Pages

20, మార్చి 2015, శుక్రవారం

అసెంబ్లీ నా చేపల మార్కెట్టా ..అంతకన్నా దరిద్రంగా ఉంది..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో గత కొన్ని రోజులు గా జరుగుతున్న పరిణామాలు,బూతు పురాణాలు ఇంకా నెట్టుకోవడాలు,గొడవలు చూస్తూ ఉంటే అసలు వీళ్ళు అసెంబ్లీ కి వచ్చేది ప్రజా సమస్యలు చర్చించడానికా లేక పోతే తమ తడాఖాలు చూపించడానికా అని అనుమానం వస్తోంది.వ్యక్తి గత మైన తిట్లతో,ఈగో లతో చెలరేగిపోతూ డాన్సులు వేసి ఎవరిని ఉద్ధరించాలని..? అసలు అసెంబ్లీ అంటే వీళ్ళంతా ఏమనుకుంటున్నారు..?దీంట్లో ఒకరు తక్కువ కాదు ఒకరు ఎక్కువ కాదు..వై సి పి కాంగ్రెస్,తెలుగుదేశం దొందూ దొందే లా వ్యవహరిస్తున్నాయి.అసలు ప్రజాస్వామ్యం అనే కాన్సెప్టే మన దేశానికి కుదరదనుకుంటా..కుల ఎజెండాలతో కునారిల్లుపోతూ దానికోసం అడ్డమైన దారుల్లో రాజకీయాలు చేసుకుంటూ కోట్లాది రూపాయాల ధనాన్ని వెనకేసుకుంటూ దేశ విదేశాల్లో బినామి పేర్లతో వ్యాపారాలు సాగించే గొప్ప త్యాగధనులు మన నేటి నేతలు.

ఇలాంటి వారినుంచి ప్రజాస్వామ్యాన్ని దాని స్పూర్తిని ఆశించడమే తెలివితక్కువతనం.చివరకి బలిపశువులు గా మిగిలేది సామాన్యుడు.మన ప్రజల్లో కూడా సరైన చైతన్యం పెరగాలి..ఎంతసేపు రాజకీయ నేతల్ని కులం ప్రాతిపదికగా గుడ్డిగా నమ్మడాన్ని మానాలి.ఒక క్లర్కు వంద రూకలు లంచం తీసుకుంటే దాన్ని ఫోకస్ చేస్తూ అవినీతి పై పోరాడాలి అంటారు.అదే ఒక రాజకీయం చేసుకుంటూ ఒక జనరేషన్ లోనే వేల లక్షల కోట్లు సంపాదించే నాయకులపై మన ప్రజ ప్రశ్నించలేదు.అసలు రాజకీయ అవినీతే అన్నిటికన్నా పెద్ద శాపం ఈ దేశానికి..మళ్ళీ వీటిని చూస్తూ మన వాడేకదా అనుకుంటూ సహించే జనాలు ఉండటం మరింత శాపం.దీర్ఘ కాలం లో దీనివల్ల ధనం సంపద కొన్ని కుటుంబాల వద్దనే విపరీతం గా పోగుపడి ప్రజాస్వామ్యం అనేదాన్ని అపహాస్యం చేస్తూ ఇదిగో మన అసెంబ్లీ లో మాదిరి గానే బాధ్యతారాహిత్యం గా ప్రవర్తిస్తుంటారు.   

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి