"కల్కి 2898" అనే సినిమా ని ఎట్టకేలకు నిన్న చూశాను. తర్వాత ఈ నా అభిప్రాయాన్ని రాయలేకుండా ఉండలేకపోతున్నాను. కాశీ-కాంప్లెక్స్-శంబల ...మొత్తానికి మూడు ప్రదేశాల్ని అడ్డు పెట్టి మనల్ని ఏవో లోకాలకి తీసుకుపోయారు.
ప్రతి పాత్ర అదేమిటో అప్పుడే తెలుగు నేర్చుకుని వచ్చి , వచ్చీ రాని భాషలో ఏదో మాట్లాడిపోయారు. ఆ యాస ఓరి నాయనో. ఒక్క ప్రభాస్ మాత్రం ప.గో.జీ. యాస లో యమ స్పీడు గా మాట్లాడుకుంటూ పోయాడు,కొన్ని డైలాగులు స్పీడు లో అర్థమవ్వవు.
అదంతే. ఇక గ్రాఫిక్స్ గురించి, ఇలాంటివి హాలీవుడ్ లో ఎన్ని వచ్చాయి, ఎన్ని చూశాం...కానీ ప్రపంచం లో ఇంతవరకు ఎక్కడా రానట్టు ప్రచారాలు.
అశ్వత్థామ కి సంభందించిన మహా భారతం లోని ఎపిసోడ్ ని కల్కి కి ముడిపెట్టి ,ఆపై కాంప్లెక్స్ లో జరిగే ప్రయోగాలు ఈ రెంటికీ ముడివేసి చేసిన ప్రయోగం పరమ కృతకం గానూ,ఎబ్బెట్టు గానూ తోచింది.
సినిమా లో సంగీతం గురించి చెప్పాలంటే ,అసలు ఆ పాటలు ఒక్కటీ మనకి అర్థం కావు.అది తెలుగా ,తెలుగు లాంటి మరో భాషా అనిపిస్తుంది.
పెద్ద తారల్ని ఖర్చు కి వెరవకుండా పెట్టారు బానే ఉంది గాని అసలైన ఆత్మ అది మాత్రం ఘోరంగా మిస్ అయింది.సినిమా మొత్తం అంతు పొంతూ లేని కలగా పులగం లా ఉంది.
మిలటరీ ట్రక్కుల్లాంటి టక్కు టమార వాహనాలు వాటి మధ్య జరిగే పోరాటాలు చందమామ కథ ల్ని తలపింపజేస్తాయి. ఆసక్తి కరం గా ఏ మాత్రం లేకుండా గ్రాఫిక్స్ ని, పెద్ద తారల్ని నమ్ముకుని సినిమా తీశారు.
ఆ రెండూ ఏ మాత్రం రంజింప జేయవు సరికదా పరమ బోర్ పుట్టిస్తాయి.ఎంతో హైప్ క్రియేట్ చేసిన మూవీ ప్రేక్షకుడిని సంతృప్తి పరచలేకపోయింది.బాహుబలి తో పోల్చడం అవివేకం.
దీపికా పడుకునే ఇంకా కాంప్లెక్స్ దృశ్యాలు వెగటు పుట్టిస్తాయి. అసలు సినిమా కథ నే తలా తోక లేని యవ్వారం లా అనిపిస్తే అది చూసేవాళ్ళ తప్పు కాదు.