Pages

2, ఆగస్టు 2023, బుధవారం

Bawaal అనే హిందీ సినిమా చూసి మతిపోయింది.

 బవాల్ (Bawaal) అనే హిందీ సినిమా ని చూడటం జరిగింది. 

అమెజాన్ ప్రైం ఓటిటి లో ఇటీవల రిలీజ్ అయ్యింది. వరుణ్ ధావన్,జాన్వి కపూర్ నటించారు గదా అన్నట్టు చూశాను. ఎంత మతి లేని స్టోరీలు పెట్టి సినిమాలు వండుతున్నారు అని నవ్వు వచ్చింది. బాగా రిచ్ గా విదేశాల్లో తీశారు కాని అర్థం పర్థం అనేది ఉండాలా..? హీరో ఏదో బాగా ఉన్నవాడిలా బిల్డప్ లు ఇస్తుంటాడు. కాని హైస్కూల్ లో టీచర్ గా చేస్తుంటాడు.అదీ సోషల్ టీచర్ గా సుమా.


విచిత్రం ఏమిటంటే హిట్లర్ గురించి,ప్రపంచ యుద్ధాల గురించి హీరో కి ఏమీ తెలీదు,పిల్లల తో పాఠాలు చెప్పిస్తూ బిల్డప్ ఇస్తుంటాడు. అసలు ఈరోజుల్లో అలాంటి టీచర్ ని పెట్టుకునే స్కూల్ ఎక్కడన్నా ఉంటుందా..?పైగా ఆ స్కూల్ లో ఎం.ఎల్.ఏ. కొడుకు చదివే రేంజ్ ఉన్న స్కూల్. ఎంత వెకిలితనం తో తీస్తున్నారు సినిమాలు. హీరోయిన్ కి ఫిట్స్ ఉంటాయి. ఆ విషయం పెళ్ళికి ముందే చెబుతుంది హీరోయిన్ అయినా పెళ్ళి అయిన తర్వాత కూడా హీరో ఆమెని ద్వేషిస్తూంటాడు. ముందే పెళ్ళి కి నో చెప్పొచ్చుగా. 

ఇక పిల్లలతో గొడవ వచ్చి వాళ్ళ ముందు బిల్డప్ ఇవ్వడానికి జర్మనీ వెళతాడు హీరో. పైగా అక్కడ యూదుల్ని చంపడానికి  హిట్లర్ నిర్మించిన గ్యాస్ చాంబర్(ఆశ్వీజ్)లు చూస్తూ కొన్ని జంటల జీవితాలు వాటిలాగా ఉంటాయని పోల్చడం ఏమిటో అర్థం కాదు. దానికీ దీనికీ లంకె ఏమిటో తెలియదు. ఈ మధ్య కాలం లో ఇంత మతి లేని కత ని ఎక్కడా చూడలేదు. గతం లో నితీష్ తివారీ దంగల్,చిచోర్ లాంటి మంచి సినిమాలు తీసినా మరి ఈసారి ఏమయ్యిందో తెలియదు.      

12, జులై 2023, బుధవారం

మహిళలు ఇలా ఉన్నారు మన దేశంలో...


 మహిళా సాధికారత అనే మాట తరచు గా వింటూ ఉంటాము. పేపర్ల లో,టీవి ల్లో,నాయకుల ప్రసంగాల్లో ఎక్కడ చూసినా అదే. కాని గణాంకాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు.యుపిఎస్సి లోనూ,ఇతర పరీక్షల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నా నిర్ణాధికారం ఉండే పోస్టుల్లోకి రావడం లేదు.మొత్తం జనాభా లో దేశం లో 48 శాతం స్త్రీ ల జనాభా ఉంది. కేవలం 25 శాతం మాత్రమే పనిచేసే వర్గం లో ఉన్నరు.

ఇది అంతా CMIE వారి లెక్కల ప్రకారం చెబుతున్నదే. మొత్తం పనిచేయగల వారి స్త్రీల జనాభా లో 94 శాతం మంది అన్ ఆర్గనైజ్డ్ రంగాల్లో ఉన్నారు.పార్లమెంట్ ని తీసుకున్నా అంత ఆశాజనకం గా ఏమీ లేదు. 542 మంది లోక్ సభ సభ్యుల్లో కేవలం 78 మంది మాత్రమే ఉన్నారు.అలాగే రాజ్యసభ లో తీసుకున్నా,224 మందికి గానూ 24 మంది మాత్రమే ఉన్నారు.ఇదంతా అక్టోబర్ 2021 లో తీసిన లెక్కలు.

అంతర్జాతీయ సంస్థలు ఈ గణాకాల పట్ల పెదవి విరుస్తున్నాయి. ఇంకా స్త్రీల శాతం అన్ని రంగాల్లో పెరగవలసిన అవసరాన్ని చెబుతున్నాయి.మనదేశం తో పోలిస్తే అనేక యూరపు దేశాల పరిస్థితి మిన్నగా ఉంది.అయితే ఎన్నో తరాల నుంచి వారికి,మన దేశ పరిస్థితికి తేడాలు ఉన్నాయి గదా అనవచ్చు.అదీ నిజమే అయినప్పటికి చిత్తశుద్ధి తో కృషి చేస్తే స్త్రీల శాతం అన్ని రంగాల్లో పెరిగే అవకాశం లేకపోలేదు.

30, జూన్ 2023, శుక్రవారం

ఆదిపురుష్ అనబడే సినిమా ....

 ఆదిపురుష్ అనబడే సినిమా ఈ రకంగా తీయాలని ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. అది ఇతిహాసమే బట్ ఇప్పటిదాకా జనాల మనసుల్లో ఉన్న ఆహార్యం దీంట్లో ఉండదు. రోమన్ల శైలి. నడుము కి కట్టిన దట్టీ దగ్గర్నుంచి,జులపాల వరకు.వస్త్రాల దగ్గరనుంచి మొహం లో పెద్దగా హావభావాలు లేని స్థితి. రామాయణం కాదు అంటారు.మళ్ళీ భజరంగ్ గారికి ఓ సీటు వదిలెయ్యాలంటారు.


ఇక రావణాసురుని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఆ పది తలలు ఎంత కృత్రిమం గా ఉన్నాయో.నిజంగా ఆ వాల్మీకీ మహర్షి కనక ఉంటే ఇలా అంటాడాయన. నా పాత్రల్ని ఎంత అపభ్రంశం చేశారురా బాబూ.చేసి మళ్ళీ దీనికీ రామాయణం కి సంబంధం లేదంటారు.భజరంగ్ పలికే సినిమాటిక్ డైలాగ్ లు.ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.   

21, మే 2023, ఆదివారం

బిచ్చగాడు 2 సినిమా పై నా అభిప్రాయం

 ఒక్కమాటలో చెప్పాలంటే ఒకసారి చూడవచ్చు. మరీ సూపర్ కాదు. మరీ చెత్త అనలేము. ఎంతోకొంత లేనివాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ మీద ఓ సాఫ్ట్ కార్నర్ వచ్చేలా సినిమా తీసినందుకు విజయ్ ఆంటోనీ ని అభినందించాలి. బిచ్చగాడు మొదటి పార్ట్ లో తల్లి కొడుకు సెంట్ మెంట్ బాగా వర్కవుట్ అయింది. అలాగే అన్నీ బాగా కుదిరి సూపర్ హిట్ అయింది. అది ఇచ్చిన ఊపు లో దానికి సీక్వెల్ గా ఇది తీశారు.

అయితే దానికి దీనికి కథ పరంగా పెద్దగా పొంతన లేదు. ఇది మొత్తం కార్పోరెట్ కుటుంబం,కుట్రలు,ఇంకా ఇంకో వైపు అన్న చెల్లి సెంట్ మెంట్.విజయ్ ఆంటోనీ మరియు నాయిక కావ్య థాపర్ బాగా చేశారు.అయితే కొన్ని సన్నివేశాలు మరీ లాగదీసినట్లు అనిపించాయి.ముఖ్యంగా చిన్నప్పటి సెంట్ మెంట్ సీన్లు కొన్ని తగ్గించవలసింది. చూసేవాళ్ళకి కొద్దిగా రిలీఫ్ వుండేది.కాని చివరకి వచ్చేసరికి సెంట్మెంట్ తో కన్నీళ్ళు వచ్చేలా చేశాడు.

ప్రతి ఉన్నవాడు ఎంతో కొంత ఈ సినిమా లో చెప్పినట్లు అంత స్థాయి లో కాకపోయిన ఏంతో కొంత ఇతరుల గురించి ఆలోచించి తోచింది చేస్తే సమాజం లో చాలా బాధలు పేదవారికి ఉండవు.అది కన్విన్సింగ్ గా చెప్పిన దర్శకుడు విజయ్ ఆంటోనీ అభినందనీయుడు.ఆ కోణం లో అతడిని మెచ్చుకోకుండా ఉండలేము. బ్రెయిన్ మార్పిడి ఆసక్తి గానే ఉంది గాని కొన్ని సందేహాలు రాకమానవు. బిచ్చగాడు రిచ్ మేన్ స్టేజ్ కి వచ్చిన తర్వాత తన పలుకుబడి,డబ్బు తో తన చెల్లిని ఈజీ గా వెతికవచ్చు గదా.మళ్ళీ తను బిచ్చగాడి గా మారడం ఏమిటి అనిపిస్తుంది.

ఏది ఏమైనా ఓ సారి చూడవచ్చు.సంగీతం,ఎడిటింగ్,నిర్మాత,దర్శకత్వం ఈ బాధ్యతల తో బాటు హీరో గా కూడా నటించి విజయ్ ఆంటోనీ కొంత మేరకు విజయవంతం అయ్యాడనే చెప్పాలి.దేవ్ గిల్,రాధా


రవి ఇంకా ఇతరులు బాగా చేశారు.డైలాగులు కూడా ఫర్లేదు.నిడివి కొన్ని చోట్ల తగ్గిస్తే సినిమా ఇంకా హిట్ అయ్యి ఉండేది.చివరి సన్నివేశాల్లో కన్నీళ్ళు రాని ప్రేక్షకులు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.    


15, మే 2023, సోమవారం

పొన్నియన్ సెల్వన్-2 సినిమా పై నా అభిప్రాయం

 మొత్తానికి నిన్ననే చూశాను "పొన్నియన్ సెల్వన్-2" మొదటి పార్ట్ తో పోల్చితే మరీ అంత బోరు గా అనిపించలేదు. కట్టు కథల్ని అయితే అటుది ఇటు మార్చి గూస్ బంప్స్ వచ్చేలా ఏదో తీయచ్చు.కాని చరిత్ర కథ. ఇష్టం వచ్చినట్టు తీయడం కుదరదు.కొన్ని లిమిట్స్ ఉంటాయి ఊహలకి కూడా. అలా సర్దుకు పోవాలి. అందునా తమిళ సగటు పాఠకుడి కి కూడా ఎంతో కొంత చోళుల చరిత్ర తెలుసు.

కొన్ని తమిళ యూట్యూబుల్లో ఈ సినిమా మీద ఆధారపడి ఇంటర్వ్యూలు గట్రా బాగా వచ్చాయి.ఒక్కొకళ్ళది ఒక్కో వెర్షన్. భారతీ రాజా లాంటి దర్శకుడు కూడా ఓచోట, అయ్యా మణిరత్నం గారు మీకు సంస్కృతం అంటే ఎందుకు అంత మోజు..? చోళులు దైవ స్త్రోత్రాల్ని కూడా అచ్చ ప్రాచీన తమిళం లోనే రాశారు,రాయించారు గదా అంటూ ఓ చురక వేశాడు. అట్లా తమిళ సమాజం లో చాలా చర్చ సినిమా బయట కూడా జరిగింది. డబ్బింగ్ చేయడం లో ఒరిజినాలిటి కొంత పోవడం సహజమే గదా.

సాహిత్యం,సంగీతం,శిల్ప శాస్త్రం,సముద్రం పై పయనించి దండయాత్రలు చేయడం,ఇలా ఎన్నో విషయాల్లో తమిళుల పై ప్రభావం చూపారు.ఇంకా చూపుతూనే ఉన్నారు.భావ పరం గా. ఆ మనసుల్లో ఉన్న బరువు మనకి తెలియదు. కాబట్టి మనకి చోళులు అంటే అనేకమంది రాజుల్లో వాళ్ళూ ఒకరు.అంతే కాదు,చోళులు,పాండ్యులు వీళ్ళని ఓన్ చేసుకునే కులాలు కొన్ని తమిళనాడు లో ఉన్నాయి.వాళ్ళ గొడవ వాళ్ళది.రకరకాల ఆధారాలు చూపిస్తూ మా వాళ్ళని చూపించవలసింత గా చూపించలేదని.

 శ్రీ లంక లో చనిపోయాడనుకున్న అరుళ్ మొళి వర్మ రక్షింపబడటం దగ్గరనుంచి ఈ సినిమా లో కథ మొదలు అవుతుంది. సుందర చోళుడు కూడా రక్షింపబడతాడు.వీళ్ళిద్దర్నీ సేవ్ చేసినవారు నందిని యొక్క తల్లి.

ఓ సీక్రెట్ రివీల్ అయింది.కరికాళుడు చనిపోవడాన్ని స్పష్టం గాచూపించలేదు.చరిత్ర పరంగా కూడా ఆయన మరణం ఎలా జరిగింది అనేది ఎవరికీ తెలియదు.రాష్ట్రకూటుల కుట్ర యత్నాలు అదనం గా దీనిలో చూడవచ్చు.అప్పుడూ,ఇప్పుడూ అధికారం దగ్గరకి వచ్చేసరికి దగ్గర వాళ్ళతోనే అసలైన గొడవలూ,కుతంత్రాలు.అవి బాగా చూపించారు.మణిరత్నం చాలా సీన్లని చాలా Subtle గా ప్లే చేశాడు దాన్ని తమిళ ఆడియన్స్ బాగా ఆస్వాదన చేస్తారు. చివరకి మధురాంతకుడికి కిరీటం ఇవ్వడం,ఆ తర్వాత 13 ఏళ్ళకి అరుళ్ మొళి వర్మ (రాజరాజ చోళుడు) రాజ్యానికి రావడం జరిగిందని చెప్పి సినిమా ముగిస్తారు.

 చారిత్రక నవలని సుందరమైన దృశ్య కావ్యం గా తీసిన మణిరత్నం అభినందనీయుడు. ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం బావుంది.సినిమాటోగ్రఫీ గొప్ప అస్సెట్. నటీ నటులు అందరూ జీవించారు.వాళ్ళు మిగతా ఎన్ని సినిమాల్లో నటించినా ఆ పాత్రలు మాత్రం నిలిచిపోతాయి.ముందే చెప్పా,ఇది తమిళుల నేల మరియు ఉద్వేగానికి సంబందించిన సినిమా.ఆ పరం గా గొప్ప విజయం. మిగతా అన్ని భాషల వారికి ఇది చేరగలగడం మాత్రం బోనస్.అంతే.   


3, మే 2023, బుధవారం

"పొన్నియన్ సెల్వన్ - 2 "లో రోమాలు నిక్కబొడిచే సాంగ్

 పొన్నియన్ సెల్వన్-2 లోని "వీర రాజ వీర" అనే పాట నిన్న యూట్యూబ్ లో విన్నాను.అది తమిళ వెర్షన్. రోమాలు నిక్కబొడిచినాయి. ఏ.ఆర్.రెహమాన్ కంపోజిషన్ అద్భుతం.శాస్త్రీయ సంగీతం బేస్ చేసుకొని నూతన తరానికి కూడా నచ్చేలా చేశాడు. దాంట్లోని సాహిత్యం సైతం అతి మనోహరం.చోళుల వైభవాన్ని,వీరత్వాన్ని,రాజ్య విస్తరణని తమిళ కవి గొప్పగా రాశాడు.ఇటు వచ్చి తెలుగు లో విన్నాను.కొన్నిసార్లు మంచి పాటలు డబ్బింగ్ లో ఖూని అవుతుంటాయి. చంద్రబోస్ కూడా నిజం గా తమిళ వెర్షన్ కి ఏ మాత్రం తగ్గకుండా రాశాడు.అలాగే రీ రికార్డింగ్ కూడా చాలా క్వాలిటి తో ఉంది.ఈ మధ్య కాలం లో వచ్చిన ఓ అరుదైన సాంగ్ అని చెప్పవచ్చు.

పొన్నియన్ సెల్వన్ పోస్టర్ ల మీద చూస్తే మీకు ఆ టైటిల్ కింద Based on Kalki's novel అని కనిపిస్తుంది.ఒక గొప్ప నవల ని ,తమ చరిత్ర ని వివరించే నవలని తమిళులు గర్వంగా సినిమా తీసి ప్రపంచం మీదికి వదిలారు.ఎంత ధనం వచ్చింది వేరే మాట కాని చోళుల వైభవాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించారు,మరి ఆ విధంగా ఏ తెలుగు నవల ని అయినా మన వాళ్ళు ఇంతవరకూ చూపించగలిగారా..?ఇంగ్లీష్,హిందీ,ఇంకా ఇతర అనేక భాషల సినిమాల నుంచి రకరకాల మంచి సీన్లని లేపేసి కిచిడీ చిత్రాలు తీయడం తప్పా.మన తెలుగు లోనూ ఎన్నో గొప్ప చారిత్రక నవలలు ఉన్నాయి,కాకపోతే వాటి మీద దృష్టి పెట్టే తీరిక మనకి లేదు.

అలాంటి అభిరుచి ని కూడా మన సినిమా పెద్దలు ఎక్కడ ప్రొత్సహించారని..?తమిళం లోనూ పక్కా మాస్ సినిమాలు వస్తాయి.అలాగే మంచి ఆలోచనాత్మకమైన సినిమాలూ వస్తాయి.అలా తీయగలిగే వాతావరణాన్ని అక్కడ సమాజం కలిగించగా,మన సినిమా ఫీల్డ్ మాత్రం అత్తెసరు కుల మాఫియా బారిన బడి మేం తీసిందే సినిమా అన్నట్లు చేస్తున్నారు.అయితే ఈ ఓటిటి యుగం లో ఆ ఆటలు ఇకచెల్లవు.కాబట్టే సగటు తెలుగువాడు ఓటిటి లో ప్రతి మంచి సినిమా ని , ఏ భాష అయినా సరే చూస్తున్నాడు.   

25, ఏప్రిల్ 2023, మంగళవారం

ఈ చిన్న ఆర్టిస్ట్ లు సాధించిన విజయం ఆస్కార్ కి ఏం తక్కువని ?

 "నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్త పా" అనే వీడియో సాంగ్ ని ఈరోజు మళ్ళీ విన్నా. చూస్తే 350 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. చాలా అద్భుతం అనిపించింది. చిన్న ఆర్టిస్ట్ లు చేసిన గొప్ప అద్భుతం. ఒక్క తెలుగు వాళ్ళే కాదు,కామెంట్ల లో చూస్తే పంజాబ్ నుంచి..మహారాష్ట్ర నుంచి,యూ.పి. నుంచి బీహార్ నుంచి,ఇంకా ఇతర ఉత్తరాది రాష్ట్రాలనుంచి ఒక్కటే ప్రశంసలు. బీట్ గురించి,సాంగ్ తీసిన విధానం గురించి...యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ల గురించి ప్రశంసలు.అదిరా బాబు నిజమైన విజయం. ఆస్కార్ తో సమానమైన విజయం.



దక్షిణాది రాష్ట్రాల వారి ప్రశంసలు సరేసరి. వీడియో తీసినందుకు పెద్ద ఖర్చు ఏముండదు అనుకుంటున్నా.అంటే సినిమా తో పోల్చితే సుమా.కాని తెలంగాణా యాస లో ఉరికే జలపాతం లా సాగే ఆ పాట భాషా,ప్రాంతాల్ని దాటి సంగీత అభిమానుల హృదయాల్ని అలరించింది.పాటపాడిన భోగరాజు మోహన ఉర్రూతలూగించింది.పాట రాసినవారి పేరు,సంగీతం కంపోజ్ చేసిన వారి పేరు వీడియో లో పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. వాళ్ళ కృషి అభినందనీయం,వారు అందరికీ తెలియాలి.   

ఇలా చిన్న గా మొదలుపెట్టి ప్రతిభ తో అనేకమంది ని ఆకట్టుకునే అవకాశాన్ని యూట్యూబ్ ఇచ్చింది. అందుకు ధన్యవాదాలు.ఇలా చాలా మంది ఇతర భాషలనుంచి వచ్చి దేశం యావత్తు ని ఊపేస్తున్నారు. ఈనాటి తరం గత తరాల వారితో పోలిస్తే ఎంతో అదృష్టవంతులు. చిన్న చిన్న గ్రామాల కి వెళ్ళి వాటి ప్రత్యేకతల గురించి వీడియోలు తీసి వదులుతున్నారు.అవి ఎంతో జనాదరణ పొందుతున్నాయి.అంటే ప్రజల్లో కూడా అప్పటితో పోలిస్తే విప్లవాత్మకమైన మార్పు వచ్చింది.ముఖ్యంగా అభిరుచి పరం గా.ఎంతైనా ఆహ్వానించదగ్గ విషయం గా చెప్పాలి దీన్ని.