Pages

18, డిసెంబర్ 2025, గురువారం

ఎంబసీ, హై కమీషన్, కాన్సులేట్ వీటి మధ్య తేడా ఏమిటి ?


మనం తరచుగా ఎంబసీ, హై కమీషన్ ఇంకా కాన్సులేట్ కార్యాలయం అనే మాటల్ని వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా విదేశాల్లో ఉండే రాయబార కార్యాలయాలకి ఉండే పేర్లు అని మనం భావిస్తాం. మరి అయితే వాటి మూడిటి మధ్య తేడా ఏమీ లేదా అంటే ఉన్నది. కామన్ వెల్త్ దేశాల్లో ఉండే మన రాయబార కార్యాలయాల్ని ఎంబసీ అని పిలిస్తాము. అలాగే నాన్ కామన్ వెల్త్ దేశాల్లో ఉండే వాటిని హై కమీషన్ అని వ్యవహరిస్తాము. పై రెండు కార్యాలయాలు చేసే పని ఒకటే.వివిధ రంగాల్లో మన దేశ ప్రయోజనాల్ని ఇతర దేశాల్లో సమ్రక్షించడం, ఆయా దేశాల్లో మన దేశ పౌరుల కి అవసరం ఏర్పడినపుడు సాయం చేయడం, ఇతర దేశాలతో అనుసంధానం గా పని చేయడం ఇలాంటివి చేస్తుంటాయి.

ఇక కాన్సులేట్ కార్యాలయం అంటే దిగువ స్థాయి రాయబార కార్యాలయాలు వంటివి. ఉదాహరణకి అమెరికా కి న్యూ ఢిల్లీ లోని చాణక్యపురి లో ఎంబసీ ఉన్నది. దానికి అనుసంధానంగా హైదరా బాద్, చెన్నై,ముంబాయ్,కోల్కతా నగరాల్లో కూడా కాన్సులేట్ కార్యాలయాలు ఉన్నాయి.పాస్ పోర్ట్,వీసాలు,విదేశీ వ్యాపార కార్యకలాపాలు ఇంకా రకరకాల విషయాలకి సంబంధించి వత్తిడిని తట్టుకుని పనిచేయడానికి రాజధాని నగరాలు కానప్పటికీ ఆయా ముఖ్య నగరాల్లో ఆ బ్రాంచ్ ఆఫీస్ లు లాంటివి పెట్టారన్నమాట. అయితే ప్రతి దేశానికి ఒకటి కంటే ఎక్కువ ఎంబసీ లు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు.

నిజానికి మన దేశానికి ప్రపంచం లోని అన్ని దేశాల్లో రాయబార కార్యాలయాలు లేవు. కేవలం 150 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. సోమాలియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, నౌరు, కాంగో,ఎస్తోనియా,అల్బేనియా , జార్జియా ఇలాంటి చాలా  దేశాల్లో మనకి రాయబార కార్యాలయాలు లేవు. అలాంటప్పుడు వ్యవహరం జరపడానికి వాటికి దగ్గరలోని మన దేశ ఎంబసీలు సహకారం అందిస్తాయి. రాయబార కార్యాలయాల్ని నడపడానికి చాలా ఖర్చులు అవుతాయి. కనుక అవసరం లేని దేశాల్లో అవి ఉండవని చెప్పాలి. రాజకీయంగా, వాణిజ్యపరంగా,వ్యూహాత్మకంగా అవసరమైన దేశాల్లో మాత్రమే పూర్తి సిబ్బంది తో పని చేస్తుంటాయి.

రాయబార కార్యాలయాలు ఇంటెలిజెన్స్ కార్యకలాపాలు చేపట్టడం ఈ రోజుల్లో మనం చదువుతూనే ఉన్నాం. అలాంటి పరిణామాల నేపథ్యం లో రాయబార కార్యాల సిబ్బందిని బహిష్కరించడం కూడా జరుగుతుంది. మిత్ర దేశాల లో రాయబార సిబ్బందికి పెద్ద ప్రమాదం ఉండదు కాని ఉద్రిక్త సంబంధాలు ఉన్న దేశాల్లో దాడులు జరగడం కద్దు.వీటికి సంబంధించి అంతర్జాతీయ చట్టాలు ఉన్నా రక్షణ లేని సందర్భాలు ఉన్నాయి. ప్రపంచం అంతా కుగ్రామం అయిపోయిన ఈ కాలం లో టూరిస్టులు అనేకమంది వివిధ దేశాలకి క్యూ కడుతుండటం తో ఇన్నాళ్ళపాటు ఏమీ పట్టనున్న కొన్ని దేశాలు కూడా ఇతర దేశాల్లో తమ రాయబార కార్యాలయాల్ని తెరుస్తున్నాయి. 


----- మూర్తి కెవివిఎస్              

5, అక్టోబర్ 2025, ఆదివారం

రస్కిన్ బాండ్ రాసిన ఓ చక్కని పుస్తకం

 రస్కిన్ బాండ్ రాసిన ద బ్లూ అంబరెల్ల అనే పుస్తకాన్ని చాలా వేగంగా చదివిన పుస్తకం గా చెప్పాలి. దీనికి రెండు ప్రధాన కారణాలు. బాండ్ యొక్క రచనలు మన బాల్యాన్ని కళ్ళ ముందు చూపుతాయి. అదే సమయం లో కథ నడిపే విధానం చాలా సహజంగా ఉంటుంది. ప్రకృతి వర్ణనలు ఎంతో గమనించితే తప్పా అంత అందంగా రాయలేరు.ముఖ్యంగా హిమాలయాల పర్వతాల కి చేరువ లో ఉన్న గ్రామాలు అక్కడి జీవితం మనకి అర్ధమవుతుంది. నిజానికి ఈ పుస్తకం పేజీల పరంగా చూస్తే చిన్నది.కానీ ఇందులోని పాత్రలు చదివిన తర్వాత చాలా రోజుల వరకు గుర్తుండిపోతాయి. బిన్యా,బిజ్జూ,రాం భరోసా,రాజారాం ప్రధాన పాత్రలు. ఈ కథ గఢ్వాల్ కొండ ప్రాంతం లోని ఓ గ్రామం లో నడుస్తూంది.


ఆ గ్రామం లో ఈ రకమైన అందంగా ఉండే గొడుగు ఎవరివద్దా లేదు. దానితో ప్రతి ఒక్కరు దానికేసి చూస్తుంటారు.బిన్యా ఎంతో అపురూపంగా దాన్ని కాపాడుకుంటూంది. తన ఫ్రెండ్స్ కి మాత్రం కాసేపు పట్టుకుండానికి ఇస్తుంది. నీలు ని మేపడానికి అడివి కి వెళ్ళినపుడు కూడా ఈ గొడుగు ఉండవలిసిందే. అలాంటి సమయం లో ఈ గొడుగు గాలీ దుమ్మూ లేచినపుడు కొట్టుకు పోయి పొడవైన గుట్ట మీద పడిపోతుంది.మొత్తానికి ఎంతో కష్టపడి గొడుగు ని దక్కించుకుంటుంది.

అలాంటి గొడుగు మీద రాం భరోసా అనే దుఖాణదారుని కళ్ళు పడతాయి. ఎన్నో రకాలుగా ఆశ చూపించి ఆ గొడుగు ఇమ్మన్నా బిన్యా ఇవ్వదు. అతని దగ్గర పని చేసే రాజారాం అనే కుర్రాడు బిన్యా పొలం పని లో ఉండగా దాన్ని కొట్టేస్తాడు.

అదే సమయం లో బిన్యా వాళ్ళ అన్న బిజ్జూ వీడిని పట్టుకుని నాలుగు పీకి గొడుగు తీసుకుంటాడు. రాం భరోసా నే ఈ సంఘటన వెనక ఉన్నదని గ్రామం అంతా తెలిసిపోతుంది. దాంతో ఈ వ్యాపారి దుఖాణానికి కొనడానికి గ్రామస్తులు ఎవరూ రారు. దాంతో జాలిపడి బిన్యా,బిజ్జూలు ఏ విధంగా మళ్ళీ అతనికి సాయం చేశారు అన్నది సస్పెన్స్. 

దానితో ఆ వ్యాపారి ఎంతో సంతోషించి వీళ్ళద్దరినీ ఎలా చక్కగా చూసుకున్నాడన్నది చివరిలో మనకి తెలుస్తుంది. కథ అంతా బోరు కొట్టకుండా ఏకబిగిన చదవాలనిపిస్తుంది. హిమాలయ గ్రామాల్లోని పూల చెట్లు,ఊరిలో ఉండే మొక్కలు ఇలాంటివి అన్నీ సందర్భానుసారంగా మనకి తెలుస్తాయి.అర్చనా శ్రీనివాసన్ వేసిన బొమ్మలు ఎంతో హాయిగా ఉన్నాయి.   

బిన్యా అనే చిన్న అమ్మాయి. సుమారు పదకొండు ఏళ్ళు. ఆమెకి బిజ్జూ అనే అన్నయ్య , వాడికి ఇంకో రెండేళ్ళు ఎక్కువ. వాళ్ళు పుట్టినప్పుడు ఎలాంటి తారీకులు నమోదు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులకి చదువులేదు కదా.వారి కుటుంబానికి కొద్ది భూమి ఉంటుంది.కొన్ని ఆవులు ఉంటాయి.వాటి మీదనే వారి జీవనం సాగుతుంది.ఒక ఆవు పేరు నీలు. ఆ ఆవు ని బిన్యా అడవి లో మేపుతుండగా , ఢిల్లీ నుంచి ఓ కుటుంబం ఆ అడివి లోకి వచ్చి విహార యాత్ర చేస్తుంటారు. 

దాంట్లో ఒకరి దగ్గర చక్కని నీలం రంగు లో ఉన్న గొడుగు కనబడుతుంది. అది బిన్యా కి ఎంతో నచ్చుతుంది. అలాగే ఆశ గా చూస్తూ నిలబడగా , విహార యాత్ర కి వచ్చిన వాళ్ళు ఆమెకి దాన్ని బహూకరిస్తారు. ఆ అమ్మాయికి ఎంతో ఆనందం కలిగి ,ఆమె దగ్గర ఉన్న పులిగోరు తో చేసిన వస్తువు ని ఇస్తుంది.       

 ఆ గ్రామం లో ఈ రకమైన అందంగా ఉండే గొడుగు ఎవరివద్దా లేదు. దానితో ప్రతి ఒక్కరు దానికేసి చూస్తుంటారు.బిన్యా ఎంతో అపురూపంగా దాన్ని కాపాడుకుంటూంది. తన ఫ్రెండ్స్ కి మాత్రం కాసేపు పట్టుకుండానికి ఇస్తుంది. నీలు ని మేపడానికి అడివి కి వెళ్ళినపుడు కూడా ఈ గొడుగు ఉండవలిసిందే. అలాంటి సమయం లో ఈ గొడుగు గాలీ దుమ్మూ లేచినపుడు కొట్టుకు పోయి పొడవైన గుట్ట మీద పడిపోతుంది.

మొత్తానికి ఎంతో కష్టపడి గొడుగు ని దక్కించుకుంటుంది.అలాంటి గొడుగు మీద రాం భరోసా అనే దుఖాణదారుని కళ్ళు పడతాయి. ఎన్నో రకాలుగా ఆశ చూపించి ఆ గొడుగు ఇమ్మన్నా బిన్యా ఇవ్వదు. అతని దగ్గర పని చేసే రాజారాం అనే కుర్రాడు బిన్యా పొలం పని లో ఉండగా దాన్ని కొట్టేస్తాడు.

అదే సమయం లో బిన్యా వాళ్ళ అన్న బిజ్జూ వీడిని పట్టుకుని నాలుగు పీకి గొడుగు తీసుకుంటాడు. రాం భరోసా నే ఈ సంఘటన వెనక ఉన్నదని గ్రామం అంతా తెలిసిపోతుంది. దాంతో ఈ వ్యాపారి దుఖాణానికి కొనడానికి గ్రామస్తులు ఎవరూ రారు. దాంతో జాలిపడి బిన్యా,బిజ్జూలు ఏ విధంగా మళ్ళీ అతనికి సాయం చేశారు అన్నది సస్పెన్స్. 

దానితో ఆ వ్యాపారి ఎంతో సంతోషించి వీళ్ళద్దరినీ ఎలా చక్కగా చూసుకున్నాడన్నది చివరిలో మనకి తెలుస్తుంది. కథ అంతా బోరు కొట్టకుండా ఏకబిగిన చదవాలనిపిస్తుంది. హిమాలయ గ్రామాల్లోని పూల చెట్లు,ఊరిలో ఉండే మొక్కలు ఇలాంటివి అన్నీ సందర్భానుసారంగా మనకి తెలుస్తాయి.అర్చనా శ్రీనివాసన్ వేసిన బొమ్మలు ఎంతో హాయిగా ఉన్నాయి.   

( A book I have read the fastest)

22, సెప్టెంబర్ 2025, సోమవారం

మళయాళ చిత్రసీమ లో కేవలం ఇద్దరే ఆ అవార్డ్ పొందారంటే చిత్రమే!


 ప్రముఖ మళయాళ నటుడు మోహన్ లాల్ కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. ఈ నెల 20 తేదీన 2023 ఏడాదికి గాను ఆయనకి ఈ అవార్డ్ ని ప్రదానం చేయనున్నట్లు కేంద్రప్రభుత్వం ప్రకటించింది. విచిత్రం ఏమిటంటే ఇప్పటిదాకా మళయాళ చిత్రసీమ లో కేవలం ఇద్దరు మాత్రమే ఈ సినిమా రంగానికి చెందిన అత్యున్నత అవార్డ్ ని పొందారు. మొదటి వ్యక్తి ప్రఖ్యాత మళయాళ దర్శకుడు ఆడూర్ గోపాల కృష్ణన్ కాగా రెండవ వ్యక్తి ప్రస్తుతం మోహన్ లాల్. అనేకమంది ఉద్ధండులైన దర్శకులు, నటులు ఉన్న ఆ చిత్రసీమ లో కేవలం ఇద్దరు మాత్రమే పొందడం చాలామందిని ఆశ్చర్యపరిచే అంశం.

ఈ రోజు ఫాల్కే పురస్కారం అందుకోబోతున్న మోహన్ లాల్ తన 60 ఏళ్ళ జీవితం లో 350 కి పైగా సినిమాల్లో, అదీ వివిధ భాషలకి చెందిన సినిమాల్లో నటించారు. తమిళ, మళయాళ ఇంకా ఇతర సినీ అభిమానులు ఓ వైపు పొగడ్తలతో ముంచెత్తుతుండగా, మరో వైపు ఆయన్ని విమర్శ చేస్తున్నవారూ ఉన్నారు. 74 ఏళ్ళ మమ్మూట్టి కి దాదా సాహెబ్ ఫాల్కే ఎప్పుడో ఇవ్వవలసి వుందని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో బాధ వ్యక్తం చేస్తున్నారు. అయితే మమ్మూట్టి మటుకు మోహన్ లాల్ కి ఫాల్కె రావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ మెసేజ్ చేశారు. తమిళ ప్రేక్షకులు కమల్ హాసన్ కి ఈ అవార్డ్ ఇంకా ఇవ్వకపోడం దారుణం అని పోస్టులు పెడుతున్నారు.  

మోహన్ లాల్ విభిన్న పాత్రలు పోషించి తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. జాతీయ స్థాయి లో ఉత్తమ నటుడిగా నాలుగుసార్లు అవార్డులు అందుకున్నారు. పద్మశ్రీ,పద్మవిభూషణ్ కూడా అందుకున్నారు. ఇండియన్ ఆర్మీ ఆయనకి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదా ని 2009 లో ప్రదానం చేసింది. ఈ గౌరవాన్ని పొందిన ఏకైక దక్షిణాది నటుడు మోహన్ లాల్. కాలడి యూనివర్శిటి గౌరవ డాక్టరేట్ ని 2010 లో ప్రదానం చేసింది. సంస్కృత భాష లో నాటకాలు వేసి ఆయన ఆ భాషకి చేసిన సేవ కి గాను ఆ గౌరవం దక్కింది. కొంతకాలం సంస్కృత భాష లో వార్తలు కూడా చదివారు.

మోహన్ లాల్ నటించిన 350 కి పైగా సినిమాల్లో తప్పనిసరిగా చూడవలసిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి. మళయాళం లో వచ్చిన తన్మాత్ర, వానప్రస్థం, భ్రమరం, కిరీడం, బాలెట్టాన్, కిరీడం, భరతం వంటి సినిమాలు ఆయన నటనా జీవితం లో ఆణిముత్యాలు లాంటివి. దృశ్యం పేరు తో వచ్చిన రెండు సినిమాలు అబాలగోపాలాన్ని అలరించడమే గాక,తెలుగు ఇంకా హిందీ లో కూడా రీమేక్ అయ్యాయి.ప్రస్తుతం దృశ్యం కి మూడవ ఎపిసోడ్ తయారవుతోంది. అదీ కూడా హిట్ అయి అందర్నీ అందర్నీ అలరించాలని కోరుకుందాం.      

22, జూన్ 2025, ఆదివారం

దక్షిణ కొరియన్లు భారతీయుల్ని చిన్నచూపు చూస్తున్నారా ?


దక్షిణ కొరియన్లు భారతీయుల్ని చిన్నచూపు చూస్తున్నారా ? 

-------------------------------------------------------------------------

 ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. దక్షిణ కొరియా దేశస్తులు భారతీయుల్ని చిన్న చూపు చూస్తున్నారని, వారు ఆసియా వాసులే అయినప్పటికీ మనల్ని అలా ట్రీట్ చేయడం ఏమిటి అని ఎవరికైనా కోపం వస్తుంది. మన దేశం లో వాళ్ళ పరిశ్రమలు ఉన్న చోట వాళ్ళ క్యాంటిన్ ల లోకి కూడా అడుగుపెట్టనివ్వరని కూడా చదివాము. ఈ మాట నిజమే అయినప్పటికీ దీని వెనుక కొన్ని నిజాలు ఉన్నాయి. అవి మనం అర్థం చేసుకోవాలి. 50 వ దశకం వరకు పెద్దగా అభివృద్ధి చెందని ఈదేశం, ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రగతి పథం లో పయనిస్తూ ఎల్.జి., హ్యూండాయ్, సాం సంగ్, పోస్కో లాంటి వ్యాపార దిగ్గజాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ముందుకు సాగిపోతోంది.

అంతేకాదు కొరియన్ సినిమాలు, డ్రామాలు, మ్యూజిక్ ఈ మధ్య మన దేశం లో బాగా ఆదరణ పొందుతున్నాయి. దక్షిణ కొరియా దేశం మొత్తం మీద ఒకే భాష,ఒకే సంస్కృతి లా ఉంటుంది.మొన్న మొన్నటి దాకా ఇంగ్లీష్ భాష కూడా ఎవరికీ రాదు. ఈ తరం వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పోటీ పడుతున్నారు. దాని కోసం ఇబ్బడి ముబ్బడి గా సంస్థలు ఆవిర్భవించి డబ్బు చేసుకుంటున్నాయి. మరి మీరు ఇండియన్స్ ని చిన్న చూపు ఎందుకు చూస్తున్నారు, రంగు తక్కువ అని అహంకారం ప్రదర్శిస్తున్నారా అని మన వాళ్ళు అడిగితే వాళ్ళ సమాధానం ఏమిటంటే , మా దేశస్తులు తరతరాలుగా విదేశాలు వెళ్ళింది తక్కువ. మా కంటే భిన్నంగా ఉన్నవారిని ఎలా ట్రీట్ చేయాలి అనేది తెలియదు.

వియాత్నం , ఫిలిప్పిన్స్ వాళ్ళని కూడా చిన్న చూపు చూస్తారు ,ఎందుకంటే ఆర్ధికంగా వాళ్ళు వెనకబడి ఉన్నందువల్ల అలా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నవాళ్ళలో అలా ఎవరూ లేరు. ఉంటే గింటే చాలా తక్కువ. ఇండియన్స్ చాలా కాలం నుంచి విదేశాలకి వెళ్ళడం,ఇంగ్లీష్ నేర్చుకొని ఎక్కువ బయటి ప్రపంచం తో మెలగడం ఇవన్నీ ఉన్నాయి,కానీ మా దక్షిణ కొరియా వాళ్ళకి అలాంటి కోణం లేదు. నిజానికి మాకు ఇండియా గురించి చాలా తక్కువ తెలుసు. గత తరాల వాళ్ళ విషయానికొస్తే మరీ దారుణం. బుద్ధుడు , యోగా లాంటి ఏవో కొన్ని అంశాలు తప్పా ఇంకేమీ తెలియదు. చైనా , జపాన్ వాళ్ళ ని కూడా ఇండియన్స్ మాదిరిగానే చూస్తాం అంటూ దక్షిణ కొరియా వ్యక్తి చెప్పుకొచ్చాడు.         

 ప్రస్తుతం దక్షిణ కొరియా దేశం లో యువత కి ప్లాస్టిక్ సర్జరీ మోజు బాగా ముదిరింది. ఏ మాత్రం అవయవం బాగా లేదనుకున్నా ఆపరేషన్ తో సరిజేయించుకుంటున్నారు. సియోల్ లో ఈ కాస్మటిక్ సర్జరీ వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా ఉన్నది. ప్రపంచం లో అతి తక్కువ ఒబేసిటి ఉన్న జనాలు ఈ దేశం లోనే ఉన్నారు.శరీరం గురించి అంత శ్రద్ధ అన్నమాట. మగవాళ్ళు గానీ ఆడవాళ్ళు గానీ మేకప్ లేనిదే బయటకి రారు. బాగా పరిశీలించి చూసినట్లయితే సాంస్కృతికంగా మన దేశానికి దక్షిణ కొరియా కి దగ్గరి బాంధవ్యం ఉన్నది. 

తరతరాలుగా ఇక్కడ ఆచారం ఏమిటంటే తమ కన్నా పెద్ద వయసు వాళ్ళకి మర్యాద ఇచ్చి మాట్లాడతారు. అందుకే ఎదుటి వారిని కలిసిన వెంటనే వాళ్ళ వయసు అడుగుతారు. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు బయట విడుస్తారు. ఏదీ ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా రెండు చేతులతో చేస్తారు. ఒక్క చెయ్యి ఉపయోగిస్తే అమర్యాద గా భావిస్తారు. పౌర్ణమి రోజున బుద్ధ జయంతి జరుపుకుంటారు. కంఫ్యూషియస్ బోధనల ప్రభావం ఎక్కువ గా ఆ సమాజం మీద ఉన్నది. 

----- మూర్తి కెవివిఎస్ 

19, మే 2025, సోమవారం

కొకైన్ తయారి లో ఆ మూడు దేశాల పాత్ర

కొకైన్ తయారి లో ఆ మూడు దేశాల పాత్ర

------------------------------------------------------

 ఈ మధ్య కాలం లో ఓ మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్ తో పట్టుబడడం తో అసలు ఈ మత్తు పదార్థానికి ఇంతటి అధికారం ఏమిటి మానవ దేహం మీద, అనే అనుమానం రాకమానదు. కొకైన్ డోస్ 30 నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే చాలు, రెండు లేదా మూడు నిమిషాల్లో మెదడు లో స్వైర కల్పనలు మొదలయి ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోను పోను అలవాటు ముదిరితే 1 గ్రాము వరకు ఒకే దెబ్బ లో తీసుకోగలరు. అంతకి మించి 2 గ్రాముల వరకు ఒకేసారి తీసుకుంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు.

ప్రతిరోజు 5 గ్రాముల దాకా విడతలు విడతలుగా తీసుకునే వారి శరీరం లో అనేక అవయవాలు దెబ్బతింటాయి.కిడ్నీలు, ప్రేవులు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. కేంద్ర నాడీమండల వ్యవస్థ పాడయి మానసిక భ్రాంతులు కలగడం,వణుకు రావడం,ఊపిరి పీల్చడం లో ఇబ్బందులు ఇలా ఎన్నో రుగ్మతలు వస్తాయి. సాధారణం గా కొకైన్ ని ముక్కు తో పీల్చడం ద్వారా,ఇంజెక్ట్ చేసుకోవడం ద్వారా, సిగరెట్లలో పెట్టి తీసుకుంటారు. తీసుకున్నతర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతాయి. ఆ హాయి కోసమే ముందు అలవాటయి అది ముదిరిన తర్వాత వారి జీవితం ఎలా ముగుస్తుందో తెలియని దశ కి చేరుకుంటారు.

కోకా ఆకులు నుంచి కొకైన్ ని తయారు చేస్తారు. కొలంబియా, పెరూ, బొలీవియా వంటి దేశాల్లో ఈ కోకా పంట విరివిగా పండుతుంది.మొట్టమొదట స్థానికులు అజీర్ణానికి, చురుకు గా ఉండటానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు.అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త అల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకుల్ని నమలగా విచిత్ర అనుభూతి కలిగింది. దాంతో ఆయన కోకా ఆకుల్లోనుంచి రసాన్ని పిండి , దానికి కొన్ని రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860 లో తయారు చేశాడు.ఆ విధం గా ఇపుడు మనం చూసే కొకైన్ పుట్టింది. ఫ్రెంచ్ రసాయన శాస్రవేత్త ఏంజిలో మరియాని దీనితో ఓ టానిక్ ని తయారు చేశాడు.

మొదట్లో కోకా కోల పానీయం లో కూడా వాడేసిన కోకా ఆకుల్ని వినియోగించేవారు.1920 తర్వాత నుంచి దీన్ని నిలిపివేశారు.ఒక కిలోగ్రాం కొకైన్ తయారు చేయాలంటే వెయ్యి కిలోగ్రాముల కోకా ఆకులు కావాలి. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారు.ప్రపంచం లోని మొత్తం కొకైన్ లో 70 శాతం పైగా ఒక్క కొలంబియా లోనే తయారవుతుంది. ఆ తర్వాత స్థానం పెరూ, బొలీవియా దేశాలది. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి 400 మిలియన్ డాలర్లు ఆర్జిస్తుంది. దక్షిణ అమెరికా ఖండం లోని ఆ మూడు దేశాలు కొకైన్ ని బయటకి పంపిన తర్వాత ప్రపంచ మార్కెట్ లో దాని విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది.           

మత్తు పదార్థాలు అన్నిటిలోనూ దీనికి గల ప్రాముఖ్యత వల్ల షాంపేన్ ఆఫ్ డ్రగ్స్ అని ముద్దుగాపిలుస్తారు. 1970 వరకు కేవలం మందుల తయారీ లోనే ఎక్కువగా వాడేవారు. అమెరికా లో కొకైన్ కి లభించిన పాపులారిటీ వల్ల , ముఖ్యంగా పాప్ సంగీతకారులు, ప్రముఖులు తీసుకోవడం వల్ల మీడియా లో హైప్ వచ్చి దేశదేశాలు విస్తరించింది. ఒక దశలో అంటే 1982 ప్రాంతం లో కోటి నలభై లక్షల మంది అమెరికా లోని ప్రజలు దీనికి బానిసలయ్యారు. ప్రస్తుతం ఈ కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచం లోని చాలా దేశాలకి విస్తరించింది. వివిధ మత్తు పదార్థాల సేవనం లో ఉత్తర్ ప్రదేశ్, బీహార్,కేరళ, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర వరుసగా ముందంజ లో ఉన్నాయి. 

----- మూర్తి కెవివిఎస్ 

30, ఏప్రిల్ 2025, బుధవారం

నారాయణింటె మూణ్ణాన్ మక్కల్ (మళయాళ సినిమా రివ్యూ)

 


ఈ సినిమా ప్రస్తుతం ప్రైం అమెజాన్ లో ఉంది. ఈ సినిమా టైటిల్ అర్థం ఏమిటంటే నారాయణి యొక్క ముగ్గురు కుమారులు అని. చాలా వాస్తవికంగా, రోజువారీ మన చుట్టూ జరిగే సంఘటనలతో మంచి కథ అల్లుకుని ఒక దృశ్యకావ్యంగా చిత్రీకరించారు. ఒక చక్కని గ్రామం. తెలుసు కదా,కేరళ గ్రామాలు పచ్చదనం తో ఎంత కనువిందుగా ఉంటాయో. అలాంటి ఓ గ్రామం లో ,కొయిలాండి అనే గ్రామం లో , నారాయణి అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె చివరి దశకి వస్తుంది.అన్నీ మంచం మీదనే అనేంత అనారోగ్యం తో ఉంటుంది.

ఆమెకి ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఆ గ్రామం లోనే ఉన్న ఆస్తిపాస్తుల్ని చూసుకుంటూ గడుపుతుంటాడు. అతని పేరు విశ్వనాథన్.తనకి భార్య, ఓ కుమార్తె ఉంటారు. రెండవ కొడుకు సేతు ,అతను అదే ఊళ్ళో కిరాణా షాపు నడుపుతుంటాడు. ఇక మూడవ కొడుకు భాస్కరన్. మతాంతర వివాహం చేసుకుని లండన్ లో సెటిల్ అవుతాడు. తల్లి కి బాగా లేకపోవడం తో ఈ ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉంటారు. ఆమె కోసమే భాస్కరన్ లండన్ నుంచి వస్తాడు.

వీరికి అంతకు ముందే దాదాపు అన్ని కుటుంబాల్లో ఉన్నట్లు చిన్న చిన్న పొరపచ్చాలు ఉంటాయి. తప్పక ఒక గూటి కింద ఉంటూంటారు. మళ్ళీ అవి సెగలు రేపుతుంటాయి.కాని రెండో కొడుకు వాటిని సరిదిద్దుతుంటాడు. భాస్కరన్ కొడుకు , విశ్వనాథన్ కుమార్తె తో ప్రేమ లో పడటం దుమారం లేపుతుంది. ఈ ఇద్దరు పిల్లలు అంతకు ముందు ఓసారి ప్రేమ లో పడి ఫెయిల్ అయి ఉంటారు. తల్లి తొందరగా మరణిస్తే తను విమానం ఎక్కొచ్చని భాస్కరన్ చూస్తుంటాడు. ఈ మధ్య కాలం లో జరిగిన సంఘటనల్ని ఫేమిలీ డ్రామా గా తీర్చిదిద్దాడు దర్శకుడు శరణ్ వేణుగోపాల్. 

ఈ సినిమా లో చెప్పుకోవలసినదేమిటంటే మన జీవితాల్లో ఎదురయ్యే వాస్తవిక ఘటనల్ని ఎలా చక్కని కథ గా మలుచుకోవచ్చు అని. ప్రత్యేకించి హీరోలు గాని విలన్లు గాని ఎవరూ ఉండరు. జీవితం లోని కొన్ని ముక్కలు ఏరి ఆసక్తిదాయకంగా మలిచారు. మళయాళీ సమాజం లోని జీవన వైఖరి ని , చక్కని లొకేషన్లు ఉన్న గ్రామం లో చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమాటోగ్రఫీ జ్యోతి స్వరూప్ పండా , సంగీతం రాహుల్ రాజ్ సినిమాకి తమ పనితనం తో నిండుతనం కలిగించారు. సేతు గా నటించిన జోజు జార్జ్ అదనం గా మార్కులు కొట్టేశాడని చెప్పవచ్చు. సూరజ్, అలెన్షియర్ లే లోపెజ్ వారి పాత్రల్ని గుర్తుండిపోయేలా నటించారు.  

--- murthy

1, ఏప్రిల్ 2025, మంగళవారం

బీహారీలు ఎందుకు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు?


బీహారీలు ఎందుకు పెద్ద ఎత్తున వలసబాట పడుతున్నారు? 

---------------------------------------------------------------------------------

 బీహార్ రాష్ట్రానికి చెందిన శ్రామికులు ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో బాగా కనిపిస్తున్నారు. మొత్తం వలస వెళ్ళిన ఆ రాష్ట్రీయులు రెండు కోట్ల డబ్భై రెండు లక్షల పై చిలుకు ఉన్నారు.ఇది 2011 గణాంకాల ప్రకారం చెబుతున్నది. అంటే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అంచనా వేయవచ్చు. బుద్దుడు జ్ఞానోదయం పొందిన భూమి,చాణక్యుడు నడయాడిన నేల,నలంద వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాలు వర్ధిల్లిన చోట ఏమిటి ఈ వైపరీత్య పరిస్థితులు అంటే అనేక కారణాలు ఉన్నాయి. వలస బాట పడుతున్న వారి లో ఎక్కువ గా అహిర్,కుర్మీ,కల్వర్,భర్,దుసాద్,నునియ, బైండ్, చమర్ వంటి సామాజిక వర్గాల వారు ఉన్నారు.

బ్రిటీష్ వారి హయాం లో వర్ధిల్లిన జమీందారీ వ్యవస్థ లో దీనికి అంకురార్పణ జరిగింది. అప్పటి జమీందారులు కింది స్థాయి లో ఉన్న రైతులకి నీటి వనరులు కల్పించడం లో గాని,పంటలు పండించే విషయం లో విత్తనాలు,పెట్టుబడి లాంటివి అందించడం చేయలేదు.క్రమేణా గ్రామీణా వ్యవస్థ కుప్ప కూలుతూ వచ్చింది. దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చిన తర్వాత కూడా సరైన ముందుచూపు ఉన్న రాజకీయ నాయకులు రాలేదు.దానికి తోడు కరుడు కట్టిన కులతత్వ ప్రయోజనాలు చూసుకునే వారి హయాం లో కింది, మధ్య తరగతి వర్గాలు దారిద్ర్యం లో కునారిల్లాయి. ధనం కోసం హత్యలు,కిడ్నాపులు చేయడం రోజువారీ కార్యక్రమాలయ్యాయి. వారందరికీ ప్రభుత్వం లోని పెద్దల ఆశీస్సులు ఉండేవి.

బీహార్ లో పరిశ్రమలు పెట్టడం అంటే కత్తి మీద సాము వంటిది. చిన్న, పెద్ద ఏ బిజినెస్ నడవాలన్నా లోకల్ మాఫియా కి రంగ్ ధారి అనే టాక్స్ చెల్లించాలి.లేకపోతే ఏ వ్యాపారాన్ని చేసుకోనివ్వరు. ఒకప్పుడు రాజ్ పుత్ ల, భూమి హార్ బ్రాహ్మణుల హవా నడిచేది. ప్రస్తుతం యాదవ్ లేదా కుర్మీ వర్గాల హవా నడుస్తున్నది. లల్లూ ప్రసాద్,నితీష్ కుమార్ వంటి వెనుకబడిన వర్గాల నేతలు ముఖ్యమంత్రులు అయిన తర్వాత కొంత మార్పు వచ్చినప్పటికీ పెట్టుబడులు మిగతా రాష్ట్రాల్లో ప్రవహిస్తున్నట్లుగా ఇక్కడ జరగడం లేదు. దానితో జీవనోపాధి కోసం ప్రజలు వలస బాట పడుతున్నారు.

కేరళ వంటి రాష్ట్రం లో ఈరోజున బీహారీలు 30 లక్షల మంది దాకా ఉన్నారు. నిర్మాణ రంగం లోనూ, ఇతర రోజువారీ పనులు చేయడం లోనూ ఉపాధి పొందుతున్నారు.అక్కడి యువత గల్ఫ్ దేశాలకి,ఇతర ప్రాంతాలకి ఎక్కువగా వెళుతుండటం తో వారి లేని లోటు ని బీహారీలు పూరిస్తున్నారు. ఉత్తర్ ప్రదేశ్,అస్సాం,ఢిల్లీ, మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్,ఆంధ్ర,తెలంగాణా రాష్ట్రాల్లోనూ గణనీయం గా ఉన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పనుల్లోకి కూడా ఆయా సీజన్ లలో వస్తున్నారు. ఒక్క హైదరాబాద్ లో 12 లక్షలమంది బీహారీలు నివసిస్తున్నారు.      

పరిశ్రమలు పెద్దగా లేకపోవడం,కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ గా వరదలు రావడం,సరైన మౌలిక వసతులు లేకపోవడం,రాజకీయాల్లో నేరస్వభావం ఎక్కువగా పెరగడం ఇలా అనేక కారణాల వల్ల చదువుకున్న వాళ్ళు , చదువుకోని వాళ్ళు కూడా రాష్ట్రం విడిచిపెట్టి వస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాల్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ప్రిపేర్ అయ్యేవారు ఎక్కువ సంఖ్య లో ఉంటారు. ఇతర రాష్ట్రాల నుంచి స్వగ్రామం వచ్చేటపుడు కూడా బీహారీలు ఒంటరిగా రారు. గుంపు గా వస్తారు. 

లేదంటే దారి కాచి దోపిడీ చేసే దొంగలు వీరు సంపాదించినదంతా తుపాకీ చూపించి దోచుకుంటారు. భూమి తగాదాల్లో ఎక్కువ మర్డర్లు,కిడ్నాప్ లు జరిగేది ఇక్కడే. డబ్బున్న కుటుంబం అని తెలిస్తే చాలు పిల్లల్ని,మహిళల్ని కిడ్నాప్ లు చేస్తారు. చాలా వరకు తగినంత సెక్యూరిటీ లేకుండా బయటకి రావడానికి సాహసించరు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తమ రాష్ట్రం కూడా అభివృద్ధి లో ముందుకు సాగాలని , శాంతి భద్రతలు మెరుగుపడాలని వలసవెళ్ళిన ఆ బీహారీలకి మాత్రం అనిపించదా? ఆ మంచి రోజులు రోజులు రావాలని ఆశిద్దాం.

----- మూర్తి కెవివిఎస్

 

16, మార్చి 2025, ఆదివారం

ఏనుగు గురించి తెలుసుకుందాం!


ఏనుగు గురించి తెలుసుకుందాం!

-------------------------------------------------------

 భూమి మీద నడిచే అతి పెద్ద జంతువు ఏది అంటే ఏనుగు అని చెప్పవలసిందే! ఎన్నో వందల ఏళ్ళ క్రితం నుంచే మనిషికి, ఏనుగు కి విడదీయరాని అనుబంధం ఉంది.ఇతిహాసాల్లో, పురాణాల్లో సైతం ప్రముఖ స్థానమున్నది.పూర్వం రాజులు గజబలం పేరిట ఏనుగుల్ని యుద్ధాల్లో వినియోగించేవారు. ఒక్క మన దేశం లోనే కాదు థాయ్ లాండ్ వంటి దేశాల్లో ఏనుగు కి ఎంతో గౌరవం ఇస్తారు. బౌద్ధ మతం లో కూడా గజరాజు కి పవిత్ర స్థానం ఉన్నది. బుద్ధుడు జన్మించడానికి కొన్ని రోజులు ముందు ఆయన తల్లిగారికి ఓ తెల్ల ఏనుగు స్వప్నం లో దర్శనమిచ్చినందున బౌద్ధ సాహిత్యం లో,శిల్పాల్లో ఏనుగు కి ఎనలేని ప్రాముఖ్యమున్నది. ఇహ మన వినాయక స్వామి గురించి తెలియనిదెవరికి? 

అటువంటి ఏనుగు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఏనుగు కి ఉండే దంతాలు నిజానికి దానికి ఉండే పండ్లు, కాకపోతే అవి పెద్దగా బయటకి వచ్చి కనబడతాయి.దానివల్ల ఆ జంతువు కి ఎన్ని ఉపయోగాలో !ఏనుగు కి మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది.మీరు అద్దం లో దాని రూపాన్ని చూపిస్తే అది తనదే అని గుర్తుపడుతుంది.కేవలం అయిదు జంతువులు మాత్రమే అలా గుర్తుపడతాయి.స్పర్శించడం ద్వారా,శబ్దం చేయడం ద్వారా మిగతా వాటితో మాట్లాడతాయి.ఏనుగులు గుంపులుగా ఉంటాయి. ఆడ ఏనుగు గుంపు కి పెద్ద గా ఉంటుంది. 14 లేదా 15 ఏళ్ళు వచ్చినతర్వాత మగ ఏనుగులు ఆ మంద కి దూరం గా వెళ్ళిపోతాయి.

ఏనుగు మెదడు అయిదు కిలోల పైనే ఉంటుంది. సాధ్యమైనంత వరకు నీటి కి దగ్గర లో నివసిస్తాయి.వాటి దంతాల కోసం చాలా కాలం నుంచి మానవుడు వేటాడుతూనే ఉన్నాడు. అడవి లో 70 ఏళ్ళ పాటు జీవిస్తుంది. తోటి ఏనుగు కి దెబ్బ తగిలినా,జబ్బు చేసినా అవి బాధపడతాయి.తమ మంద లో ఉన్న ఏనుగు ఏదైనా చనిపోతే ,ఆ ప్రదేశానికి తరచు వెళ్ళి అంజలి ఘటించినట్లు ప్రవర్తిస్తాయి. ఏనుగులు తమ పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాయి. ఏనుగు పిల్ల పుట్టిన తర్వాత మంద లో మిగతా ఏనుగులు కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. ఏనుగులు అడవి లో అయితే 200 కిలోల ఆహారం ,40 లీటర్ల నీటిని రోజూ తీసుకుంటాయి.

మూడు లేదా నాలుగు గంటల నిద్ర చాలు.అవి నిలబడి కూడా జోగుతుంటాయి. పుట్టిన అరగంట లోనే ఏనుగు పిల్ల నడుస్తుంది.కాని సరిగ్గా పాదం మోపడం,తొండం తో తినడం,నీళ్ళు తాగడం అనేవి చేయడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది.  అంటే తొమ్మిది నెలల దాకా ఆగవలసిందే. బుల్లి ఆడ ఏనుగులు ఒకదాన్ని ఒకటి తరుముకుంటూ ఆటాడుకుంటాయి. బుల్లి మగ ఏనుగులు మాత్రం ఫైటింగులు చేసుకుంటూంటాయి. అయితే మంద లోని పెద్ద ఏనుగులన్నీ వీటి మీద ఓ కన్ను వేసి ఉంచుతాయి. ఆసియా జాతి ఏనుగులు,ఆఫ్రికా జాతి ఏనుగులు అని ప్రపంచం లోని ఏనుగుల్ని రెండు రకాలుగా విడదీశారు.

మనం తరచూ ఏనుగు మనుషుల మీద దాడిచేసినట్లు వార్తల్లో చూస్తుంటాం. ఏనుగు ఆకారం లో భారీ గా ఉన్నప్పటికీ సున్నిత స్వభావం గల జంతువు. స్ట్రెస్,ఆందోళన,రక్షణ లేకపోవడం,వాటి పిల్లల కి హాని కలుగుతుందనే భావన ఇలాంటి కారణాల వల్ల ఏనుగులు మనుషుల మీద దాడి చేస్తాయి.మన ఆసియా ఖండం లోని ఏనుగుల్ని శ్రీలంక,బోర్నియా,ఇండియా,సుమత్రా రకాలుగా విభజించారు. ఆఫ్రికా ఖండం లోని ఏనుగుల్ని పొదల్లో,అడవుల్లో నివసించే రకాలుగా విభజించారు.ఆఫ్రికా ఏనుగులు నాలుగు లక్షల పదిహేనువేల దాకా ఉండగా ఆసియా రకం ఏనుగులు నలభైవేల నుంచి యాభై వేలు మాత్రమే ఉన్నాయి.

----- మూర్తి కెవివిఎస్ 

9, మార్చి 2025, ఆదివారం

పానీ పూరి కి సైతం ఓ చరిత్ర ఉంది

పానీ పూరి కి సైతం ఓ చరిత్ర ఉంది

-------------------------------------------------

 పానీ పూరి అంటే తెలియనిది ఎవరికి ? రోడ్డు పక్కన అమ్మే ఈ తినుబండారాన్ని  యువతీ యువకులు ఎంతో ఇష్టంగా లాగించేస్తుంటారు. అసలు ఈ పానీ పూరి ఎక్కడ పుట్టిందో తెలుసా, ఖచ్చితం గా దక్షిణాది లో మాత్రం కాదని చాలా మందికి తెలుసు.అవును, ఇది ఉత్తర్ ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఆవిర్భవించింది. అక్కడి జానపదులు మహా భారతం లోని కుంతీ దేవికి,ద్రౌపది కి దీని తయారీ లో చోటిచ్చారు అంటే ఈ పానీ పూరి అనేది కొన్ని వందల ఏళ్ళ నుంచే తయారింపబడుతున్నదని అర్థం. 

ఒకరోజున కుంతీ దేవి కొంత గోధుమ పిండి,చిక్కుళ్ళు,కొత్తిమీర,ఇంకా కొన్ని సుగంధ ద్రవ్యాలు కోడలైన ద్రౌపది కి ఇచ్చి పాండవులందరికి నచ్చేలా ఏదైన వంటకం చేయమన్నదట. దాంతో ఆ కోడలు ఈ పానీ పూరి ని చేయడం తో అందరికీ విపరీతం గా నచ్చడం తో , నీ ఈ వంటకం ఎప్పటికీ భూలోకం లో నిలిచిపోతుందని కుంతీ దేవి ఆశీర్వాదం ఇచ్చిందని ఉత్తరాది లో ఓ కథ ఉన్నది.

అలా ప్రయాణం మొదలు పెట్టిన పానీ పూరి ముంబాయి,ఢిల్లీ,కోల్కత,బెంగళూరు,హైదరా బాద్,అహ్మదా బాద్,పూనే ఇలా మన దేశం లో అన్ని నగరాలకి పరుగులు తీసి , అంతటితో ఆగకుండా చిన్న పట్టణాలకి ,గ్రామాలకి సైతం వ్యాపించి ఎంతోమంది కి ప్రీతిపాత్రమైన స్ట్రీట్ ఫుడ్ గా నిలిచింది. చక్కని శుభ్రమైన నీరు,తాజా ఆలు,గోధుమ పిండి,చింతపండు, ఇంకా అవసరమైన కొత్తిమీర,ఉల్లి లాంటివి వాడితే పానీ పూరి తినడానికి చాలా బాగుంటుంది. అలా కాకుండా చవక రకం వి వాడితే మటుకు రుచి లో తేడా వస్తుంది. అంతే కాదు కడుపు లో నొప్పి కూడా వస్తుంది. దీంట్లో 51 కిలోకేలరీల శక్తి ఉంటుంది.58.3 శాతం కార్బో హైడ్రేట్స్,9.3 శాతం ప్రోటీన్స్ ఉంటాయి.

చాలా రాష్ట్రాల్లో రోడ్డు పక్కనే కాకుండా హోటల్స్ లా పెట్టి కూడా అమ్ముతుంటారు. కొన్ని ప్రాంతాల్లో గోల్ గప్పా అని అంటారు. మధ్య ప్రదేశ్ లో దీన్ని ఫుల్కీ అని,అస్సాం లో పుస్కా అని, బెంగాల్ లో పుచుక అని వ్యవహరిస్తారు. బీహార్ లో మాత్రం జల్ పూరీ అంటారు.గోధుమ పిండి తో చేసిన గుండ్రటి బంతి ,దాంట్లో ఉపయోగించే ఉడికించి నలిపేసిన ఆలు ,చిన్న చిక్కుళ్ళు,తరిగిన కొత్తిమీర,ఉల్లి ఇంకా ఇతర పదార్థాలు పానీ పూరి లో ఉపయోగిస్తారు. 

దీంట్లోనూ ఎన్నో ప్రయోగాలు చేసినవారున్నారు. చిన్నా పెద్ద,పేద ధనిక అనే తేడా లేకుండా ఎంతోమంది ఈ పానీ పూరి ని లాగిస్తుంటారు. దీనివల్ల సాఫీ విరోచనం అవుతుందని ప్రతీతి. ఉత్తరాది రాష్ట్రాల్లో పెళ్ళిళ్ళ లలో ఈ తినుబండారాన్ని అతిథులకి సప్లయ్ చేస్తారు.అలాంటి కాంట్రాక్టులు పొంది ఇబ్బడి ముబ్బడిగా సంపాదించిన వ్యాపారస్తులు ఎందరో!

మహారాష్ట్ర లోని జల్నా అనే పట్టణం లో  అలాంటి ఓ వ్యాపారి కాశీనాథ్ వామన్ రావు గాలీ! ఈయన గత 18 ఏళ్ళుగా ఈ పానీ పూరి వ్యాపారం చేస్తూ కోటీశ్వరుడయ్యాడు. వ్యాపారం పెట్టిన మొదట్లో 250 రూపాయల దాకా వచ్చేవి. క్రమేణా నాణ్యమైన వస్తువుల్ని ఉపయోగిస్తూ, ప్రయోగాలు చేస్తూ కష్టమర్లని ఆకట్టుకున్నాడు.అంతే గాక ఆ చుట్టుపక్కల ఎక్కడ పెళ్ళి ఉన్నా ఈయనే పానీపూరి కాంట్రాక్ట్ తీసుకుంటాడు. 

ఈయన గూర్చి ఎన్నో జాతీయ పత్రికల్లో కథనాలు వచ్చాయి. కాబట్టి పానీ పూరి ని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే! రుచికరం గా చేయాలే గాని కష్టమర్ల రద్దీ మామూలుగా ఉండదు. ఆ విషయం మనకి రోడ్ల పక్కన కొన్ని పానీ పూరి బండ్లని చూస్తుంటేనే తెలిసిపోతుంది. 

----- మూర్తి కెవివిఎస్ 

20, ఫిబ్రవరి 2025, గురువారం

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

కాకి ని తక్కువ అంచనా వేస్తున్నారా ?

-------------------------------------------------


 కాకి ని చూడని వారు అంటూ బహుశా ఎవరూ ఉండరు. కాకి మీద ఎన్నో సామెతలు ఉన్నాయి. ఆ పక్షి మన పిట్టగోడ మీద నుంచి అరిస్తే చాలు ఈరోజు మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తున్నట్లు భావిస్తాం. అంతే కాదు,పితృ దేవతలకి మనకి సంధానకర్త గా అనుకోవడం కద్దు. మనం పెట్టిన పిండం కాకి ముట్టకపోయినట్లయితే పై లోకం లో ఉన్న పెద్దలు మనపై కోపం గా ఉన్నారేమో అనుకుంటాం. ఇవన్నీ నిజమా,కావా అన్నది అటుంచితే కాకి తో మానవుడి జీవితం ఎంతగా పెనవేసుకుపోయిందో ఈ ఉదంతాలు తెలుపుతాయి. మరి ఇంతటి ప్రాముఖ్యత గల ఆ జీవులు గూర్చి కొంతైన తెలుసుకోవాలి. కాకులు మంద లోనూ, ఒంటరి గానూ జీవిస్తాయి. వీటి జీవిత కాలం రమారమి ఇరవై ఏళ్ళు.

ఇవి మనుషుల మొహాల్ని బాగా గుర్తుంచుకోగలవు. దాదాపు అయిదేళ్ళ పాటు గుర్తుంచుకుంటాయంటే ఆశ్చర్యం గా లేదూ!ఏడు ఏళ్ళ పిల్లలకి ఉండేంత తెలివి వీటికి ఉంటాయి.అంటే ముఖ్యం గా సమస్య ని పరిష్కరించుకోవడం లో,కమ్యూనికేట్ చేయడం లో కాకి కి ఉండే నైపుణ్యం ఆ స్థాయి లో ఉంటుంది. దాని మెదడు లో కూడా మనకి మల్లే  చిక్కగా అల్లుకుని ఉండే న్యూరాన్లు ఉంటాయి. మనుషులు చేసే మంచి పనులు,చెడ్డ పనులు కూడా అవి గుర్తు పెట్టుకోగలవు. అంటే కాకి కి మీరు అన్నం పెట్టినా,ప్రేమ గా చూసినా అవి మిమ్మల్ని చాలా కాలం గుర్తుంచుకుంటాయి. మీకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నిస్తాయి.

మీరు గనక వాటి పిల్లల కి రాళ్ళు వేసినా లేదా వాటి గూడు కి దగ్గరగా వెళ్ళినా, పాడు చేసినా మిమ్మల్ని గుర్తు పెట్టుకుని తగిన గుణపాఠం కూడా చెబుతాయి. అప్పుడప్పుడు పేపర్ల లో చదువుతుంటాం. కాకి పగబట్టి వేధిస్తున్నదని,బయటకి వచ్చినప్పుడల్లా కాళ్ళతో నెత్తి మీద తన్ని పోతున్నాయని ఆవేదన తో ఆత్మహత్య చేసుకున్నవాళ్ళు కూడా ఉన్నారు.   

మరి అలాంటి సమయం లో ఏం చేయాలి అంటే మనం ఉండే ప్రదేశాన్ని గాని, ఊరిని గాని మార్చడమే చేయగల పని. అంతే తప్పా వేరే దారి లేదు. ఒక్కోసారి కాకులు బాగా అరుస్తుంటాయి. రొద పెడుతుంటాయి. వాటిలో వాటికి కోపం వచ్చినప్పుడు  లేదా ఇతర సంగతుల్ని కమ్యూనికేట్ చేసుకోవడానికి అలా అరిచి గోల చేస్తుంటాయి. రాత్రి పూట ఆలశ్యంగా గూళ్ళకి వచ్చిన కాకులు చెట్టు కి కింద ఉన్న కొమ్మల మీద కి వెళ్ళవలసిందిగా మిగతా వాటిని అడుగుతుంటాయి.అవి మనకి గోల గా అనిపించడం సహజమే.

సాధారణం గా కాకులు మర్రి చెట్ల మీద,ఇతర పెద్ద చెట్ల మీద, తోటల్లో నివసిస్తాయి.పండ్లను,చిన్న పురుగుల్ని,ధాన్యాల్ని,చేపల్ని తింటాయి. కోడి పిల్లల్ని ఎత్తుకుపోతుంటాయి. ఇతర పక్షుల గూళ్ళని పాడు చేసి వాటి గుడ్లని కూడా తినేస్తాయి.మనం వాటికి ఏదైనా ఆహారం వేసినా గుర్తు పెట్టుకుని అవి మనల్ని విష్ చేస్తాయి.అయితే వాటి భాష మనం అర్థం చేసుకోలేము కనక పట్టించుకోము. ఏ కాకి అయినా మనల్ని చూసి తల ని బౌ చేసినట్లుగా ఊపితే థాంక్యూ అని అర్థం అన్న మాట. అంతే కాదు, వాటికి బాగా నచ్చినట్లయితే కొన్ని బహుమతుల్ని కూడా మనకి ఇస్తుంది. రంగు రంగుల చిన్న రాళ్ళు,మెరిసే ఆకులు ఇలాంటి వాటిని మనకి దగ్గర్లో పారేసి పోతుంది. చూశారా, మనం రోజూ చూసే కాకి వెనుక ఎంత కథ ఉన్నదో !     


19, జనవరి 2025, ఆదివారం

Game Changer సినిమా గురించి రెండు ముక్కలు


 Game changer  ఏం చేంజ్ చేశాడో అని వెళ్ళాను. తెలుగు సినిమా కథ పెద్దగా ఏం మారలేదు. కాకపోతే పొలిటికల్ మాయా మంత్రాలు ,వాటిని తెలివి గా తనకి అనుకూలంగా మార్చుకునే బ్యూరోక్రాట్. అసలు ఇది ఇప్పట్లో సాధ్యమా ? మనం చూస్తూనే ఉన్నాం...ఎంత గొప్ప సివిల్ సర్వెంట్ అయినా రాజకీయ వ్యవస్థ కి మడుగులు ఒత్తవలసిందే లేదా వాళ్ళని జైల్లోకి పంపించి లేదా కేసుల్లో ఇరికించే రోజులు ఇవి. ఎన్ని రాష్ట్రాల్లో చూడటం లేదూ? అలాంటిది ...కొద్దిగా అయినా వాస్తవానికి దగ్గరగా ఉండద్దా..?

సినిమా ని సినిమా గా చూడాలి.ఈకలూ పీకలూ ఇలా లాగితే ఎట్లా అనేవాళ్ళూ మనపక్కనే ఉంటారు. అలా చూస్తూ పోతే బాగా డబ్బులు ఖర్చు పెట్టి పాటల్ని రిచ్ గా తీసిన సినిమా గా తోచింది. ఒక్క పాటా గుర్తు ఉండదు.అది వేరే మాట.ఈ బోటి దానికి కార్తీక్ సుబ్బరాజ్ కథ,శంకర్ డైరెక్షన్ ఏంటో వాళ్ళ గత సినిమాలకి దీనికీ పొంతనే లేదు. హీరోయిన్ అందాల ఆరబోత షరా మామూలే. మామూలు మషాళా సినిమా కొద్ది పాటి తేడాలతో, అని చెప్పాలి.

ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు.ఇంతే సంగతులు.చిత్తగించవలెను.     

13, జనవరి 2025, సోమవారం

థాయ్ లాండ్ లోని మరో కోణం

 థాయ్ లాండ్ లోని మరో కోణం


ఇటీవల థాయ్ లాండ్ వెళ్ళే పర్యాటకులు బాగా పెరిగారు. గత ఏడాది మన దేశం నుంచి 12,55,358 మంది ఆ దేశాన్ని సందర్శించారు.ఆ దేశం లో లభించే విహార,వినోద కార్యక్రమాలు నచ్చడం తో వెళ్ళిన వాళ్ళే వెళుతుండడం గమనించవచ్చు. చక్కని బీచ్ లు, రాత్రి పూట విందులు,అబ్బురపరిచే గతకాలపు నిర్మాణాలు ఇలాంటివి అన్నీ ఆ దేశానికి వెళ్ళేలా చేస్తున్నాయి. అన్నిటికీ మించి అందర్నీ నవ్వుతూ పలకరించే థాయ్ ప్రజల స్వభావం మరింతగా ఆకట్టుకునే అంశం. మన గోవా లో జరిగే టూరిస్టుల దోపిడి అక్కడ లేదు.టాక్సీలు,హోటల్స్ ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచకుండా అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.దానివల్ల కూడా మన వాళ్ళు థాయ్ లాండ్ వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఆ దేశం 59.8 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని టూరిజం వల్ల పొందగలిగింది.


పట్టాయ, ఫుకెట్, బ్యాంకాక్ నగరాలు అనేక సౌకర్యాల్ని టూరిస్ట్ లకి అందిస్తున్నాయి. పట్టాయ లో 24 గంటలు సందడిగానే ఉంటుంది. నిద్రపోని ప్రదేశం అని దీన్ని పిలుస్తారు.ఫుకెట్ గూర్చి చెప్పాలంటే అందమైన బీచ్ లు,సాహసోపేత క్రీడలకి నిలయం. ఇంకా కొన్ని ఆసక్తికరమైన పట్టణాలున్నాయి. మన దేశం నుంచి రమారమి ఫ్లైట్ ద్వారా నాలుగున్నర గంటల ప్రయాణం ,కనుక ఏ మాత్రం ఖాళీ దొరికినా చాలామంది వెళ్ళివస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే థాయ్ లాండ్ కి మన దేశానికి ఉన్న మరో కోణం ఏమిటంటే ఎన్నో వందల ఏళ్ళ నుంచి ఉన్న సాంస్కృతిక అనుబంధం. దీన్ని మరి ఎంత మంది పట్టించుకుంటున్నారో తెలియదు గానీ కొన్ని విశేషాలు ఇక్కడ చెప్పక తప్పదు.


థాయ్ లాండ్ రాజవంశం ఇప్పటికీ తాము రాముని వారసులు గా పరిగణించుకుంటుంది. రామా అనే బిరుదు తో వారి కి అభిషేకం జరుగుతుంది. ప్రస్తుతం రామా - 10 గా పరిగణింపబడే వాజీరా లాంగ్కోర్న్ 2019 లో రాజు గా అభిషిక్తుడయ్యాడు. బ్రిటన్ లో మాదిరి గానే ఇక్కడి రాజవంశానికీ సంప్రదాయపరమైన గౌరవం లభిస్తుంది. ప్రపంచం లోని ధనిక కుటుంబాల్లో ఒకటి. రాజు కి అభిషేక కార్యక్రమాల్ని నిర్వహించే వారిని బ్రాం లువాంగ్ లుగా పిలుస్తారు.వీరు ఒకానొక కాలం లో భారత దేశం నుంచి వచ్చిన బ్రాహ్మణులుగా వాళ్ళు భావించుకుంటారు. రామాయణాన్ని థాయ్ రామాకియాన్ అనే పేరు తో వ్యవహరిస్తారు. హనుమంతుని శిల్పాలు అనేక చోట్ల కనిపిస్తాయి.శక్తికి,విజయానికీ గుర్తుగా ఆయన పేరు ని చెబుతారు.


ఇక్కడి సాహిత్యం లో థాయ్ రామాకియన్ కి విశిష్ట స్థానం ఉన్నది. ఆయుర్వేదం ని అభివృద్ది చేయడానికి కట్టిన పట్టణానికి అయోధ్య అనే పేరు పెట్టారు. బౌద్ధ మతాన్ని పాటించేవారు దాదాపు 94 శాతం మంది ఉన్నప్పటికీ బౌద్ధ,హిందూ సంప్రదాయాలు కలగలిసిపోయి కనిపిస్తాయి. శివుడు,విష్ణువు,బ్రహ్మ ఈ ముగ్గురు తమ పేర్లు మార్చుకుని ఇక్కడ కనిపిస్తారు.వాళ్ళ ముగ్గురుని ఫ్రా కువాన్,ఫ్రా నరాయ్, ఫ్రా ఫరోన్ గా వ్యవహరిస్తారు. గణేషుడు సైతం నాట్యం చేస్తూన్న భంగిమ లో కనిపిస్తాడు. థాయ్ వంటకాలు ప్రపంచ ప్రసిద్ది పొందాయి. ఆ దేశం ప్రత్యేకంగా తమ చెఫ్ ల్ని ఇతర దేశాలకి అంబాసిడర్ లుగా పంపిస్తుంది. అంటే వారి ద్వారా తమ దేశానికి టూరిజం ఇంకా పెరుగుతుందని వాళ్ళ ప్రణాళిక.


ఆసియా, యూరపు దేశాలతో పోలిస్తే బంగారం ఖరీదు ఇక్కడ తక్కువ. అయితే విదేశీయులు కొనడానికి పరిమితి ఉన్నది.సుగంధద్రవ్యాలు,థాయ్ సిల్క్, స్పా ప్రోడక్ట్స్, షర్టులు,ఇలా చాలా వాటిని మన వాళ్ళు ఎక్కువ గా కొనుగోలు చేస్తుంటారు. అరవై రోజుల దాకా ఎలాంటి వీసా లేకుండా థాయ్ లాండ్ లో భారతీయులు ఉండవచ్చు. గతం లో ఈ పరిమితి తొంభై రోజులుగా ఉండేది. బ్యాంకాక్ లో ఎనభై వేలకి పైగా భారతీయ మూలాలు ఉన్న ప్రజలు ఉన్నారు. థాయ్ కరెన్సీ ని భాట్ అంటారు. మన రూపాయికి రెండు భాట్ లు వస్తాయి.ప్రపంచ ఆర్ధిక వ్యవస్థల పరంగా చెప్పాలంటే థాయ్ దేశానిది 26 వ స్థానం. 1970 లో టూరిజం ని ప్రధాన వనరు గా ఎన్నుకున్న ఆ దేశం అప్పటి నుంచి ఇప్పటిదాకా వెనక్కి చూడకుండా పురోగమిస్తున్నదనే చెప్పాలి. 


-----       

29, డిసెంబర్ 2024, ఆదివారం

బౌన్సర్ కావాలంటే ఎలా ? వారి విధులు ఎలా ఉంటాయి ?

 బౌన్సర్ కావాలంటే ఎలా ? వారి విధులు ఎలా ఉంటాయి ?

---------------------------------------------------------------------------------

ఇవాళా రేపు బౌన్సర్ అనే పేరు బాగా వినిపిస్తోంది. అంతెందుకు,ప్రముఖుల చుట్టూ వలయం లా ఉంటూ వాళ్ళ ని కాపాడే వారిని చూస్తూనే ఉంటాం. సినిమా ప్రముఖులు అయితే ఇహ చెప్పక్కర్లేదు.అదో సందడి. జనాలు తోసుకు వస్తూంటే వాళ్ళని కంట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉంటాం.అసలు ఈ బౌన్సర్ అనే ఉద్యోగం ఎప్పుడు మొదలయింది,ఎందుకు మొదలయింది వాళ్ళ జాబ్ చార్ట్ ఎలా ఉంటుంది ఇలాంటివి తెలుసుకుందాం. మొట్ట మెదటిగా హొరాషియో ఆల్గర్ అనే రచయిత బౌన్సర్ అనే నవల 1875 లో రాశాడు. ఆ తర్వాత నుంచి ఆ పేరు బాగా ప్రసిద్ధి పొందింది. ప్రముఖుల రక్షణ కే కాకుండా పబ్ ల వద్ద, జనాలు బాగా వచ్చే ఈవెంట్ల వద్ద,రెస్టారెంట్ల వద్ద, రకరకాల కంపెనీ ఆఫీసుల వద్ద ఇలా చాలా చోట్ల వీరి అవసరం ఉంటుంది. 

అమెరికా వంటి దేశాల్లో బౌన్సర్ జాబ్ కి విపరీతమైన రాబడి ఉంటుంది. చాలా మంది ప్రముఖులు బౌన్సర్లు లేకుండా బయటకి రారు.ప్రస్తుతం మన దేశం లో కూడా ఈ జాబ్ కి బాగా గిరాకీ ఉంది.అయితే అందరకీ ఒకే రకమైన ఆదాయం ఉంటుందని చెప్పలేము.మంచి నైపుణ్యం, అనుభవం ఉన్నవారికి నెలకి 4 లక్షల రూపాయల పైనే ఉంటుంది. కొత్తగా వచ్చేవారికి 20 వేల రూపాయల నుంచి మొదలవుతుంది.బౌన్సర్ వృత్తి అంత సులభమనదేమీ కాదు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి.ప్రతి రోజు తమ బాడీ నీ ఫిట్ గా ఉంచుకోవాలి. దానితో పాటుగా స్వయం నియంత్రణ ఉండాలి. తమ తోటి బౌన్సర్ లతో నెట్ వర్క్ కలిగి ఉండాలి.అప్పుడు మంచి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే నోటిమాట తో పెద్ద పెద్ద కంపెనీలు ఆయా నైపుణ్యాలు ఎక్కువ ఉన్నవారిని నియమించుకుంటాయి.

కనీసం ప్లస్ టూ చదువు ఉండాలి.ఏదైనా డిగ్రీ ఉంటే మరీ మంచిది. ఇంగ్లీష్ భాష పై మంచి పట్టు ఉండాలి. ప్రముఖులతో మెలిగేటప్పుడు అది చాలా అవసరం.ఎంట్రీ లెవెల్ లో చిన్న చిన్న రెస్టారెంట్ల వద్ద పనిచేయడానికి వెనుదీయకూడదు.దానివల్ల అనుభవం వస్తుంది. మాబ్ సైకాలజీ తెలుసుకోవడం, వాళ్ళని నియంత్రించడం లో ఆ అనుభవం ముందు ముందు పనికొస్తుంది. గేట్ల వద్ద నిలబడి వచ్చీపోయే వారిని పరిశీలించడం,ఎవరు గొడవ చేసే మూడ్ లో ఉన్నారు అనేది కనిపెట్టడం, వాళ్ళని అదుపు చేయడం ఇలాంటివన్నీ వారు చేయాలి.తాము చేసే పని కి ఎలాంటి మార్షల్ ఆర్ట్స్ ఉపయోగపడతాయి అనేది గుర్తించి వాటిని క్రమం తప్పక సాధన చేయాలి. ప్రఖ్యాత అమెరికన్ నటుడు విన్ డీసెల్ కూడా కొంత కాలం బౌన్సర్ గా పనిచేశాడు.    

త్రాగుబోతులు గా మారినా, విధుల పట్ల నిర్లక్ష్యం గా ఉన్నా సెక్యూరిటీ సంస్థలు వీరిని సహించవు. వెంటనే తొలగిస్తాయి,కాబట్టి జాగ్రత్త గా ఉండాలి. మన దేశం లో మిరాజ్ సెక్యురిటాస్ అనే సంస్థ ఎక్కువ గా బౌన్సర్ లని అవసరం ఉన్న సెలెబ్రెటీలకి ఇతర కంపెనీలకి సరఫరా చేస్తుంది. ఢిల్లీ కి దగ్గర లో ఉన్న అసోలా ఫతేపూర్ అనే గ్రామం నుంచి మన దేశం లో ఎక్కువ గా బౌన్సర్ వృత్తి లోకి వస్తున్నారని గణాంకాల్లో తేలింది. వీళ్ళు అంతా చాలావరకు గుజ్జర్ కమ్యూనిటీ కి చెందినవారు. ప్రస్తుతం స్త్రీలు కూడా ఈ జాబ్ వైపు మక్కువ చూపుతున్నారు. మెహరున్నీసా షౌకత్ అలీ అనే షహరన్ పూర్ కి చెందిన ఆమె మన దేశం లో మొదటి లేడీ బౌన్సర్. ప్రస్తుతం ఈమె పాపులర్ కేఫ్ అనే ఢిల్లీ కి చెందిన సంస్థ కి రక్షణ కల్పిస్తోంది. ఇంకా సెలెబ్రెటీస్ కి కూడా బౌన్సర్ గా తన సేవల్ని అందిస్తున్నది.   

--- 

24, నవంబర్ 2024, ఆదివారం

"క" సినిమా ఎలా ఉందంటే...


క అనేపేరే ఓ సినిమా కి పెట్టడం వెరైటీ గా ఉంది. డైరెక్ట్ తెలుగు సినిమా ల్లో కొత్తదనం లేదనే వాళ్ళకి సమాధానం లా ఉంది. ఇలాంటి ప్రయోగాలు చేసే యువతరాన్ని ప్రోత్సహించవలసిన బాధ్యత అందరి మీదా ఉంది. సినిమా రెండు లేయర్ల లో సాగుతుంది.ఒకటి తనలో తనకి జరిగే ఘర్షణ.అది గదుల్లో బంధించి మనషుల్ని టార్చర్ చేసే సీన్లు.అవి నిజానికి ఎవరో కాదు.ఎవరికి వాళ్ళే. అది అందరికీ అర్ధం కావడానికి కొద్దిగా కిందికి దిగి కథ చెప్పడం జరిగింది.

అనాథ పిల్లవాడి గా బాల్యం గడిపిన హీరో తన అలవాట్లు ఏ విధంగా కర్మ బంధమై తనకి చుట్టుకున్నాయి అనేది ఇంకో ఉపకథ లో జోడించి చక్కగా చెప్పారు దర్శకులు.రెండు కథల్ని కలపడం దానికి తగిన నేపథ్యాన్ని రూపొందించడం మామూలు విషయం కాదు.గ్రామీణ వాతావరణం,పోస్టల్ శాఖ పని,అక్కడ నుంచి జరిగే గర్ల్స్ ట్రాఫికింగ్ సహజత్వానికి దగ్గరగా ఉండి మన పక్కనే కథ నడుస్తున్న అనుభూతి కలుగుతుంది.

ఇటీవల కాలం లో తెలుగు లో వచ్చిన ఓ ఆలోచనాత్మక సినిమా అని చెప్పాలి.చెన్నయ్ లో కూడా ఆడియన్స్ బాగుందని రాస్తున్నారు.అక్కడ థియేటర్లు కొన్ని పెంచమని ఈ సినిమా వాళ్ళు అడిగితే నో అన్నారట.తమిళ సినిమా ఏ మాత్రం వెరైటీ గా ఉన్నా మనం బ్రహ్మరథం పడతాం. కానీ మన తెలుగు సినిమా కి తగినన్ని థియేటర్లు ఇవ్వకపోవడం శోచనీయం.

క సినిమా లోని సైడ్ పాత్రలు కూడా బాగున్నాయి.హీరోయిన్ గా వేసిన అమ్మాయి,అలాగే టీచర్ గా నటించిన అమ్మాయి బాగున్నారు.సస్పెన్స్ ని అనేకచోట్ల పెట్టడం తో సీట్ల కి అతుక్కుపోయి చూసే పరిస్థితి ఉంటుంది.కృష్ణగిరి అనే ఆ గ్రామం సినిమా అయిపొయిన తర్వాత కూడా ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతుంది.సంగీతం,ఫోటోగ్రఫీ బావున్నాయి.పాటలు లేకపోయినా సినిమా కి పెద్ద లోటు ఏమీ ఉండదు.     

14, జులై 2024, ఆదివారం

"కల్కి " సినిమా పై నా అభిప్రాయం

 "కల్కి 2898"  అనే సినిమా ని ఎట్టకేలకు నిన్న చూశాను. తర్వాత ఈ నా అభిప్రాయాన్ని రాయలేకుండా ఉండలేకపోతున్నాను. కాశీ-కాంప్లెక్స్-శంబల ...మొత్తానికి మూడు ప్రదేశాల్ని అడ్డు పెట్టి మనల్ని ఏవో లోకాలకి తీసుకుపోయారు.

 ప్రతి పాత్ర అదేమిటో అప్పుడే తెలుగు నేర్చుకుని వచ్చి , వచ్చీ రాని భాషలో ఏదో మాట్లాడిపోయారు. ఆ యాస ఓరి నాయనో. ఒక్క ప్రభాస్ మాత్రం ప.గో.జీ. యాస లో యమ స్పీడు గా మాట్లాడుకుంటూ పోయాడు,కొన్ని డైలాగులు స్పీడు లో అర్థమవ్వవు. 

అదంతే. ఇక గ్రాఫిక్స్ గురించి, ఇలాంటివి హాలీవుడ్ లో ఎన్ని వచ్చాయి, ఎన్ని చూశాం...కానీ ప్రపంచం లో ఇంతవరకు ఎక్కడా రానట్టు ప్రచారాలు.


అశ్వత్థామ కి సంభందించిన మహా భారతం లోని ఎపిసోడ్ ని కల్కి కి ముడిపెట్టి ,ఆపై కాంప్లెక్స్ లో జరిగే ప్రయోగాలు ఈ రెంటికీ ముడివేసి చేసిన ప్రయోగం పరమ కృతకం గానూ,ఎబ్బెట్టు గానూ తోచింది.

సినిమా లో సంగీతం గురించి చెప్పాలంటే ,అసలు ఆ పాటలు ఒక్కటీ మనకి అర్థం కావు.అది తెలుగా ,తెలుగు లాంటి మరో భాషా అనిపిస్తుంది. 

పెద్ద తారల్ని ఖర్చు కి వెరవకుండా పెట్టారు బానే ఉంది గాని అసలైన ఆత్మ అది మాత్రం ఘోరంగా మిస్ అయింది.సినిమా మొత్తం అంతు పొంతూ లేని కలగా పులగం లా ఉంది.

మిలటరీ ట్రక్కుల్లాంటి టక్కు టమార వాహనాలు వాటి మధ్య జరిగే పోరాటాలు చందమామ కథ ల్ని తలపింపజేస్తాయి. ఆసక్తి కరం గా ఏ మాత్రం లేకుండా గ్రాఫిక్స్ ని, పెద్ద తారల్ని నమ్ముకుని సినిమా తీశారు. 

ఆ రెండూ ఏ మాత్రం రంజింప జేయవు సరికదా పరమ బోర్ పుట్టిస్తాయి.ఎంతో హైప్ క్రియేట్ చేసిన మూవీ ప్రేక్షకుడిని సంతృప్తి పరచలేకపోయింది.బాహుబలి తో పోల్చడం అవివేకం. 

దీపికా పడుకునే ఇంకా కాంప్లెక్స్ దృశ్యాలు వెగటు పుట్టిస్తాయి. అసలు సినిమా కథ నే తలా తోక లేని యవ్వారం లా అనిపిస్తే అది చూసేవాళ్ళ తప్పు కాదు.  

20, మే 2024, సోమవారం

రస్కిన్ బాండ్ ఇంగ్లీష్ లో రాసినప్పటికీ భారతీయ సాహిత్యం లో మరువరాని ఓ ప్రత్యేక సంతకమని చెప్పకతప్పదు.

 కేంద్ర సాహిత్య అకాడెమీ ఇటీవల రస్కిన్ బాండ్ అనే రచయిత కి అత్యున్నతమైన ఫెలోషిప్ ని ఇచ్చి గౌరవించింది. రస్కిన్ బాండ్ అనగానే ఇంగ్లీష్ పాఠకులకి వేరే చెప్పనవసరం లేదు. కానీ మన తెలుగు పాఠకులకి తెలియవలసినంత తెలియదేమో ! 

కావలసినన్ని అనువాదాలు కాకపోవడమే కారణం కావచ్చు. ఈ నెల లో 90 వ యేటి లోకి ప్రవేశిస్తున్న ఆయన మౌలికంగా పిల్లల కోసం రాసినప్పటికీ పెద్దవాళ్ళని కూడా బాగా ఆకట్టుకుంటాయి. 

దాదాపుగా 500 కథలు రాశారు.ఇవి కాక నవలలు,ట్రావెలోగ్ లు,వ్యాసాలు ఇలా ఇతర ప్రక్రియల్లోనూ సిద్ధహస్తులు.

1938 లో బ్రిటీష్ దంపతులకి హిమాచల్ ప్రదేశ్ లోని కాసూలి లో జన్మించారు. అయితే మన దేశాన్నే ఆవాసంగా చేసుకున్నారు.

 ప్రస్తుతం ముస్సోరి లో హిమాలయ సానువుల్లో నివసిస్తున్నారు.ఆయన రచనలన్నీ ఆ అడవులు,జంతువులు,కీటకాలు,పక్షులు అన్నీ ఆ ప్రాంతాలనుంచే ఆధారంగా చేసుకొని రాయబడ్డాయి. 

బ్రిటీష్ వారు ఉన్నప్పటి కాలం లోకి వెళ్ళి మనకి అప్పటి జీవితాన్ని చూపిస్తారు. తన జీవితాన్నే చాలామటుకు తన రచనల్లో వెల్లడించారు. ద రూం ఇన్ ద రూఫ్ అనే నవలిక ద్వారా ఆయనకి మంచి ప్రొత్సాహం లభించింది.

ఇక ఆ తర్వాత నుంచి ఆపకుండా రాస్తూనే ఉన్నారు. ముంబాయి నుంచి వచ్చే ఓ ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక కి సంపాదకులు గా పనిచేశారు. ఆ తర్వాత దాన్ని విరమించుకొని పూర్తి స్థాయి రచయిత గా ఉండిపోయారు. 

అనేక ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాల్లో ఆయన కథలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరికి ఓ నాస్టాల్జిక్ అనుభూతి ఉంటుంది.కొన్ని నవలల్ని ,కథల్ని సినిమాలుగా తీశారు.జునూన్ సినిమా ఆ కోవలోనిదే. బాండ్ ఇంగ్లీష్ భాష కూడా సింపుల్ గా ఉంటుంది. 

అదే విషయాన్ని ప్రస్తావిస్తే క్లారిటీ గా ఉండటం తనకి ముఖ్యమని దానిలో భాగం గానే నా రచనలు అలా ఉంటాయని అంటారు.

బాండ్ అభిమానులు అనేక రాష్ట్రాల్లో ఉన్నారు.అంతా కలిసి ఆయన రచనల మీద ఓ డిజిటల్ పత్రిక నడుపుతున్నారు. ముస్సోరి లో ఉన్నకేంబ్రిడ్జ్ బుక్ డిపో లో ఆయన తన అభిమానుల్ని కలిసి ముచ్చటించడం, పుస్తకాలకి సైన్ చేయడం చేస్తుంటారు.

 ఈ మధ్య ఆరోగ్య కారణాల వల్ల ఇంటికే పరిమితమయ్యారని తెలుస్తోంది. అకాడెమీ అధికారులు కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఫెలోషిప్ ని అందజేశారు. రస్కిన్ బాండ్ ఇంగ్లీష్ లో రాసినప్పటికీ  భారతీయ సాహిత్యం లో మరువరాని ఓ ప్రత్యేక సంతకమని చెప్పకతప్పదు.   

2, మార్చి 2024, శనివారం

మొట్ట మొదటిసారిగా అమెరికా వెళ్ళేవారు ఈ విషయాల్ని గమనిస్తే మంచిది.

 మొట్ట మొదటిసారిగా అమెరికా వెళ్ళేవారు ఈ విషయాల్ని గమనిస్తే మంచిది. వీటిని రాసింది ఓ ఒరియా అమ్మాయి, తను నాలుగేళ్ళ కిందట ఆ దేశం వెళ్ళినపుడు పరిశీలించి రాసిన కొన్ని విశేషాలు.


1.అమెరికా లో ఎక్కువ గా ఉండేది చెక్క తో నిర్మించిన ఇళ్ళే.సిమెంట్,ఇటుకలు లాంటి వాటితో మన దేశం లో ఎక్కువ గా ఇళ్ళు నిర్మించుకున్నట్లే అక్కడ ఆ విధంగా నిర్మించుకుంటారు.


2. ప్రతి ఇంట్లో ఫ్లోర్ మీద రగ్గులు పరుస్తారు. కార్పెట్ ల మాదిరిగా అన్నమాట. బాత్ రూం లు అన్నిట్లో కూడా. తుడవడానికి మాపింగ్ కంటే వాక్యుమింగ్ కి ప్రాధాన్యత ఉంటుంది.


3.వాహనాల్లో పెట్రోల్ కొట్టించుకోవడం అంటే మనకి మనం చేతితో కొట్టుకోవడమే. కార్డ్ తో చెల్లించాలి. సెల్ఫ్ సర్వీస్ అన్నమాట.


4. ట్రాఫిక్ రూల్స్ పాటించడం లో ఎలాంటి వాళ్ళకీ సడలింపులు ఉండవు. ఉల్లంఘిస్తే  ఫైన్ లు విపరీతంగా ఉంటాయి.


5. ఎక్కడో న్యూయార్క్ లాంటి నగరాల్లో తప్పా జనాలు చాలా తక్కువ గా రోడ్ల మీద కనిపిస్తారు. కార్లు ఎక్కువ గా కనిపిస్తాయి.


6.ఇంచు మించు చాలా చిన్న ఊర్లలో కూడా రోడ్లు చాలా వెడల్పుగా ఉండి మన నేషనల్ హైవే ల మాదిరిగా ఉంటాయి.


7. జనాలు స్ట్రైట్ గా ఉంటారు. మీరు నచ్చితే అడగడానికి వెనకాడరు. ఇతరత్రా సమయం వృధా చేయడం ఉండదు. 


8. హోటళ్ళ లో రేట్లు ఎక్కువ. ఆహారం ఎక్కువ క్వాంటిటి లో పెడతారు. 


9. హోటళ్ళ లో కాంప్లిమెంటరి వాటర్ బాటిల్స్ ఇవ్వరు.


10.హై ప్రొఫైల్ చూసి ప్రత్యేకం గా ఎవరికీ ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం ఉండదు. రెస్టారెంట్ లో క్లీనింగ్ పనిచేసే వ్యక్తికైనా, పెద్ద అధికారి అయినా సహజంగా సాటి మనిషికి ఇచ్చే గౌరవం ఇస్తారు.


11. పెంపుడు జంతువుల్ని మనుషులతో సమానం గా ట్రీట్ చేస్తారు.


12. కొత్త ఆలోచన దేన్నైనా స్వాగతిస్తారు.     


 

4, ఫిబ్రవరి 2024, ఆదివారం

గద్దర్ పేరు మీద సినిమా అవార్డులా...ఓర్నీ

 

గద్దర్ పేరు ని సినిమా వాళ్ళ కి ఇచ్చే అవార్డ్ లకి పెడదామనే టాక్ ఒకటి బయటకి వచ్చింది. జన బాహుళ్యం లో రకరకాలుగా చర్చ జరుగుతోంది. అసలు ఆ పేరు ని పెడదామనే ఊహ రావడమే విచిత్రం. ఆయన కొన్ని సినిమాల్లో పాటలు పాడాడు. కొన్ని సినిమాల్లో కనిపించాడు. కాని మౌలికంగా తెలుగు సినిమా కి చేసినది ఏముందని..? పెద్దగా ఏమీ లేదు. అంతకంటే సినిమా కి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

గద్దర్ ప్రధానంగా ప్రభుత్వ విధాన వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు. విప్లవ గీతాలతో ఉర్రూతలూగించి యువత ని అడవుల్లోకి వెళ్ళేలా చేశాడు.అనేకమంది చావులకి పరోక్షం గా కారణమయ్యాడు. తను వయసు లో ఉన్నప్పుడు అలా చేసి వయసు మళ్ళిన కాలం లో ఏ పార్టీలనైతే తిట్టాడో అదే పార్టీల్లో చేరాడు. ఇంకా ఆ తర్వాత జరిగినవి అన్నీ అందరకీ తెలిసినవే. భద్రం కొడుకో...అనే పాట గాని , మదనా సుందరి ..అనే పాటగాని...ఇంకా ఆయనకి పేరు తెచ్చిన చాలా పాటలు ఆయన రాసినవి కావు.

అంజయ్య ఇంకా మిగతా వాళ్ళు రాసినవి.కాని వాళ్ళు రాసినట్లు స్టేజ్ ల మీద ఎక్కడా చేప్పేవాడు కాదు. ఆ విధంగా చాలా పేరు తెచ్చిన పాటలు ఆయన సొంత రచనలే అనుకుంటారు చాలామంది. ఇక సొంత కుటుంబం లో పిల్లలు మాత్రం ఉద్యమం లోకి పోకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇలా చెప్పుకుపోతే చాలా ఉన్నాయి. ఎంతో మంది చావులకి కారణమై,మళ్ళీ ఉద్యమం నుంచి బయటకి వచ్చి పాత పాపులారిటి తో కొత్త జీవితాన్ని గ్లామర్ ని సాధించుకునే వీళ్ళు , వీళ్ళ ప్రభావం వల్ల గర్భశోకం అనుభవించిన తల్లిదండ్రులకి ఏం సమాధానం చెబుతారు. 

కనక సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డ్ లకి గద్దర్ పేరు పెట్టడం నూటికి నూరు పాళ్ళు తలతిక్క పని. ఈ ఆలోచన ఎందుకు ఎవరకి వచ్చిందో మరి.సరైన వాళ్ళ పేర్లు దొరక్కపోతే ప్రభుత్వం పేరు మీద ఇవ్వండి. నష్టం ఏముంది.      

6, డిసెంబర్ 2023, బుధవారం

అమెరికా నుంచి ఒక గుజరాతి విద్యార్థి రాసిన అనుభవాలు

 


జెనిల్ దేశాయ్ అనే గుజరాతి విద్యార్థి అమెరికా లో ఎం.ఎస్. చదువుతూ తన అనుభవాల్ని ఈ విధంగా రాశాడు. ఇంకా రాయడానికి ఓ బుక్ అంత ఉంది గానీ ముఖ్య అంశాలు మాత్రం ప్రస్తావించడం జరిగింది.


యు.ఎస్. లో మీరు గొప్ప రాక్ స్టార్ అయినా, మామూలు మనిషి అయినా గొప్ప తేడా ఏమీ ఉండదు.మామూలు గానే చూస్తారు.

ప్రతి విషయాన్ని సొంతగానే నేర్చుకోవాలి.

జీవితం ఇక్కడ స్ట్రగుల్ గా ఉంటుంది. కాని దానికి తగ్గ వినోదం కూడా ఉంటుంది. నిజమైన ప్రపంచం ఏ సూత్రాల మీద పని చేస్తుందో అర్థమవుతుంది.
ఏ ఫీల్డ్ లో గానీ అనుభవం అనేదానికి ఎక్కువ విలువ ఉంటుంది.

లైబ్రరీ లో చదువుతూ ఎక్కువ సమయం గడపవలసిందే. ప్రతి చిన్న విషయాన్ని ప్రొఫెసర్స్ చెప్పరు.

ఏదీ ఉచితం గా రాదు. ప్రతిదాన్ని శ్రమించి పొందవలసిందే.

చాలామందికి మనకన్నా ఎక్కువ విషయాలు తెలిసిఉంటాయి.అది మనకి తెలిసిపోతూనే ఉంటుంది.

ఇక్కడ ఏ భారతీయునికి ఇంకో భారతీయుడు సాయపడడు. ఇదొక చేదు నిజం.
సీనియర్స్ ముందు కొద్దిగా హెల్ప్ చేసినా, సెమిస్టర్ మొదలయితే వాళ్ళు ఆ తర్వాత హెల్ప్ చేయరు.కాబట్టి సీనియర్స్ మీద ఎక్కువ ఆధారపడకూడదు.

మనతో ఏదైనా పని ఉంటేనే జనాలు పిలుస్తారు. దేనికి ప్రతిస్పందించాలో మనం నిర్ణయించుకోవాలి.

29, నవంబర్ 2023, బుధవారం

మెడిసిన్ చదవడానికి కిర్గిస్తాన్ వెళుతున్నారు, సరే... అక్కడ క్వాలిటి ఎలా ఉందో ?


 ఈ మధ్య వైద్యశాస్త్రం చదవాలంటే చాలామంది విదేశాలు వెళ్ళిపోతున్నారు. దానికి కారణాలు లేకపోలేదు. మన దేశం లోని చాలా మెడికల్ కాలేజీలు ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీలు వసూలు చేసే ఫీజులు భయంకరం గా ఉండి మధ్య తరగతి కుటుంబాలు భరించలేని స్థితిలో విదేశాలకి వెళ్ళిపోతున్నారు.  ప్రతి ఏటా ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది అభ్యర్థులు నీట్ పాసవుతున్నారు. కానీ ఉన్న సీట్లు దేశం మొత్తం మీద తొంభై వేలు మాత్రమే..!

హంగరీ,కజాన్, బెలారస్, కిర్గిస్థాన్, చైనా ,ఫిలిప్పైన్స్ లాంటి దేశాలకి మన వాళ్ళు వైద్యవిద్య కోసం వెళుతున్నారు. కిర్గిస్తాన్ లాంటి దేశాల్లో ఒక సంవత్సరం కి గాను మూడన్నర నుంచి అయిదు లక్షలు చెల్లించవలసి ఉంటుంది.ఎక్కువ లో ఎక్కువ ఇరవై లేదా పాతిక లక్షల్లో వైద్య విద్య మొత్తం అయిపోతుంది. కానీ అదే మన దగ్గర ఒక్క సంవత్సరానికి గాను పాతిక లక్షల నుంచి కోటి రూపాయలకి పైగా ప్రైవేట్ కాలేజీల్లో చెల్లించాలి.కిర్గిస్తాన్ లో వైద్యవిద్య అభ్యసించిన గ్రాడ్యుయేట్ కి ఎం సి ఐ, డబ్ల్యు హెచ్ ఓ  లాంటి సంస్థలు సైతం గుర్తింపు నిస్తున్నాయి.

మన నీట్ స్కోర్ ని  కూడా ఆ దేశాలు గుర్తిస్తున్నాయి. నాణ్యత పరంగా కూడా మంచి విద్యనే అవి తక్కువ ధర లో అందిస్తున్నాయి.కనుకనే మనవాళ్ళు క్యూ కడుతున్నారు.ఆసియా దేశాల్లో పాకిస్తాన్,బంగ్లాదేశ్ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళుతున్నారు. ప్రతి ఏటా సుమారు పాతికవేలమంది వైద్యవిద్య నిమిత్తం మన దేశం నుంచి బయటకి వెళుతున్నారు. అదే విధం గా మన మెడికల్ గ్రాడ్యుయట్ లు ప్రతి ఏటా అయిదువేల మంది ఇతర దేశాలకి ఉద్యోగనిమిత్తం వెళుతున్నారు.ఆస్ట్రేలియా,కెనడా,ఇంగ్లాండ్,అమెరికా,నెదర్ లాండ్స్ లాంటి దేశాల్లో మెరుగైన వేతనాల కోసం వెళుతున్నారు.