రజనీకాంత్ లో మేజిక్ మళ్ళీ ఈ సినిమా ద్వారా బయటపడింది. ఈ మధ్య సరైన హిట్ లేక ఉన్న ఆయనకి సమయానికి ఓ హిట్ పడింది. ఇదేదో అనాలోచితం గా వచ్చింది కాదు. తన వయసు కి తగిన పాత్ర ని ఎంచుకున్నాడు. అంతే గాక భుజ బలం తో గాకుండా బుద్ధిబలం తో ఎలా ఓ సీనియర్ సిటిజన్ తనకి ఎదురైన సవాళ్ళను అధిగమించాడు అన్నది దీంట్లో ప్రధాన విషయం. అందుకే చిన్నా,పెద్దా అందరూ సినిమా కి కనెక్ట్ అయ్యారు.
సన్నివేశాల్ని తీర్చిదిద్దటం లో సహజత్వానికి దగ్గరగా ఉండటం అనేది తమిళ దర్శకుల్లోని గొప్ప ప్లస్ పాయింట్. అది ఈ సినిమా లో మరింత బాగుంది. సినిమా మొదట్లోనే రిటైర్ అయిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో బాగా చూపెట్టడం జరిగింది. మనవడి తో చిన్న చిన్న యూట్యుబ్ వీడియోలు తీసుకోవడం అనేది అందర్నీ అలరిస్తుంది.మామూలు గానే తన వయసు కి అది నప్పింది. యోగిబాబు కేరక్టర్ లాంటి వారు ఇంచు మించు ప్రతి వీథి లోనూ ఉంటారు.పైగా ఆ హాస్యం చాలా మృదువు గా గిలిగింతలు పెడుతుంది.
ఇక ప్రధాన విలన్ వినాయగం కలకాలం గుర్తుండేలా చేశాడు.చిన్నా చితకా పాత్రలు వేసే అతగాడి లో ఇంత కోణం ఉందని కనిపెట్టిన దర్శకుని అభినందించాలి.మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ ఇద్దరూ తమ ప్రత్యేక పాత్రల్లో విరగదీశారు.చప్పట్లు పడ్డాయి. ఆయా భాషల్లో కూడా వీరి ప్రభావం బాగా ఉంటుంది.సందేహం లేదు. డైలాగ్స్ బావున్నాయి. ఫైటింగ్ సన్నివేశాల్ని చాలా విన్నూత్నం గా తీశారు.కొత్తదనం అనేది సినిమా చూసే ప్రేక్షకుడు ఫీలవుతాడు. మెంటల్ హాస్పిటల్ సన్నివేశాలు సైతం కడుపుబ్బా నవ్విస్తాయి.
సినిమా కి డైలాగులు ప్రాణం పోశాయి. అదే విధం గా క్లైమాక్స్ లో వచ్చే కొడుకు ద్రోహం చేసే సీను ఎవరూ ఊహించలేరు. దానికి శిక్ష ని కూడా వెరైటీ గా తీశారు. సినిమా ఏ దశ లోనూ బోర్ కొట్టకుండా నడిపించడం ఈ సినిమా జైత్ర యాత్ర కి తోడ్పడింది.తీహార్ జైలు సన్నివేశాలు అదరహో అనిపించాయి.సంగీతం ఫర్వాలేదు. కథా, కథనం ఈ సినిమా కి నిజమైన హీరోలు.రమ్యకృష్ణ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి.ఏది ఏమైనా రజనీకాంత్ నిస్సహందేహం గా ఈసారి తెలివి గా హిట్ కొట్టాడని చెప్పాలి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ని అభినందించకుండా ఉండలేము ఇటువంటి ఎంటర్టైనర్ ఇచ్చినందుకు.
--- EM
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి