Pages

15, ఏప్రిల్ 2023, శనివారం

కినిగె వెబ్ సైట్ కి ఏమయ్యింది..? ఉలుకు పలుకూ లేదు ఎక్కడా..?

 "కినిగె" వెబ్ సైట్ కి ఏమయ్యింది..? తెరుచుకోవడం లేదు. అటు ఫేస్ బుక్ పేజీ లో కూడా ఎవరూ సమాధానం ఇవ్వడం లేదు. కొన్ని ఏళ్ళ పాటు బాగానే నడిపినా మరి ఈ మధ్యన ఏమయ్యిందో...కనీసం బుక్స్ ని వారికి పంపిన పబ్లిషర్స్ కైనా ఓ మెయిల్ పెడితే బాగుండేది దాని ప్రస్తుత స్థితిగతుల గురించి.చాలా మందికి డబ్బులు కూడా ఇవ్వలేదని తెలుస్తోంది ఫేస్ బుక్ లో కొంతమంది రచయితల ఆవేదన చూస్తే.

అయినా అంతా గప్ చుప్. కనీస బాధ్యత లేకపోతే ఎలాగా..?ఇంతకీ దాన్ని నడిపే బాధ్యుల పేర్లు ఎవరికైనా తెలిస్తే చేప్పండి. ఆ మహానుభావుల పేర్లు తెలుసుకోవాలని ఉంది.ఇకముందు కూడా ఇలాంటి వెబ్ సైట్ లు ఎవరు పెట్టినా నమ్మే స్థితి ఉండదు. పాపం పుస్తకాలు ఇచ్చిన రచయితల,పబ్లిషర్ల గతి ఏమిటో..?    

6, ఏప్రిల్ 2023, గురువారం

ఆత్మలు ఉన్నాయా ? అవి ఈ మాధ్యమం ద్వారా మాట్లాడుతాయా ?

 

నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి ఈ మధ్య వెళ్ళినపుడు ఓ విచిత్రమైన సమస్య చెప్పారు వాళ్ళు. వాళ్ళ అమ్మాయి తొమ్మిదవ తరగతి చదువుతోందట. స్కూల్ లో ఇతర ఫ్రెండ్స్ తో కలిసి ఓజో బోర్డ్ (Ouija board) ఆడిందట ఓ రోజు.ఇంటికి రాగానే విపరీతమైన భయం తో పడుకుండి పోయిందట.జ్వరం కూడా వచ్చిందట. మీరు నానా రకాల పుస్తకాలు గట్రా చదువుతుంటారు గదా.అలాంటివి ఆత్మలు రావడం బోర్డ్ గుండా సమాధానం ఇవ్వడం లాంటివి ఉంటాయా అని నన్ను అడిగారు.

ఓసారి మీ అమ్మాయిని పిలవండి అని చెప్పగా ఆ అమ్మాయి ని నా ముందుకు పంపించారు. వాళ్ళు పక్కనే కూర్చున్నారు. "అసలు ఏం జరిగింది పాపా...పూర్తి వివరాలు చెప్పు...నీకు ఎలాంటి భయం లేదు చెప్పు" అన్నాను. అప్పుడు ఆ పాపా చెప్పినదాని ప్రకారం ఏమైందంటే క్లాస్ లో ఉన్న ఇద్దరు మరో  అమ్మాయిలు ఈ ఓజా బోర్డ్ గురించి ఈ అమ్మాయికి చెప్పారు.ఆసక్తి కొద్దీ ఇద్దరు ,బోర్డ్ కి అటు ఒకరు,ఇటు ఒకరు కూర్చుని ఆత్మలతో మాట్లాడటం చేశారు.వీళ్ళు బోర్డ్ మీద ఉన్న అక్షరాల మీద చేతులు తాకిస్తూ అడుగుతుండగా ఓ ఆత్మ వచ్చిందిట,దానికి గుర్తు గా మధ్యలో వెలిగించిపెట్టిన కేండిల్ టప్పున ఆరిపోయిందట.

ఆ తర్వాత కొన్ని ప్రశ్నలకి జవాబుగా కొన్ని సమాధానాలు వచ్చాయిట. ఇదీ స్థ్హులంగా ఆ అమ్మాయి చెప్పింది. ఆ కేండిల్ ఆరిపొయింది గాలి తాకి అయ్యుంటుందిలే అన్నాను.లేదు అంకుల్ అప్పుడు గది తలుపులు వేసి ఉన్నాయి.ఏ గాలి లేదు అందామ్మాయి. అలాంటివి ఏమీ నమ్మకు ...అవి అన్నీ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన మూఢనమ్మకాలు వంటివే. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకో పాపా..ఏ దుష్ట శక్తి నీదగ్గరకి రాదు,రాలేదు సరేనా..అని చెప్పి ధైర్యం చెప్పి వచ్చేశాను.చిన్న వయసులో ఉన్న పిల్లల్ని మరీ భయపెట్టకూడదని అలా చెప్పాను.మీకు తెలిస్తే చెప్పండి ఎవరైనా ఈ ఓజా బోర్డ్ లు అవన్నీ నిజంగా అలా ఆత్మలకి  మాధ్యమం గా పనిచేస్తాయా..?    

22, మార్చి 2023, బుధవారం

మొత్తానికి మేష్టార్ని కొట్టి కక్ష తీర్చుకున్నారు

 ఈ రోజే ఓ ఇంగ్లీష్ పేపర్ కి చెందిన వెబ్ సైట్ లో చూశాను. తమిళ నాడు లోని తూత్తుకుడి జిల్లా లో ఓ టీచర్ ని పేరెంట్స్ ఉరికించి మరీ తన్నారు.అతను గగ్గోలు పెడుతూ పారిపోతున్నా ఊరుకోకుండా మరీ ఆ పేరెంట్స్ కొట్టారు.ఇంతకీ అతను చేసిన తప్పేంటయ్యా అంటే ప్రైమరీ పాఠశాల లో చదువుతున్న తమ కుర్రాణ్ణి పాఠం చదవలేదని కొట్టాడట. ఈ మధ్య ఇలాంటి గురువుల్ని తన్నే కార్యక్రమాలు అన్ని రాష్ట్రాల్లోనూ ఎక్కువ అవుతున్నాయి.

కారణం ఏమిటయ్యా అంటే ప్రభుత్వం కార్పోరల్ పనిష్మెంట్ నిషేధించింది గదా అంటున్నారు,అసలు ఈ పనికిరాని చట్టాన్ని చేయాలని ఎంతమంది పేరేంట్స్ ఈ దేశం లో ప్రభుత్వాన్ని కోరారు.ఇలాంటి చట్టం వచ్చిన తర్వాత పిల్లలకి భయం లేకుండా పోయింది.పైపెచ్చు తిరగబడుతున్నారు.ఎక్కడో కోటికి ఓ చోట జరిగే ఉదంతాల్ని చూపించి బెత్తాల్ని నిషేధించడం తో పిల్లలు పెద్ద పెరిగిన తర్వాత రేపిస్ట్ లుగా,హంతకులు గా,అసాంఘిక శక్తులు గా తయారవుతున్నారు. అప్పుడు ఆకులు పట్టుకొని ఏం లాభం..?

చచ్చిపోయేంత ఇదిగా పిల్లల్ని ఎవరు కొడుతున్నారు,గోరంత ల్ని కొండంత గా చూపించి ఇలాంటి సన్నాసి చట్టాలు తేవడం తో పిల్లలు భయానకం గా తయారవుతున్నారు.మన రాష్ట్రం లో హరిహర ,నవీన్,నిహారిక ల కథల్ని రోజూ చదువుతూనే ఉన్నాం గదా.అలా ఎందుకు తయారవుతున్నారు...చిన్నప్పుడు నాలుగు తగిలించకనే.బాలల హక్కులు అనే మాట విండానికి బాగానే ఉంటుంది.కాని దాని మాటున తాలుసరుకు లాంటి యువతరాన్ని ఉత్పత్తి చేస్తున్నాం దేశం లో. అందరూ ఆలోచించవలసిన తరుణం ఇది.       

15, మార్చి 2023, బుధవారం

మొత్తానికి ఆస్కార్ అవార్డ్ ని తెలుగు సినిమా చేజిక్కించుకుంది. నాటు...నాటు... అనే పాటతో. ఏదేమైనా ఆస్కార్ కమిటీ వాళ్ళు మహా చతురులేనండోయ్...లేకపోతే మరేమిటి..?

 మొత్తానికి ఆస్కార్ అవార్డ్ ని తెలుగు సినిమా చేజిక్కించుకుంది. నాటు...నాటు... అనే పాటతో. ఏదేమైనా ఆస్కార్ కమిటీ వాళ్ళు మహా చతురులేనండోయ్...లేకపోతే మరేమిటి..? మన రాజమౌళి సినిమాలు అతుకుల బొంతలని,అక్కడొక ముక్క ఇక్కడొక ముక్క తీసేసి తన సినిమాలు తీస్తాడని క్రిటిక్స్ బాహుబలి టైం లో అన్నారు,మళ్ళా RRR టైం లోనూ అన్నారు. అయితేనేం "ఒరిజినల్ సాంగ్" అనే కేటగిరి లో రెండు ఆస్కార్ లు వచ్చాయి. ఒకటి కీరవాణి కి,మరొకటి చంద్రబోస్ కి. అభినందనలు చెప్పాల్సిందే...సాటి తెలుగువాళ్ళకి ఆస్కార్ వచ్చినందుకు..! కానీ ఏదో లోటు లోపల..ఇంకా ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి తెలుగు లో ,వాటిలో కూడా ఏదో దానికి వచ్చి ఉంటే బాగుండు.

అప్పటికీ తమ్మారెడ్డి భరద్వాజ అనే ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతూనేఉన్నాడు.80 కోట్లు ఖర్చు పెట్టారని,లాబీయింగ్ లు చేశారని.ఏం చేస్తాం మరి.లోకం పోకడ అలా ఉంది.కానివ్వండి మేనేజ్మెంట్ చేసే కళ కూడా సామాన్యమా..? దానిలోనూ ఎంతోమంది పోటి పడే ఉంటారు,కాని నెగ్గేమా లేదా అది కత. కాని మంచి సంగీతానికి ఇంకా సాహిత్యానికి  పరాకాష్ట కేవలం ఈ సాంగ్ మాత్రమే అని ఇక్కడే నిలిచిపోతే అంతకి మించిన అమాయకత్వం ఇంకొకటి ఉండదు. ఇంతకు ముందు ఇదే కేటగిరి లో 2009 లో స్లండాగ్ మిలియనీర్ సినిమా కి గాను ఏ.ఆర్.రెహమాన్,గుల్జార్ లకి వచ్చాయి.చూద్దాం...ఇంకా ముందు చూద్దాం. మరిన్ని ఆస్కార్ లు తెలుగు చిత్రసీమ కి దక్కుతాయని ఆశిద్దాం.  

9, మార్చి 2023, గురువారం

ఇంగ్లీష్ బుక్స్ కి కాపీఎడిటర్లు ఉన్నట్టు మన తెలుగు పుస్తకాల ప్రచురణకి ఎందుకు ఉండరు..?

 ఇంగ్లీష్ బుక్స్ ప్రచురణలో ఎడిటర్లు ఉన్నట్లు  మన తెలుగు లో ఎందుకు ఉండరు..?

ఈ అనుమానం తరచూ ఇంగ్లీష్ మరియు తెలుగు పుస్తకాలు చదివే వారికి వస్తూంటుంది. ముఖ్యం గా ప్రతి ఫారిన్ నవల లేదా ఇతర పుస్తకం బయటకి వచ్చిందంటే దాంట్లో ఎడిటర్ పాత్ర ఎంతో ఉంటుంది.ఆయా రచయితలు కూడా తమ ముందుమాట లో కొన్నిసార్లు చెబుతుంటారు. అసలు ఈ ఎడిటర్లు ఏం చేస్తారు..? మరి తెలుగు పుస్తకాల్లో ఇలాంటి వారు ఉండరా అంటే ప్రస్తుతం కొన్ని సంస్థల్లో ఉండి ఉండచ్చును.

కాపీ ఎడిటర్ అని ఇంకా ఇతర పేర్ల తో పిలిచే వీళ్ళు ఇంచు మించు రచయిత చేసినత పని చాలా శ్రద్ధగా చేస్తుంటారు. రచయిత తను రాసే క్రమం లో కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంటుంది.గ్రామర్ పరంగా,విషయ పరంగా గాని,స్పెల్లింగ్స్ పరంగా గాని ఇలా ఎన్నో చోట్ల ఆ అవకాశం ఉంటుంది.అలాంటి వాటిని పరిశీలించి చక్కదిద్దటమే ఎడిటర్లు చేసే పని.

అలా అని చెప్పి రచయిత రాసిందాన్ని ఇష్టం వచ్చినట్లు ట్విస్ట్ చేసే అధికారం ఎడిటర్ కి ఉండదు. ప్రతి రచయిత కి తనదైన ఓ శైలి ఉంటుంది. దాన్ని భంగపరచకుండానే ఎడిటర్ తన పని జాగ్రత్తగా చేయాలి.ఓపిగ్గా మాన్యుస్క్రిప్ట్ లు చదివి వాటిని సరిదిద్దటం అంటే ఎంతో జాగరూకత అవసరం.ఏది ఇప్పటి పరిస్థితి లో ఎన్ని కాపీలు అమ్ముడవుతాయి లాంటిది కూడా వాళ్ళు తమకి ఉన్న అనుభవం తో చెప్పగలరు.

  ప్రస్తుతం ప్రతి ప్రముఖ పబ్లిషింగ్ సంస్థ ఈ కాపీ ఎడిటర్ లేదా ఎడిటర్ లని కలిగిఉంది అని చెప్పాలి.ముఖ్యంగా ఇంగ్లీష్ ప్రచురణలో అయితే తప్పనిసరిగా ఉంటారు.సెల్ఫ్ పబ్లిష్ చేసే నోషన్ ప్రెస్, బ్లూ రోస్ లాంటి సంస్థలు ఎడిటింగ్ చేయటానికి కొంత ఫీజ్ తీసుకుని ఆయా సర్విస్ ల్ని అందజేస్తాయి. అరిహంత్,జైకో,రూపా,పెంగ్విన్ రాండం,రోలి,హార్పర్ కోలిన్స్,లాంటి అన్ని సంస్థల్లోనూ మంచి ఎడిటింగ్ సేవలు అందించేవారున్నారు.అందుకే ఆయా పుస్తకాలు లేదా ఇతర విదేశీ పుస్తకాలు అచ్చుతప్పులు గాని,వాక్యాలు తప్పులు గాని,గ్రామర్ తప్పులు గాని లేకుండా చదవడానికి హాయిగా ఉంటాయి. మన తెలుగు వాళ్ళు ఎడిటింగ్ సేవలు ఉపయోగించుకోవడమంటే మరి ఎందుకో అంతగా ఆసక్తి చూపరు.దాని పర్యవసానం మనకి అనుభవమవుతూనే ఉంటుంది. 

27, ఫిబ్రవరి 2023, సోమవారం

వీథి కుక్కల సమస్య ని ఇలా పరిష్కరించవచ్చు..!

 కొన్ని రోజులు క్రితం ఓ చిన్న పిల్లాడ్ని కొన్ని వీథి కుక్కలు అతి దారుణంగా పొట్టనబెట్టుకున్నాయి హైదరాబాద్ నగరం లో. దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఒక సంఘటన జరగ్గానే దాని గురించి కొన్ని రోజులు చర్చించుకోవడం మళ్ళీ దాని ఊసు ఎత్తకుండా మర్చిపోవడం అనేది జరుగుతున్నది. అది సమంజసం కాదు.ఈ దాటవేసే లేదా సీరియస్ గా తీసుకోకుండా పోయే విధానం అత్యంత అశాస్త్రీయం,అజ్ఞానం !ఎందుకంటే కుక్క కరవగానే కొంతమంది వాటిని ఎక్కడికక్కడ చంపిపారేయాలని సామాజిక మాధ్యమాల్లో గోల పెడతారు. ఇంకొంతమంది నోరు లేని జీవులు వాటిని చంపితే ఎలాగా ఆపరేషన్ లాంటిది చేసి వాటి సంతనాన్ని తగ్గించాలని అంటారు.

 రెండు వాదనలూ సరైనవే అనిపిస్తాయి. కాని శాస్త్రీయ అధ్యయనం చేసి ఆ కుక్కలు కరవడానికి గల కారణాలు,వాటి విషయం లో మనుషులు ప్రవర్తించవలసిన విధానాలు ప్రచారం చేయాలి.ఎందుకంటే ఇండియా లో పల్లె నుంచి నగరం దాకా వీథి కుక్కలు ఉన్నాయి. ఎంతో ప్రణాళికాబద్ధం గా వ్యవహరిస్తే తప్పా వీథి కుక్కల్ని అరికట్టలేము.ఇంత సైన్స్ అభివృద్ది చెందిన ఈ రోజుల్లో కూడా ఈ సమస్య ని అరికట్టలేకపోతే మన పరిపాలనా వ్యవస్థ కే సిగ్గుచేటు. కుక్కల జనాభా మామూలుగా లేదు.2019 లో జరిగిన గణన ప్రకారం 20,59,261 వీథి కుక్కలతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం లో ఉండగా 17,34,399 వీథి కుక్కలతో ఒరిస్సా రాష్ట్రం రెండవ స్థానం లో ఉంది.

అసలు వీథి కుక్కలు ఎందుకు కరుస్తాయి..? అని ప్రశ్నించుకుంటే అనేక సమాధానాలు వస్తాయి.వాటికి జబ్బు చేసినా లేదా ఏవైనా దెబ్బ తగిలినా లేదా భయం వల్ల గాని లేదా ఎదుటి వారు ఎప్పుడో ఒకప్పుడు దాడి చేసినా,తమ పిల్లల్ని కాపాడుకోడానికి గాని ఇలా అనేక కారణాల వల్ల కరుస్తాయి. వీథి కుక్కల జీవితం అత్యంత దుర్భరం గా ఉంటుంది.కొన్ని రోజులు పాటు ఆహారం దొరకదు ఒక్కోసారి.దొరికిన కొద్దిపాటి వాటి కొసం తోటి కుక్కలతో పోరాడవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఇది చాలక రోడ్డు మీద పిల్లా పెద్దలు రాళ్ళువేయడం భయపెట్టడం చేస్తుంటారు. వీథి కుక్కలు కరిచే ముందు కొన్ని సంకేతాలు ఇస్తాయి,వాటిని మనిషి అర్థం చేసుకోకపోతే వాటి పని అవి చేస్తాయి.వాటి పోలిస్తే మనిషి బుద్ధి జీవి.కనుక మనమే అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి.    

వీథి కుక్కలు గుంపులుగా ఉంటాయి. అవి బైక్ వెనుక పరుగెత్తుకువస్తున్నా,లేదా మన వెనకాలే వస్తున్నా భయం తో పారిపోయే ప్రయత్నం చేస్తే వాటికి ఇంకా కోపం వచ్చి వెంటబడతాయి. వాటికి దగ్గరగా వచ్చినపుడు పొడి దగ్గు లాంటిది దగ్గి వేరే వైపు చూడాలి,మరీ ఐ కాంటక్ట్ పెట్టుకోకూడదు ఆ సమయంలో. వాటి దుర్భర పరిస్థితుల్లో అవి ఉండి వాటి స్థాయి లోనే ఆలోచించగలవు తప్పా మనిషి అంతా తెలివిగా ఆలోచించగలవా? కాబట్టి పరిష్కార మార్గాల్ని మనమే నిపుణుల సాయం తో కనిపెట్టి అమలుపరచాలి.గత కొన్ని ఏళ్ళ బట్టి స్టెరిలైజేషన్ చేస్తున్నా పెద్దగా కుక్కలు తగ్గింది ఏమీ కనిపించడం లేదు. కాబట్టి వేరే మార్గాలు అన్వేషించవలసిందే. ప్రతి ఊరి లోని కుక్కల్ని ప్రజలంతా తమ బాధ్యత గా ఫీలవ్వాలి.అది కేవలం పంచాయితీ వాళ్ళదే అనుకోకూడదు.వాటన్నిటిని పట్టి అడవి లో వదిలి వేయడం ఓ మార్గం లేదా వీథి కుక్కల్ని పెంచుకోవడం ఓ మార్గం లేదా వీటి బాగోగులు చూడడానికి ఓ వ్యవస్థ ని రూపొందించాలి.

5, ఫిబ్రవరి 2023, ఆదివారం

వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు చూసిన తర్వాత నా ఫీలింగ్ ...

 ఈ ఓటిటి లు అవీ వచ్చిన తర్వాత సామాన్య ప్రేక్షకుల్లో కూడా సినిమా జ్ఞానం బాగా పెరిగింది. ఎందుకని మళయాళం వంటి భాషల్లో చాలా తక్కువ బజెట్ తో మంచి కథలు రాసుకొని తీస్తున్నారు,వాట్ని మనాళ్ళు పెద్ద రేటు ఇచ్చి రీమేక్ రైట్స్ కొనుక్కోవడం చేస్తున్నారు అనేది అర్ధం అవుతున్నది. అయితే మన దగ్గర అవీ చీదేస్తున్నాయి,మనవైన కొన్ని మసాళాలు చొప్పించడం వల్ల.

వంశపు డైలాగులు,నేను లేస్తే మనిషిని కాదు అనే రాజకీయ డైలాగులు విని విని చూసి చూసి తెలుగు సినిమా అంటే ఉన్న గౌరవం పోతున్నది.అసలు అనగూడదు గాని మన ఆడియన్స్ లో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరీ బర్రె గొడ్ల యవ్వారం లా ఉంది...హీరోల్ని అభిమానించే తీరు...మా కులపు వాడు ఐతే చాలు ఎయ్ ...ఎయ్...నా రాజా సినిమా ఇరగ ఉంది బ్రదర్ అంటూ రివ్యూ లు విరగదీసి రాయడం,చెప్పడం  ఒకటి. ఇక యూ ట్యూబ్ చానళ్ళు గురించి చెప్పేదే లేదు. 

ఇది చాలదన్నట్లు భారత్ దాటి ,అమెరికా సినిమా హాళ్ళ లో కూడా నానా రభస చేస్తూ తెలుగు వాళ్ళు అంటే ఈ టైప్ వాళ్ళా అనుకునేట్లు చేస్తున్నారు. సుత్తి అంతా ఎందుకు గాని ఈమధ్య చిరంజీవి,బాలకృష్ణ ల రెండు కొత్త సినిమాలు చూసిన తర్వాత వీరిద్దరు కొంత కాలం సినిమాలు తీయకుండా ఉంటే మంచిది అనిపించింది. తెలుగు వాళ్ళకి గాని,కళల కి గాని వచ్చే నష్టం ఏమీ లేదు. ఇప్పటికే వాళ్ళు చేయవలసింత కళాసేవ చేసి తరించారు.