Pages

27, ఫిబ్రవరి 2023, సోమవారం

వీథి కుక్కల సమస్య ని ఇలా పరిష్కరించవచ్చు..!

 కొన్ని రోజులు క్రితం ఓ చిన్న పిల్లాడ్ని కొన్ని వీథి కుక్కలు అతి దారుణంగా పొట్టనబెట్టుకున్నాయి హైదరాబాద్ నగరం లో. దీని గురించి చాలా లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. ఒక సంఘటన జరగ్గానే దాని గురించి కొన్ని రోజులు చర్చించుకోవడం మళ్ళీ దాని ఊసు ఎత్తకుండా మర్చిపోవడం అనేది జరుగుతున్నది. అది సమంజసం కాదు.ఈ దాటవేసే లేదా సీరియస్ గా తీసుకోకుండా పోయే విధానం అత్యంత అశాస్త్రీయం,అజ్ఞానం !ఎందుకంటే కుక్క కరవగానే కొంతమంది వాటిని ఎక్కడికక్కడ చంపిపారేయాలని సామాజిక మాధ్యమాల్లో గోల పెడతారు. ఇంకొంతమంది నోరు లేని జీవులు వాటిని చంపితే ఎలాగా ఆపరేషన్ లాంటిది చేసి వాటి సంతనాన్ని తగ్గించాలని అంటారు.

 రెండు వాదనలూ సరైనవే అనిపిస్తాయి. కాని శాస్త్రీయ అధ్యయనం చేసి ఆ కుక్కలు కరవడానికి గల కారణాలు,వాటి విషయం లో మనుషులు ప్రవర్తించవలసిన విధానాలు ప్రచారం చేయాలి.ఎందుకంటే ఇండియా లో పల్లె నుంచి నగరం దాకా వీథి కుక్కలు ఉన్నాయి. ఎంతో ప్రణాళికాబద్ధం గా వ్యవహరిస్తే తప్పా వీథి కుక్కల్ని అరికట్టలేము.ఇంత సైన్స్ అభివృద్ది చెందిన ఈ రోజుల్లో కూడా ఈ సమస్య ని అరికట్టలేకపోతే మన పరిపాలనా వ్యవస్థ కే సిగ్గుచేటు. కుక్కల జనాభా మామూలుగా లేదు.2019 లో జరిగిన గణన ప్రకారం 20,59,261 వీథి కుక్కలతో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం లో ఉండగా 17,34,399 వీథి కుక్కలతో ఒరిస్సా రాష్ట్రం రెండవ స్థానం లో ఉంది.

అసలు వీథి కుక్కలు ఎందుకు కరుస్తాయి..? అని ప్రశ్నించుకుంటే అనేక సమాధానాలు వస్తాయి.వాటికి జబ్బు చేసినా లేదా ఏవైనా దెబ్బ తగిలినా లేదా భయం వల్ల గాని లేదా ఎదుటి వారు ఎప్పుడో ఒకప్పుడు దాడి చేసినా,తమ పిల్లల్ని కాపాడుకోడానికి గాని ఇలా అనేక కారణాల వల్ల కరుస్తాయి. వీథి కుక్కల జీవితం అత్యంత దుర్భరం గా ఉంటుంది.కొన్ని రోజులు పాటు ఆహారం దొరకదు ఒక్కోసారి.దొరికిన కొద్దిపాటి వాటి కొసం తోటి కుక్కలతో పోరాడవలసిన అగత్యం ఏర్పడుతుంది. ఇది చాలక రోడ్డు మీద పిల్లా పెద్దలు రాళ్ళువేయడం భయపెట్టడం చేస్తుంటారు. వీథి కుక్కలు కరిచే ముందు కొన్ని సంకేతాలు ఇస్తాయి,వాటిని మనిషి అర్థం చేసుకోకపోతే వాటి పని అవి చేస్తాయి.వాటి పోలిస్తే మనిషి బుద్ధి జీవి.కనుక మనమే అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి.    

వీథి కుక్కలు గుంపులుగా ఉంటాయి. అవి బైక్ వెనుక పరుగెత్తుకువస్తున్నా,లేదా మన వెనకాలే వస్తున్నా భయం తో పారిపోయే ప్రయత్నం చేస్తే వాటికి ఇంకా కోపం వచ్చి వెంటబడతాయి. వాటికి దగ్గరగా వచ్చినపుడు పొడి దగ్గు లాంటిది దగ్గి వేరే వైపు చూడాలి,మరీ ఐ కాంటక్ట్ పెట్టుకోకూడదు ఆ సమయంలో. వాటి దుర్భర పరిస్థితుల్లో అవి ఉండి వాటి స్థాయి లోనే ఆలోచించగలవు తప్పా మనిషి అంతా తెలివిగా ఆలోచించగలవా? కాబట్టి పరిష్కార మార్గాల్ని మనమే నిపుణుల సాయం తో కనిపెట్టి అమలుపరచాలి.గత కొన్ని ఏళ్ళ బట్టి స్టెరిలైజేషన్ చేస్తున్నా పెద్దగా కుక్కలు తగ్గింది ఏమీ కనిపించడం లేదు. కాబట్టి వేరే మార్గాలు అన్వేషించవలసిందే. ప్రతి ఊరి లోని కుక్కల్ని ప్రజలంతా తమ బాధ్యత గా ఫీలవ్వాలి.అది కేవలం పంచాయితీ వాళ్ళదే అనుకోకూడదు.వాటన్నిటిని పట్టి అడవి లో వదిలి వేయడం ఓ మార్గం లేదా వీథి కుక్కల్ని పెంచుకోవడం ఓ మార్గం లేదా వీటి బాగోగులు చూడడానికి ఓ వ్యవస్థ ని రూపొందించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి