ అనిపించడం లేదు.అటు చత్తిస్ ఘడ్ నుంచి,ఒరిస్సా నుంచి,ఈశాన్య రాష్ట్రాల నుంచి,ఇంకా ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే కొన్ని ఇంగ్లీష్ వెబ్ సైట్ లు అవీ చదువుతుంటే ఇండియా మొత్తం మన ముందు ఉన్నట్లు అనిపిస్తోంది.    

18, జనవరి 2022, మంగళవారం

అమెరికా ని తిడుతూ మళ్ళీ అక్కడికే ఎందుకు పంపుతుంటారో..?

  ఎ.బి.కె.ప్రసాద్ గారి వ్యాసాలు కొన్నిసార్లు పత్రికల్లో ముఖ్యం గా సాక్షి డైలీ లో  చదువుతుంటాను. ఆయన రాసే వాటిలో విషయసేకరణ బాగానే చేసినట్లు కనబడుతుంది గానీ ఒకటి మాత్రం అర్ధం కాదు.అమెరికా ని,ఆ దేశపు పెట్టుబడి దారీ విధానాల్ని,అక్కడి సంస్కృతి ని బాగా తిడుతుంటారు.ఈసడిస్తుంటారు.సరే అంతదాకా బాగానే ఉంది,అది ఆయన ఇష్టం అనుకుందాం.మరి అటువంటి ఆయన అమెరికా కి ఆయన సంతానాన్ని ఎందుకు పంపించినట్టు..?


ఆమధ్య ఎప్పుడో పత్రికల్లో చదివాను,ఆయన మనవడి నే అనుకుంటా అమెరికా లో అక్కడి నల్లజాతీయులు కాల్చిచంపినట్టు చదివాను.వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే ఉన్నారనుకుంటాను.అదలా ఉండగా అమెరికా ని విపరీతం గా తిట్టే మరి కొంతమంది ప్రముఖ రచయితల పిల్లలు కూడా అక్కడే ఉన్నట్లు పత్రికల ద్వారా తెలుస్తోంది.గద్దర్ సంతానం గాని,అలాగే సిపీఅయ్ నారాయణ గారి సంతానం కూడా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది.వీళ్ళనే కాదు ఈ లిస్ట్ ఇంకా చాలా పెద్ద గా ఉంది.


అమెరికా మీద ద్వేషం పుట్టించడం లో ముందంజ లో ఉంటూ అనేకమందిని బయట వారిని ప్రభావితం చేస్తున్న వీరు తమ ఇళ్ళ లో వారిని ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నారు.వీరి రాతల్ని చదివినా ,విన్నా మనకి అమెరికా అంటే వళ్ళు మండి పోతుంది ఇంత దోపిడీ చేస్తోందా ఆ దేశం అని..?మరి ఆ ఇంట్లో వారికి అలా ఏమీ అనిపించదా లేదా ఆ కబుర్లు అన్నీ జనాలకే తప్పా మనకి వర్తించవు అని లోపాయికారి గా చెప్పుకుంటారా..?అదొక గొప్ప అనుమానం నాకు..!   

3, అక్టోబర్ 2021, ఆదివారం

సమంతా-నాగ్ చైతన్య విడాకుల్లో ఇదో కోణం

 సమంత,నాగ్ చైతన్య విడాకుల వార్త ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓ పెద్ద విశేషం. దానిమీద వివిధ మాధ్యమాల్లో ఎన్ని విశ్లేషణలు ...ఏమి కథ..! అది వాళ్ళ పర్సనల్ విషయం అనే వారు కొందరు.అంటూనే ఏ సోషల్ మీడియా లో ఎవరు ఏం వ్యాఖ్యానించారు అంటూ వెతికేవారు ఇంకొందరు. వాళ్ళు సినిమా రంగం లో ఉన్నారు కనుక జనాల్లో ఆసక్తి కలగడం సహజం.

ఇంతా చేసీ ఈ సంఘటన వాళ్ళ జీవితాల్లో ఏదో పెనుమార్పులకి దారి తీస్తుందని అనుకోవడం భ్రమ. సమంతా మోడలింగ్ ద్వారా,నటన ద్వారా ఎన్నో కోట్లు గడించి ఉంటుంది.వాటిని ఎన్నో లాభసాటి వెంచర్లలో మదుపు చేసే ఉంటుంది. ఈ నాటి యువ నటీమణుల తీరు వేరు. తెలివితేటలు వేరు. వీళ్ళు పాతకాలం నాటి సెంటిమెంట్ లు ఉన్న నటీమణులు కారు. అది తప్పు కాదు. ఎవరి నిర్ణయం వారిది కాలాన్ని బట్టి. 

ఇకపోతే నాగ్ చైతన్య ...విషయం అందరికీ తెలిసిందే.తనకీ డబ్బుకి కొదవలేదు. డబ్బుతో ఏం ఉంది అంటాం కాని ప్రస్తుతం అంతా డబ్బు తోనే లెక్క. సినిమా మనుషులు కనుక కొన్ని సినిమాటిక్ ట్వీట్స్ చేసి ఉండవచ్చు. ఈ ఉదంతాన్ని మనసుల్లో పెట్టుకొని యేళ్ళకి యేళ్ళు ఇద్దరూ కుమిలిపోతారని,బాధపడతారని ,కుటుంబ వ్యవస్థ ని దెబ్బ తీశారని కొంతమంది అభిమానులు మరీ రెట్టించిన సినిమాటిక్ ధోరణి లో కామెంట్లు యూట్యూబ్ వీడియోల్లో పెట్టడం చూస్తుంటే ఎంత అజ్ఞానం లో ఉన్నార్రా ఈ వెర్రి అభిమానులు అనిపిస్తుంది.   

నాకు ఈ ఉదంతం లో ఓ సైకాలాజికల్ కోణం కనిపిస్తోంది. అది ఎంతమంది ఒప్పుకుంటారో తెలియదు కానీ చెప్పి చూద్దాం. పేరైతే గుర్తు రావడం లేదు. ఒక బుక్ లో చదివిన గుర్తు లీలగా. చిన్నప్పుడు తల్లిదండ్రులు విడిపోతారు. తల్లి వేరే ఓ నగరం లో జీవిస్తూంటుంది.కొడుకు తో. అతను చిన్నప్పటినుంచి తండ్రి లేని ఒక వాక్యూం ని ఫీల్ అవుతూంటాడు. అది వయసు తో బాటు పెరిగి ఓ కసి గా మారుతుంది. తను పెద్ద పెరిగిన తర్వాత తండ్రి జీవితం లో అవమానకరమైన సన్నివేశాలు సృష్టించాలని ప్రణాళికలు వేస్తూంటాడు.

దానిలో భాగం గా బయటకి కుట్ర గా కనిపించని విధానం లో ఎన్నో పనులు చేస్తుంటాడు. చివరకి రచయిత ఫ్రాయిడ్ మానసిక విశ్లేషణ లో భాగంగా అతని పాత్ర కి జస్టిఫై చేస్తాడు.ఇది ఈ ఉదంతం లో నిజం అవాలని ఏం లేదు గాని ఆ కథ గుర్తు కి వచ్చింది. ఓ నాలుగైదు నెలలు పోయిన తర్వాత అటు సాం కి, ఇటు చై కి ఎవరి తోడు వారికి దొరుకుతారు.బయటి జనాలు మరీ బాధపడితే అది వాళ్ళ తలనొప్పి తప్ప మరేం కాదు.  


  

18, ఆగస్టు 2021, బుధవారం

ఆఫ్ఘన్ పరిస్థితి ఏమిటో

 


మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లది ప్రస్తుతం పై చేయి అయ్యింది. కాబుల్ లోకి వచ్చి హల్ చల్ చేస్తూన్నారు.మరి చూద్దాం రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు ఉంటాయో...మరో వైపున ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలాహ్ చివరి దాకా పోరు కొనసాగిస్తామని,ఇప్పటికే ఓ ప్రాంతాన్ని తాలిబన్ల నుంచి మళ్ళీ వెనక్కి గెలుచుకున్నామని ప్రకటించాడు.అసలు ఆఫ్ఘన్ ఎప్పుడూ యుద్ధ క్షేత్రమే...వంక ఏదైతేనేమి..! విదేశీ పాలనని ఎంతమాత్రం సహించని స్వేచ్ఛా ప్రియులు వాళ్ళు.అయితే ఒక వంక తో రష్యన్లు కొంత కాలం,ఇంకో వంక తో అమెరికన్లు అక్కడ తిష్ట వేశారు.


బంగారం,ప్లాటినం,చమురు నిల్వలు వంటి ఖనిజసంపద కి లోటు లేదు ఆ దేశం లో. అయితే వాటిని పైకి తవ్వి వినియోగించుకుని అమ్ముకుని దేశాభివృద్దికి వాడుకునే చిత్తశుద్ధి మాత్రం అక్కడి నాయకులకి ఎంత మాత్రం లేదు.ఒకానొక సమయం లో పూర్తి ప్రజాస్వామ్య భావజాలం నిండిన ప్రభుత్వాలు విలసిల్లిన కాలం ఒకటి ఉండేది.అది గత చరిత్రయే అయింది.


ప్రస్తుతం ఇస్లామిక్ దేశం గా మారిపోయే తరుణం వచ్చింది.షరియా లా అమలు అవుతుంది అంటున్నారు.ఎప్పుడో మధ్య యుగాల్లో ఏర్పాడిన ఆ జీవిత విధానాన్ని ఇప్పుడు అమలు చేయడం ఈరోజుల్లో సాధ్యమా..? విచిత్రంగా అవిశ్వాసులు లేదా కాఫిర్లు తయారు చేసిన అధునాతన తుపాకులు,లాన్ చెర్లు, కంప్యూటర్లు చక్కగా వినియోగిస్తారు. అక్కడ ఏ మత సూత్రాలు అడ్డురావు.ఇదొక రకమైన సామ్రాజ్య వాదం మతం పేరు మీద.


భవిష్యత్ ఎలా ఉండబోతుందో చూద్దాం. 

29, జులై 2020, బుధవారం

ఇదే వేరే చోట అయితే మొహం మీద విసిరికొడతారు

తెలుగు రాష్ట్రాల్లో ఇది గమనించాను. అందరూ గమనించే ఉంటారు గాని పెద్ద విషయం గా దాన్ని పరిగణించరు.రోజూ అనుభవం లోకి వచ్చేది.కాని వెనుక ఉన్న psychological drives గురించి మాట్లేడేంత విషయమా అనుకోవచ్చు.కొన్ని చిన్న అంశాల్లోనే కొన్ని కనబడని intricacies దాగి ఉంటాయి. ఏ కిరాణా కొట్టు కి గాని,పాన్ షాప్ కి గాని,ఇంకా ఏదైనా జెనరల్ దుకాణదారుని వద్దకి గాని వెళ్ళి మనం ఓ వస్తువు ని కొని వాళ్ళకి ,వాళ్ళ చేతి కి డబ్బులు ఇస్తాం గదా.చక్కగా మననుంచి తీసుకుంటారు.అంతదాకా బాగానే ఉంటుంది.

కాని మనకి తిరిగి చిల్లర ఇచ్చేప్పుడు మాత్రం వాళ్ళు చిల్లర ని మన చేతికి ఇవ్వకుండా ఆ టేబిల్ కౌంటర్ మీద పారేస్తారు.ఏరుకో అన్నట్లు గా. చాలా మంది దాన్ని పెద్ద ఇష్యూ గా పరిగణించరు ఎందుకో. మర్యాద గా తీసుకున్నప్పుడు అంత మర్యాద గా చేతికి ఇవ్వచ్చుగా. కష్టమర్ అంటే నిర్లక్ష్యమా.నేను ఒకరిద్దరు షాప్ ల వాళ్ళని అడిగాను.ఏమిటి ఇదేనా పద్ధతి అని.మనాళ్ళ మంచితనం తో సరిపోతుంది లే గానీ,వేరే రాష్ట్రం లో అయితే అంతదాకా ఎందుకు పక్కనున్న తమిళనాడు,కేరళ ల లో అయితే మొహం మీద విసిరికొడతారు.





























































      

28, జులై 2020, మంగళవారం

ఏవిటో ఈ కాపీ కల్చర్....

ఆంధ్రా బిర్లా,ఆంధ్రా దిలీప్ కుమార్,ఆంధ్రా కిషోర్ కుమార్ ఇలాంటి ఉపమానాలు ఆంధ్రులు ఉపయోగించడం వెనుక ఉన్న కారణం ఏమిటి..అని ఈ మధ్య నాకు ఓ సందేహం వచ్చింది.పోనీ మిగతా రాష్ట్రాల్లో ఎవరైనా ఇలా తమ వారిని పిలుచుకుంటున్నారా అంటే నాకైతే ఎక్కడా తగల్లేదు. అలాగే ఈ మధ్య తూగోజి లో ఓ ఊరి కి వెళితే అక్కడ కేరళ లో ని ఆలయాల్లో వాయించే చెండా,మద్దెలం లాంటి వాటిని వాయిస్తున్నారు.మళ్ళీ ఆ గొడుగు లాంటిది ఒకటి.ఏమిటో ఈ కాపీ సంస్కృతి అనిపించింది.

సినిమా సంస్కృతి యే సకల కళల సారం,అది తప్పా మరొకటి కళ కాదు,అనే భావన కొన్ని గత దశాబ్దాలనుంచి దుర్దృష్టవశాత్తు తెలుగునేల మీద పాతుకుపోవడమే దీనికి కారణం కావచ్చు.మనవి తప్పా ఇతరులవి అన్నీ fashion ఇంకా passion. అది మన సైకాలజీ అనిపించింది.